సంచలనం రేపుతున్న జమీన్ రైతు ఆర్టికల్…. లోకేష్ జగన్ని మళ్ళీ బతికిస్తున్నాడా?

ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక విశ్లేషణాత్మక వ్యాసం సంచలనం రేపుతుంది. పాతరేసిన భూతానికి ప్రాణం పోస్తున్నారు అనే శీర్షికతో జమీన్ రైతు పత్రిక రాసిన ఆర్టికల్ రాజకీయ పార్టీలు, కాస్త చదువుకున్న వాళ్ళు.....

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 11:20 AMLast Updated on: Feb 24, 2025 | 11:20 AM

An Analytical Essay Creates A Sensation In Ap Political Circles

ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక విశ్లేషణాత్మక వ్యాసం సంచలనం రేపుతుంది. పాతరేసిన భూతానికి ప్రాణం పోస్తున్నారు
అనే శీర్షికతో జమీన్ రైతు పత్రిక రాసిన ఆర్టికల్ రాజకీయ పార్టీలు, కాస్త చదువుకున్న వాళ్ళు….. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు మధ్య చర్చకు దారి తీసింది. ప్రజల్లో జగనే బెటర్ అనే అభిప్రాయం క్రమంగా వస్తుందని… రాష్ట్రంలో లోకేష్ ఆయన అనుచరగణం దండుడు బాగా పెరిగిపోయిందని, కొడుకు దురాశను నియంత్రించలేని దృతరాష్ట్రుడివలె చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతు జమీన్ ఆర్టికల్ ప్రముఖంగా ప్రచురించింది. గడచిన ఎనిమిది నెలల్లో కూటమి పాలనపై అక్కడక్కడ భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ… ఈ వ్యాసం ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది.

జమీన్ రైతు పత్రికకు తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన ఖ్యాతి ఉంది. సుమారు 97 సంవత్సరాల చరిత్ర ఉన్న పత్రిక ఇది.1928 లో నెల్లూరు వెంకట రామానాయుడు చేతులపై ప్రారంభమైన ఈ పత్రిక ఇప్పుడు డోలేంద్ర ప్రసాద్ సంపాదకుడిగా కొనసాగుతోంది. ఆత్రేయ, రావూరి భరద్వాజ, భంగోరే , బెజవాడ గోపాల్ రెడ్డి ,రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా లాంటి వాళ్లు ఈ పత్రికలో పని చేశారు.2019లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినీ విమర్శిస్తూ రాసినందుకు డోలెంద్ర ప్రసాద్ పై కోటంరెడ్డి అనుచరులు దాడి కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఈ పత్రిక మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఏకంగా లోకేష్ ని టార్గెట్ చేస్తూ… జగన్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేది లోకేశేనని… అతని అవినీతి అంతలా పెరిగి పోతోందని ఈ వ్యాసంలో విమర్శించారు జమీన్ రైతు సంపాదకుడు.

అరుంధతి సినిమాలో పెట్టే లో బంధించిన పశుపతిని తీసుకొచ్చి చేసిన తప్పు వల్లే అరుంధతి పై దాడి చేశాడని… అలాగే జగన్ అనే మహామాంత్రికుడిని అతి కష్టం మీద ఓట్ల తో సంకెళ్లు వేసి కూర్చోబెడితే ఆరు నెలలకే రంకెలు వేసుకుంటూ బయటికి ఎందుకొస్తున్నాడో గ్రహించారా ?అంటూ ప్రశ్నించింది ఆ వ్యాసం. జగన్ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎన్ని కష్టాలు పడ్డారు..? ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పారిశ్రామికవేత్తలు గనుల యజమానులు అందరూ వలసలు వెళ్లిపోయిన విషయాన్ని ఆ వ్యాసం గుర్తు చేసింది. కానీ మరోసారి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని… దానికి కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరేనని విమర్శించింది జమీన్ రైతు. నిజానికి జగన్… అతని పార్టీ 11 సీట్లకే పరిమితం అయిపోయినప్పుడు… ఘోర పరాజయాన్ని చవిచూసినప్పుడు అసలు చుట్టూ ఉన్నవాళ్లు తమ పని కతం అని అనుకున్నారు. కానీ విచిత్రంగా ఆరు నెలలు గడిచేసరికి వైసిపికి పోయిన ప్రాణం లేచి వచ్చింది. ఇప్పుడు జగన్… నా అసుర గణం జోలికొస్తే గుడ్డలూడదీసి కొడతా, సప్త సముద్రాలు వెనక దాక్కున్న వెతికి పట్టుకొస్తా అని హెచ్చరిస్తున్నాడు అంటే దీనికి బాధ్యులు మీరు కాదా అని చంద్రబాబుని, లోకేష్ ని ప్రశ్నించింది జమీన్ రైతు.

చంద్రబాబు అమరావతి నిర్మాణం పిచ్చిలో పడి కొట్టుకుంటుంటే, కొడుకు లోకేష్ జగన్ కన్నా ఒక రూపాయి ఎక్కువ సంపాదించాలని యావలో వ్యవహరిస్తున్నాడు అంటూ జమీన్ రైతు విమర్శించింది.అమరావతి నిర్మాణం ఒకటి చేస్తే చాలు రాష్ట్రం మొత్తం నాకు నీరాజనాలు పలుకుతుంది అనే భ్రమలో చంద్రబాబు ఉన్నాడంటూ ఆ పత్రిక నిలదీసింది. జగన్ వెంట తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు లోకేష్ పక్కన చేరారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ వ్యాసం. విజయానందని చీఫ్ సెక్రటరీగా పెట్టుకోవడం, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు వందల కోట్ల దొంగ బిల్లులు ఇచ్చేయడం, పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి కి మైనింగ్ రాయల్టీ వసూలు కాంట్రాక్టు కొనసాగించడం, మేఘా కృష్ణారెడ్డికి పోటీ లేకుండా వేలకోట్ల కాంట్రాక్టులు అప్పజెప్పడం, గనులను స్వాధీనం చేసుకోవడం వీటన్నిటినీ ఎత్తి చూపింది జమీన్ రైతు.

డబ్బుంటే చాలు ఏ ఎన్నికలైనా గెలిచి పోవచ్చు అనే దురభిప్రాయంతో లోకేష్ వ్యవహరిస్తున్నారని అందుకు గుణపాఠం నేర్చుకుంటారని… డబ్బు యావలో పడి ప్రజలకు, పార్టీకి తాను చేస్తున్న నష్టం ఏమిటో ఒకరు చెప్పిన ….వినిపించుకునే స్థితిలో లేడని… వీటన్నిటి ఫలితంగా…. జగన్ రాక్షస పాలన మళ్లీ వస్తుందని… టిడిపి నాయకులు , కార్యకర్తలు వణికిపోతున్నారంటూ ఆ పత్రిక రాసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో కూటమికి పూర్తి సహకారం అందించిన జమీన్ రైతు ఇప్పుడు ఇంత ఓపెన్ గా ప్రభుత్వాన్ని కడిగిపారేయడం… లోకేష్ ని టార్గెట్ చేయడం సంచలన సృష్టించింది ఈ ఆర్టికల్లో నిజ నిజాలు… వాస్తవాలు అటుంచితే…. జగన్ రాజకీయంగా వేగం పుంజుకోవడం… కూటమి పాలనలో ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడం, ప్రజల్లో ఇప్పుడిప్పుడే నిరాశక్తత రావడం… ప్రచారం తప్ప విషయం లేదని చర్చ జరగడం చూస్తుంటే ఏడాది నిండకుండానే ఏపీలో కూటమి సర్కార్ వ్యతిరేకత కూడగట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.