Ambati Rayudu: అంబటి రాయుడు బరిలోకి దిగేది అక్కడి నుంచేనా….?
క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. ఇంతకాలం క్రికెట్ పిచ్‌పై పరుగుల వరద పారించిన ఈ క్రికెటర్ ఇకపై పొలిటికల్ పిచ్‌లో బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. అయితే ఎక్కడ్నుంచి పోటీ చేయబోతున్నాడు?
క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. ఇంతకాలం క్రికెట్ పిచ్‌పై పరుగుల వరద పారించిన ఈ క్రికెటర్ ఇకపై పొలిటికల్ పిచ్‌లో బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. అయితే ఎక్కడ్నుంచి పోటీ చేయబోతున్నాడు అంటూ ఇంతకాలం వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అక్కడ ఓ ఆఫీస్ కూడా తెరిచేస్తున్నాడు అంబటి రాయుడు…
క్రికెట్ గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారెవరికైనా గుంటూరు మిర్చిలాంటి కుర్రోడు అంబటి రాయుడు గురించి తెలిసే ఉంటుంది. గత సీజన్ వరకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అయితే బ్యాటును పక్కన పడేసి పొలిటికల్ జెండా పట్టుకోవాలని చాలాకాలం క్రితమే డిసైడైపోయాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతోనే అంబటి రాయుడు పాలిటిక్స్‌లోకి వస్తాడని తేలిపోయింది. అయితే ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడు… చేస్తే ఎంపీగా చేస్తాడా… ఎమ్మెల్యేగా చేస్తాడా…? అన్న ప్రశ్నలు ఇంతకాలం పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ తిరిగాయి. వాటికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
అంబటి రాయుడు గుంటూరు నుంచే బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు అంబటి రాయుడు సిద్ధమైనట్లు చెబుతున్నారు. గుంటూరులోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఐటీసీ సమీపంలో రాయుడు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అడ్రస్ అక్కడకు మార్చేస్తున్నాడు. దీంతో గుంటూరు కేంద్రంగా రాయుడు పాలిటిక్స్ చేయబోతున్నట్లు భావిస్తున్నారు. అంబటి రాయుడి సన్నిహితులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇక నుంచి గుంటూరు కేంద్రంగానే రాయుడి పర్యటనలు ఉండబోతున్నాయంటున్నారు. ఇప్పటికే జిల్లాను తెగ చుట్టేస్తున్నాడు రాయుడు.
రాయుడు పాలిటిక్స్‌లోకి వస్తాడన్నప్పటి నుంచి ఎక్కడ పోటీ చేస్తాడన్నదానిపై రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. కొన్నాళ్లు పొన్నూరు నుంచి పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తేలిపోయింది. మరికొన్ని నియోజకవర్గాల పేర్లూ తెరపైకి వచ్చాయి. అయితే అవేమీ కాదని ఇప్పుడు గుంటూరు పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగానే బరిలోకి దించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన హామీతోనే అంబటి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నాడట. పైగా గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు బలమైన నేతల కోసం వైసీపీ అన్వేషిస్తోంది. గతంలో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రస్తుతం అంత యాక్టివ్‌గా లేరు. ఆయనకు మరోసారి సీట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేనట్లు తెలుస్తోంది. మోదుగుల కూడా ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అంబటిని గుంటూరు పిచ్‌పై బరిలోకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్‌గా అంబటికి ఉన్న క్రేజ్ మిగిలిన చోట్ల కూడా ఎంతో కొంత తమకు కలసి వస్తుందని వైసీపీ అధినేత భావిస్తున్నారు.
నిజానికి గుంటూరు ఎంపీగా సినీనటుడు ఆలీ పేరు కూడా వినిపించింది. ముస్లిం ఓట్లను లెక్కలేసుకుని ఆలీని బరిలోకి దించడం ఖాయమన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అంబటి బ్యాటింగ్‌కు వస్తుండటంతో అలీ పేరు వెనక్కు వెళ్లిపోయింది. ఆయన్ను వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించొచ్చు. లేదంటే ఎమ్మెల్సీగా పంపుతారని చెబుతున్నారు. అయితే ఇదంతా ఇప్పటి సీన్ మాత్రమే. ఎన్నికల నాటికి ఎన్ని సమీకరణాలు మారతాయో, ఇంకెంతమంది తెరపైకి వస్తారో చూడాలి మరి.