INDIA Vs CANADA: ఇండియా-కెనడా వివాదం.. అమెరికా మద్దతు కెనడాకేనా..?
కెనడాకు మిత్రదేశమైన అమెరికా ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది కీలకంగా మారింది. ఇంతకాలం ఈ విషయంపై సమదూరం పాటిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు నెమ్మదిగా తన వైఖరి మార్చుకుంటూ వస్తోంది. హర్దీప్ సింగ్ హత్య విషయంలో దర్యాప్తునకు సహకరించాలని ఇండియాను కోరింది అమెరికా.

INDIA Vs CANADA: కెనడాకు చెందిన ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారతీయ దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించింది. బదులుగా ఇండియా కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదం అంతర్జాతీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. కెనడాకు మిత్రదేశమైన అమెరికా ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది కీలకంగా మారింది.
ఇంతకాలం ఈ విషయంపై సమదూరం పాటిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు నెమ్మదిగా తన వైఖరి మార్చుకుంటూ వస్తోంది. హర్దీప్ సింగ్ హత్య విషయంలో దర్యాప్తునకు సహకరించాలని ఇండియాను కోరింది అమెరికా. ఈ విషయంలో కెనడా చేసిన ఆరోపణలు తీవ్రమైనవని అమెరికా వ్యాఖ్యానించింది. కెనడా, ఇండియా.. రెండూ తమకు మిత్ర దేశాలే అని అమెరికా చెబుతున్నప్పటికీ.. కెనడా ఆరోపణలకు పరోక్షంగా మద్దతు పలకడం విశేషం. అమెరికా జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ.. భారత్ సహకరించాలని సూచించారు. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మధ్య జరిగిన సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు విచారణలో ఇండియా సహకరించాలని, అయితే, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోబోమని చెప్పింది. ఈ ఏడాది జూన్ 18న కెనడాలో ఆ దేశ పౌరుడైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది.
అయితే నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వారి పార్లమెంటులో తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. కెనడా ఆరోపణలను ఇండియా ఖండించింది. మరోవైపు కెనడాకు మద్దతుగా, ఇండియాకు వ్యతిరేకంగా తమ మిత్ర దేశాల మద్దతు కూడగట్టాలని ప్రయత్నించింది. అయితే, సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ ఈ విషయంలో తటస్థ వైఖరినే అవలంబించాయి. కానీ, అమెరికా మాత్రం కెనడాకు మద్దతుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో కెనడా ఆరోపణల్ని ఇండియా వ్యతిరేకిస్తోంది. కెనడా మాత్రం ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు చూపలేకపోయింది.