ట్రంపు మాకొద్దీ…కంపు…రగిలిపోతున్న అమెరికన్లు

ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు ఇవి. వాళ్ల సంగతి తేలుస్తా వీళ్ల సంగతి తేలుస్తా అంటూ మధ్యలో మాపై పడ్డావేంటి అంటున్నారు అమెరికన్ సిటిజన్స్. టారిఫ్‌లు పెంచి వాళ్లను దారికి తేవడం ఏమో కానీ మా చావుకు తెచ్చావంటూ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 09:55 AMLast Updated on: Apr 07, 2025 | 9:55 AM

Americans Serious On Trump

ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు ఇవి. వాళ్ల సంగతి తేలుస్తా వీళ్ల సంగతి తేలుస్తా అంటూ మధ్యలో మాపై పడ్డావేంటి అంటున్నారు అమెరికన్ సిటిజన్స్. టారిఫ్‌లు పెంచి వాళ్లను దారికి తేవడం ఏమో కానీ మా చావుకు తెచ్చావంటూ రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ‘హ్యాండ్స ఆఫ్‌’ పేరుతో ఆందోళనలకు దిగారు. దాదాపు 150 గ్రూపులకు చెందిన నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని వాషింగ్టన్‌ సహా 50 రాష్ట్రాల్లో 12వందల చోట్ల ఈ ప్రదర్శనలు జరిగాయి. పౌరహక్కుల, కార్మిక, న్యాయవాద, సీనియర్ సిటిజన్ ఇలా పలు గ్రూపులు ఇందులో పాల్గొన్నాయి. ప్రభుత్వ చర్యలు, ఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అరాచకం, మానవహక్కుల ఉల్లంఘన ఇలా పలు అంశాలపై వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్‌ తీరుపై కూడా అమెరికన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2017 ఉమెన్స్‌ మార్చ్‌, 2020 బ్లాక్‌ లైవ్స్‌ మేటర్ ప్రొటెస్ట్‌ తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో నిరసనలు ఇదే మొదటిసారి.

ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శనలకు విపక్షాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల తొలగింపు, డిపోర్టేషన్, ఆరోగ్య పథకాలకు నిధుల కోత, ట్రాన్‌జెండర్స్‌ హక్కుల తొలగింపు వంటి ఇతర వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు పిలుపునిచ్చాయి. వీటిని క్రమంగా ఉధృతం చేయాలని అవి భావిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలను సమర్ధించుకుంటోంది. అమెరికాను నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకే ఈ చర్యలు అని బలంగా చెబుతున్నారు ట్రంప్.

మరోవైపు అమెరికన్లు సూపర్‌మార్కెట్లపై పడ్డారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న ఉత్పత్తులపై 10శాతం సుంకాలు విధిస్తున్నారు. త్వరలో పలు దేశాలపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ధరలు పెరిగేలోగానే వస్తువులు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అమెరికాకు సీఫుడ్స్‌ వంటివి చైనా, భారత్‌ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు పన్ను పోటు పడటంతో వాటి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు కూడా కొండెక్కుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా సాధ్యమైనంత కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చైనా, తైవాన్‌ల నుంచి మరో మూడురోజుల తర్వాత వచ్చే షిప్‌మెంట్లపై భారీగా సుంకాలు వేయనున్నారు. ఇప్పుడు వంద డాలర్లకు వచ్చే వస్తువు ఆ తర్వాత 140-150 డాలర్లు పెట్టాల్సి ఉంటుంది. అందుకే ధరలు పెరగకముందే కొనుగోలు కోసం మార్ట్‌లు, స్టోర్స్‌ బాట పట్టారు. సూపర్‌ మార్కెట్లన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.

పప్పులు, కాఫీ, డెయిరీ ఉత్పత్తులు, మసాలా దినుసులు సహా అన్నీ నాలుగైదు నెలలకు సరిపడా కొని పట్టుకెళ్తున్నారు. వియత్నాం, చైనా నుంచి అమెరికాకు బట్టలు, షూలు, చెప్పులు దిగుమతి అవుతుంటాయి. వాటి రేట్లు పెరుగుతాయన్న భయంతో ఆ షాపుల్లోనూ రద్దీ కనిపిస్తోంది. యూరోపియన్ దేశాల నుంచి దిగుమతయ్యే వైన్‌, బీర్లు, స్కాచ్‌ ధరలు పెరగనుండడంతో లిక్కర్‌ కూడా భారీగా కొనేసి స్టోర్ చేసుకుంటున్నారు అమెరికన్లు. ఆటోమొబైల్ విడిభాగాలన్నీ దిగుమతి చేసుకునేవే కావడంతో కార్ల ధరలు కూడా 3-4వేల డాలర్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందే కార్లు బుక్‌ చేసేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబెట్ల వంటివి చైనా, తైవాన్‌ల నుంచి వస్తుంటాయి. వాటికి మరో 4-5వందల డాలర్లు ఎక్కువ పెట్టాలన్న భయంతో ముందే కొనేస్తున్నారు అమెరికన్లు. చివరకు పిల్లల డైపర్లు కూడా వదలడం లేదు. ఓ అంచనా ప్రకారం అమెరికన్ల నెలవారీ సూపర్‌మార్కెట్‌ బిల్లు కనీసం 4-5వందల డాలర్లు పెరిగిపోతుందన్నది ఓ అంచనా… సగటు అమెరికన్‌కు ఇది చాలా పెద్ద మొత్తం.

అమెరికా సీఫుడ్‌లో 70-80శాతం దిగుమతుల ద్వారానే వస్తుంది. చిలీ, ఇండియా, ఇండోనేషియాల, వియత్నాంల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతుంది. అయితే చిలీపై 10శాతం, వియత్నాంపై 46, ఇండియాపై 27, ఇండోనేషియపై 32శాతం టారిఫ్‌లు వేశారు. దీంతో సీఫుడ్‌ రేట్స్‌ భారీగా పెరుగుతాయని అంచనా. అమెరికన్ కాఫీ ఇక కాస్ట్‌లీ కానుంది. 60శాతం కాఫీని బ్రెజిల్‌, కొలంబియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు వాటిపై 10శాతం టారిఫ్ పడుతోంది. ఇక థాయ్‌లాండ్ నుంచి జాస్మిన్‌ రైస్‌, ఇండియా నుంచి బాస్మతి రైస్‌ను దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ఇప్పుడు అవి కూడా భారం కానున్నాయి.

ట్రంప్ పైకి కాస్త బింకంగానే ఉన్నా లోలోపల ఆయనకు కూడా కాస్త భయంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పలు దేశాలతో అనధికారికంగా ఆయన టీమ్ చర్చలు జరుపుతోంది. ఆ దేశాలు పన్నులు కాస్త తగ్గిస్తే తాము కూడా తగ్గించాలన్న ఆలోచనతో అధ్యక్షుడు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు జరుపుతున్న దేశాల లిస్టులో భారత్‌ కూడా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆ దేశ ఉత్పత్తుల ధరలు తమ దగ్గర పెరగకుండా జాగ్రత్త పడాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికి బాగానే ఉన్నా రానున్న రోజుల్లో అమెరికన్ల ఆగ్రహాన్ని తట్టుకోవడం ఈజీ కాదని ట్రంప్‌కు బాగా తెలుసు. అందుకే దీన్ని తెగేదాకా లాగకూడదని భావిస్తున్నారు. మొత్తానికి తన నిర్ణయంతో ప్రపంచ దేశాల సంగతేమో కానీ అమెరికన్‌ ప్రజలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు ట్రంప్. మరి అమెరికన్ల ఆగ్రహం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి…!