Amit Shah: అమిత్ షా అడ్డా… హైదరాబాద్!
2018 త్రిపుర ఎన్నికలకు కూడా బీజేపీ ఇలాగే సిద్ధమైంది. ఏడాది ముందు నుంచే అక్కడ అగ్రనేతలను రంగంలోకి దించింది. ఓ వ్యూహం ప్రకారం కమ్యునిస్టు కంచుకోటలను బద్దలు కొట్టింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోనే మకాం వేయబోతున్నారా…? భాగ్యనగరాన్ని తన అడ్డాగా మార్చుకోబోతున్నారా..? బిగ్ బాస్ బిగ్ ప్లాన్స్ ఏంటి..?
అవును… బీజేపీ అగ్రనేత అమిత్ష్ షా త్వరలో హైదరాబాద్ నగరంలో మకాం వేయబోతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు. పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండబోతున్నారు. బీజేపీ ఢిల్లీ వర్గాలు చెబుతున్న మాట ఇది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు పూర్తి కాగానే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెబుతున్నారు. ఊరక రారు మహానుభావులు అన్నట్లు అమిత్ షా రాక వెనక పెద్ద వ్యూహమే ఉంది.
అమిత్ షా బీజేపీ రాజకీయ చాణుక్యుడు. తెరవెనుక వ్యూహాలు పన్నడంలో దిట్ట.. అలాంటి షా సిటీకి వస్తున్నారంటే దాని వెనక పెద్ద కథే ఉంటుంది కదా.. ఉండాలి కూడా.. లేకపోతే ఇక్కడకు ఎందుకొస్తారు…? దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కమలానికి కాస్తో కూస్తో పట్టున్నది తెలంగాణలోనే… ఏపీ, కేరళల్లో ఇప్పట్లో పుంజుకుంటామన్న ఆశలు ఆ పార్టీకే లేవు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రాష్ట్రాలు తిరుగుతూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నేషనల్ మీడియా ముందు బీజేపీని చీల్చి చెండాడుతున్నారు. దీంతో ఎలాగైనా కేసీఆర్ ను దెబ్బకొట్టాలని కమలం వ్యూహాన్ని సిద్ధం చేసింది.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో బీజేపీ అంతో ఇంతో పుంజుకుందన్నది వాస్తవం. ఒకప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే బీజేపీ సోదిలో కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగింది. ఇటీవల పాదయాత్రలు, ప్రజా ఉద్యమాలతో ఊపుమీదుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీపై ప్రజల్లో కాస్త ఊపు కనిపిస్తున్నా అది ఎన్నికల్లో గెలిచే స్థాయిలో లేదని బీజేపీ హైకమాండ్ కు అర్థమైంది. అందుకే వేడి రగిల్చడానికి షాను రంగంలోకి దించింది.
బీజేపీలో చరిష్మా ఉన్న నేతలు కొద్దిమందే… నియోజకవర్గ స్థాయిలో నడిపించగల నాయకులు అంతంతమాత్రమే… ఉన్న నేతల్లో కూడా పూర్తిస్థాయి సమన్వయం లేదు. అందుకే అమిత్ షా ఇక్కడ మకాం వేస్తే నేతలంతా దారిలోకి వస్తారని భావిస్తున్నారు. పైగా అనుకున్న స్థాయిలో బీజేపీలోకి చేరికలు లేవు. నేతలు రావాలంటే వారికి భరోసా కావాలి. అమిత్ షా వంటి బలమైన నేతలు ఇక్కడుంటే చేరికలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే చేరికల సమన్వయ బాధ్యతను బన్సల్ కు అప్పగించారు అమిత్ షా. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అసలు పట్టులేదు. పట్టున్న పట్టణ ప్రాంతాలపై టీఆర్ఎస్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా పార్టీని పరిచయం చేసే వ్యూహాన్ని కూడా షా సిద్ధం చేస్తారని సమాచారం.
ఇక్కడ బీజేపీకి మరో వ్యూహం కూడా ఉంది.. వచ్చే ఎన్నికల్లో బలం పుంజుకుంటే ఆ పై ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కలసి వస్తుందన్నది కమలం ఆలోచన. ఎంపీ సీట్లు పెంచుకోవచ్చు. ఇక్కడ బీజేపీ బలపడితే అది కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రాలు పట్టుకుని తిరక్కుండా ఒక్క తెలంగాణపైనే ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా అది బీజేపీకి లాభమే. అందుకే బీజేపీ ఇంత ఫోకస్ చేసింది. ఇటీవల ఢిల్లీకి పిలిపించి నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. వారం వారం ఎవరో ఓ నేత ఇంట్లో సమావేశం కావాలని సూచించారు. మంచి చెడులు మాట్లాడుకోమన్నారు. దానర్థం కలసి మెలసి ఉండాలని. తెలంగాణ తమకు ముఖ్యమని దాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేమని స్పష్టంగా చెప్పేశారు కూడా.
కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో ఆపరేషన్ తెలంగాణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కర్ణాటక వచ్చే కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు తెలంగాణలో పర్యటించేలా ప్లాన్స్ సిద్ధం చేశారు. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చేలా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే ప్రధాని మోడీతో కూడా సభ నిర్వహించాలన్నది కమలం ఆలోచన. 2018 త్రిపుర ఎన్నికలకు కూడా బీజేపీ ఇలాగే సిద్ధమైంది. ఏడాది ముందు నుంచే అక్కడ అగ్రనేతలను రంగంలోకి దించింది. ఓ వ్యూహం ప్రకారం కమ్యునిస్టు కంచుకోటలను బద్దలు కొట్టింది. నిజానికి బీజేపీ అక్కడ అంత సులభంగా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ కమలనాధులు దాన్ని చేసి చూపించారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఇప్పటికే కొన్ని బృందాలు తెలంగాణలో దిగిపోయాయని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదికలు సమర్పిస్తున్నాయి. పార్టీ వాస్తవ పరిస్థితిపై అవి ఇచ్చే నివేదికలు అధిష్ఠానం కదలడానికిక కారణమయ్యాయి. మొత్తంగా చూస్తే ఈసారి తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి బీజేపీ ఎత్తుగడులు ఫలిస్తాయో లేదో చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.
(KK)