ఏపీ ఐపిఎస్ పై అమిత్ షా ఫోకస్..? సునీల్ కుమార్ కు ముహూర్తం ఫిక్స్…!
సిఐడి మాజీ డిజిపి.. సునీల్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటివరకు ఆయన విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..

సిఐడి మాజీ డిజిపి.. సునీల్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటివరకు ఆయన విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ అండ చూసుకుని టిడిపి నేతలను ఆయన నానా ఇబ్బందులు పెట్టారు అనే ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహం సిద్ధం చేశారు. తనను కూడా పీవీ సునీల్ ఇబ్బంది పెట్టడంతో ఈ విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు.
ఇక తాజాగా పివి సునీల్ కుమార్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిఐడి మాజీ డిజిగా పనిచేసిన ఆయనపై సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో సిఐడి అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. మంగళవారం న్యాయవాది లక్ష్మీనారాయణను పిలిచి ఈ ఆరోపణలపై విచారణ జరిపారు. గతంలో సిఐడి డీజీగా ఉన్న సమయంలో పీవీ సునీల్ కుమార్ అరాచకాలకు పాల్పడ్డారని, అలాగే అనేకమందిని నిర్బంధించారని, అంతే కాకుండా తన సమక్షంలో వారిపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై అప్పట్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదులు చేశారు. ఇక అదే సమయంలో హోమ్ శాఖ స్పందించి ఈ వ్యవహారం పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ సమయంలో వైసిపి అధికారంలో ఉండటంతో పోలీసు అధికారులు దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫిర్యాదు వ్యవహారం ఎంతవరకు వచ్చిందని కేంద్ర హోంశాఖకు మళ్ళీ లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారు.
దీనితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డీజీపీ ఈ వ్యవహారం పై విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ సిఐడి అధికారులు పిలిపించి విచారించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆయన వద్ద ఉన్న ఆధారాలను కూడా సిఐడి అధికారులు తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా టిడిపి నేతలను, కొంతమంది జర్నలిస్టులను అప్పట్లో సిఐడి అధికారులు అరెస్టు చేసిన తీరుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్షాదారాలను కూడా సిఐడి అధికారులకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ అందించారు.
అర్ధరాత్రి గోడల దూకి మరి అరెస్టులు చేసిన తీరును ఈ సందర్భంగా సిఐడి అధికారుల కు సాక్ష్యాలతో సహా ఆయన వివరించారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు విషయంలో సిఐడి అధికారులు అప్పట్లో దూకుడుగా ప్రవర్తించారని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అంకబాబు.. నివాసానికి వెళ్లి అరెస్టు చేశారని, గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయనను నిర్బంధించారని, కనీసం ఆయన వయసును సైతం పోలీసులు పట్టించుకోలేదు అని సిఐడి అధికారులకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక అరెస్టుల సమయంలో వారి ఇంట్లోని వ్యక్తులను కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినట్లు లక్ష్మీనారాయణ వివరించారు. ఇక ఇదే సమయంలో టిడిపి నేత ధరణికోట వెంకటేష్ తో పాటుగా దారపనేని నరేంద్రను కూడా సిఐడి అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. వారి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు.