మెక్సికో సరిహద్దుల్లో అమెరికా సైన్యం ,ట్రంప్ ఆటలో మెక్సికో బలి కానుందా?

అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద సవాళ్లు మాదక ద్రవ్యాలు, అక్రమ వలసలే. ఈ రెండు సమస్యలకూ కారణం కెనడా, మెక్సికో సరిహద్దులు. ఎందుకంటే ఇక్కడి నుంచే అగ్ర రాజ్యంలోకి డ్రగ్స్, అక్రమ వలసలు పెరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 08:09 PMLast Updated on: Jan 25, 2025 | 8:09 PM

Americas Army On Mexicos Borders Will Mexico Be A Victim Of Trumps Game

అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద సవాళ్లు మాదక ద్రవ్యాలు, అక్రమ వలసలే. ఈ రెండు సమస్యలకూ కారణం కెనడా, మెక్సికో సరిహద్దులు. ఎందుకంటే ఇక్కడి నుంచే అగ్ర రాజ్యంలోకి డ్రగ్స్, అక్రమ వలసలు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయడంలో ఆ రెండు దేశాలు విఫలమయ్యాయి. ఫలితంగా ట్రంప్ యాక్షన్ మార్చేశారు. మెక్సికో సరిహద్దుకి తమ సైన్యాన్ని తరలించారు. ఐతే, ఈ చర్య వెనుక అక్రమ వలసలను అడ్డుకోవడమే లక్ష్యమైతే పర్లేదు.. అలా కాదని మెక్సికోను అమెరికాలో కలుపుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే సమస్యంతా. ఇంతకూ, డొనాల్డ్ ట్రంప్ ఏ లక్ష్యంతో మెక్సికో సరిహద్దుకి సైన్యాన్ని తరలిస్తున్నారు? సైనిక తరలింపు వెనుక విస్తరణ కాంక్ష ఉందా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందే విస్తరణ వాదాన్ని బలంగా వినిపించిన ట్రంప్.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. ఫిబ్రవరి 1 నుంచి మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. బోర్డర్‌లో అక్రమ వలసల్ని నివారించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ అన్నంతపనీ చేశారు. మెక్సికో సరిహద్దులకు 1500మంది సైనికుల్ని తరలించారు. ఈ అదనపు దళాల్లో 500 మంది మెరైన్ కమాండోలు, ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది, నిఘా ఎక్స్‌ పర్ట్స్ ఉన్నారు. ఈ కొత్త దళాలు ఇప్పటికే మోహరించిన 2వేల 200 యాక్టివ్ డ్యూటీ దళాలు, వేలాది మంది నేషనల్ గార్డ్స్‌తో చేరాయి. అంతేకాదు, త్వరలో ఈ సంఖ్యను పదివేలకు పెంచేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. కానీ, ఇంతమంది సైనికులు మెక్సికో సరిహద్దుల్లో ఏం చేయబోతున్నారు?

