Ambati Rayudu: అంబటి రాయుడు తెలంగాణలో పోటీ చేస్తున్నారా? అంబటిపై కాంగ్రెస్ కన్నేసిందా?

అంబటిని తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అంబటిని సంప్రదిస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ అంబటితో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 1, 2023 | 01:29 PMLast Updated on: Jun 01, 2023 | 1:29 PM

Ambati Rayudu Will Contest In Telangana Congress Trying To Bring Him Into Party

Ambati Rayudu: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయాలవైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు రాయుడు ప్రకటనల ద్వారా తెలిసింది. ఈ మేరకు వైసీపీ పెద్దలతో అంబటి సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగాలనుకుంటున్నారు. కాగా, అంబటిని తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అంబటిని సంప్రదిస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ అంబటితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అంబటిని కాంగ్రెస్‌లోకి తెచ్చే బాధ్యతను పార్టీ పెద్దలు అజారుద్దీన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్‌గా, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజార్‌కు అంబటితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అంబటితో అజార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంబటిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికై, రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్ల ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో బలమైన నేతకోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది.

ఈ నేపథ్యంలో అంబటి అయితే బాగుంటుందని ఆ పార్టీ పెద్దలు నిశ్చయించారు. దీనికి అనేక కారణాలున్నాయి. అంబటి రాయుడు ఏపీకి చెందిన వ్యక్తి. పైగా కాపు సామాజిక వర్గం. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. అందుకే ఏపీ వ్యక్తి.. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతడైతే గెలుపు సులభమవుతుందని కాంగ్రెస్ అంచనా. అందుకే అంబటి రాయుడిని కాంగ్రెస్‌లోకి తెచ్చి.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయించాలని ప్రయత్నిస్తోంది. అజారుద్దీన్‌తో చర్చల అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంబటి మాత్రం సొంత రాష్ట్రమైన ఏపీ వైపు చూస్తున్నారు.

అధికార వైసీపీ నుంచి, గుంటూరు బరిలో నిలవాలి అనుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా అంబటి విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించి అంబటికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి అంబటి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.