Congress Party: కాంగ్రెస్ లో చిక్కంతా ఆ ఒక్క జిల్లాతోనేనట !!
ప్రత్యేకించి ఒక జిల్లాకు చెందిన నేతల వల్లే రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత కొరవడిందని వరంగల్ జిల్లాకు చెందిన హస్తం పార్టీ సీనియర్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేకించి ఒక జిల్లాకు చెందిన నేతల వల్లే రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత కొరవడిందని వరంగల్ జిల్లాకు చెందిన హస్తం పార్టీ సీనియర్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్ర నేతలు తమను తాము సీఎం అభ్యర్ధుల రేంజ్ లో ఊహించుకుంటున్నారని కామెంట్ చేశారు. ఓ మీడియా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక కొత్త వ్యక్తి (రేవంత్ రెడ్డి) వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేస్తుంటే.. మనం సహకరించాలా.. వద్దా? ఇకనైనా ఆ జిల్లా అగ్రనేతలు బుద్ధి తెచ్చుకోకపోతే కాంగ్రెస్ పని అయిపోతుంది” అని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఆ జిల్లా ఏది ? అనుకుంటున్నారా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా !! ఆ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒక లుక్ వేద్దాం..
జానా, ఉత్తమ్ సైలెంట్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ ఇప్పుడు అక్కడున్న 12 అసెంబ్లీ సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి దిగ్గజ కాంగ్రెస్ నేతలు కూడా కారు స్పీడ్ ను గత పోల్స్ లో ఆపలేకపోయారు. ఈ నలుగురి పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. వాటిపై ఈ సీనియర్ నేతలకు గట్టిపట్టు ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అయినప్పటి నుంచి సీనియర్ నేత జానారెడ్డి సైలెంట్ అయిపోయారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు తన పదవిని అప్పగించడంతో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చడీచప్పుడు చేయడం లేదు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి .. “నకిరేకల్” మార్పుపై ఆందోళన
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ టార్గెట్ గా కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. “ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఉన్నారు. కొత్తగా చేరే వారితో లాభం లేదు” అని ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో చేరికపై అంతర్గతంగా చర్చించారని టాక్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం చేరితే.. నకిరేకల్ పై ఎంపీ కోమటిరెడ్డికి ఉన్న పట్టు సడలిపోతుంది. ఆ ఆందోళన వల్లే ఆయన నోట ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కొండా దంపతులు.. రేవంత్ వెంట.. అందుకే
కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేది కామన్ అని పొలిటికల్ అనలిస్టులు చెబుతుంటారు. ఆ కోణంలో చూస్తే.. ప్రస్తుతం కొండా దంపతులు కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నారు. కేసీఆర్ పై పోరాటం చేయాలన్నా, వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలుపు కోవాలన్నా రేవంత్ కు మద్దతు ఇవ్వడం అవసరమని కొండా కపుల్ గుర్తించారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో పరకాల, వరంగల్ తూర్పు అసెంబ్లీ టికెట్లను వారు ఆశిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో రేవంత్ తమకు ప్రాధాన్యం ఇస్తారనే ఆశాభావంతో కొండా దంపతులు ఉన్నారు. మరోవైపు పార్టీ టికెట్ల కేటాయింపులో తన పాత్ర ఏమీ లేదని.. అంతా అధిష్టానమే డిసైడ్ చేస్తుందని రేవంత్ అంటున్నారు. సీనియర్ల నుంచి వచ్చే అప్లికేషన్స్ ను పక్కన పెట్టడం కోసమే ఆయన ఇలా అంటున్నారని తెలుస్తోంది.