నిజానికి.. ట్రంప్ తన మొదటి టర్మ్‌లోనే మెక్సికోకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గ్వాటిమాలా, హోండురాస్, ఎల్‌ సాల్విడార్‌ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి అక్రమ వలసదారులు ప్రవేశించకుండా అడ్డుకోకపోతే సరిహద్దులలోకి సైనికులను దించుతానని హెచ్చరించారు. అంతే కాదు వలసదార్లను అడ్డుకోకపోతే పెండింగ్‌లో వున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంనుంచి వెనక్కి మళ్లుతామనీ బెదిరించారు. ఈ నేపథ్యంలో వలస దార్లను అడ్డుకునేందుకు.. మెక్సికో ప్రభుత్వం భారీగా పోలీసులను రంగంలోకి దించింది. అదే సమయంలో మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా, చిపాస్‌లో వుండేటట్టయితే.. వారికి తాత్కాలిక వర్క్‌ పరిమిట్లు ఇస్తామని, పాఠశాలల్లో చేరేందుకు, వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని మెక్సికో ప్రకటించింది. అయితే అత్యధిక వలసదార్లు దీన్ని కొట్టిపడేశారు. అమెరికా వెళ్లేందుకే మొగ్గు చూపారు. దీంతో అమెరికాకు అక్రమ వలసలు అడ్డుకోవడంలో మెక్సికో ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు కూడా అక్రమ వలసలను అడ్డుకోవడం మెక్సికో ప్రభుత్వంతో కాని పని. అందుకే, ఆ దేశ సరిహద్దులకు తన సైన్యాన్ని పంపించారు. అయితే, ఈ సైనిక తరలింపు వెనుక ట్రంప్ మరో వ్యూహం ఉందనే అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ అమెరికా విస్తరణ ప్రస్తావనే అధికంగా చేశారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫొటోలను షేర్‌ చేయడం, డెన్మార్క్‌ స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన గ్రీన్‌ల్యాండ్‌, పనామా కాలువను విలీనం చేసుకుంటామని పేర్కొనడం, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారుస్తానని చెప్పడం అందులో భాగమే. ఈ వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్రంగా మండిపడినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. సైనిక శక్తిని ఉపయోగించి విలీనం చేస్తారా? అన్న ప్రశ్నలకు ఆర్థిక శక్తిని వాడుతానని స్పష్టం చేస్తూనే.. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్‌ విలీనంపై సైనిక, ఆర్థిక శక్తిని వినియోగించనని హామీ ఇవ్వలేనన్నారు. పనామా కాలువను సైనిక అవసరాల కోసం అమెరికా నిర్మించినట్లు వ్యాఖ్యానించారు. చివరికి చెప్పినట్టే అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పేరు మార్చేశారు. ఇప్పుడు మెక్సికో సరిహద్దులకు సైనికుల్ని పంపించి మరో షాక్ ఇచ్చారు. ఈ తరలింపు వెనుక గల్ఫ్ ఆఫ్ మెక్సికోను పేరు మార్చినంత ఈజీగా స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు అవకాశమూ లేకపోలేదు.
.

గల్ఫ్ ఆఫ్ మెక్సికో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం. దీని చుట్టూ మెక్సికోకు చెందిన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా, అలబామా, మిసిసిపి, లూసియానా, టెక్సాస్ రాష్ట్రాలు, క్యూబాలోని పినర్, డెల్ రియో, అర్టెమిసా ప్రావిన్స్ లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో తీరం ఉంది. సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతి పెద్దది గల్ఫ్‌ ఆఫ్ మెక్సికోనే. అమెరికా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో 14 శాతం, 5 శాతం సహజవాయువు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. మెక్సికోకు సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఆ దేశానికి అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. మెక్సికో ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోందీ ఇదే. అందుకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోపై ట్రంప్ కన్ను పడిందన్న వాదనలే లేకపోలేదు.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మొత్తాన్నీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నట్టుగానే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలో ట్రంప్ కూడా యాక్షన్ మార్చినట్టు కనిపిస్తోంది.

కుకెనడా, మెక్సికో విషయంలో ట్రంప్‌ చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ రెండు దేశాలూ అమెరికాలో భాగమైతే అక్రమ వలసలే కాదు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా అడ్డుకోవడం ఈజీ అవుతుందని ట్రంప్‌నకు తెలుసు. పైగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉంటే చమురు కోసం అరబ్ కంట్రీస్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. అందుకే, ఈ రెండు దేశాలనూ అమెరికా లో కలిసిపోవాలని ముందు నుంచీ చెబుతున్నారు. ఇప్పుడు మెక్సికో సరిహద్దుల్లోకి సైన్యాన్ని తరలించి అవసరమైతే యుద్ధం చేసైనా ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. అదే కనుక నిజమైతే ట్రంప్ షురూ చేసిన ఈ ఆట ఎక్కడ ఆగుతుందో చెప్పడం కూడా కష్టమే.