YS Jagan: ఏపీలో రైతు రుణమాఫీ..? సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ చర్చ..!
అన్నదాతలకు మేలు చేసేలా రైతు రుణమాఫీ తీసుకురాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ నుంచి కూడా సానుకూలత వస్తే ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కూడా వైసీపీ భావిస్తోంది. ఏపీలో 52 లక్షల మంది రైతులున్నారు.
YS Jagan: ఏపీలో రైతు రుణమాఫీపై వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై వైసీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా ఇదే అంశంపై తాడేపల్లిగూడెం కేంద్ర కార్యాలయంలో వైసీపీ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ప్రతిపాదను సీఎం జగన్ ముందుంచేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అన్నదాతలకు మేలు చేసేలా రైతు రుణమాఫీ తీసుకురాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ నుంచి కూడా సానుకూలత వస్తే ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కూడా వైసీపీ భావిస్తోంది.
52 లక్షల మంది రైతులు
ఏపీలో 52 లక్షల మంది రైతులున్నారు. వీళ్లంతా బ్యాంకులు, సొసైటీల నుంచి రుణాలు తీసుకున్నారు. ప్రతి ఏటా పంటకు ముందు రైతులు రుణాలు తీసుకుంటారు. పంట డబ్బులు చెల్లించిన తర్వాత, తిరిగి కొత్త రుణాలు తీసుకుంటారు. అయితే, పంటలు సరిగ్గా పండకపోవడం, పండినా గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. వీళ్లంతా అలాంటి పరిస్థితుల్లో రుణాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. కొందరు వడ్డీలు కూడా చెల్లించలేక బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తోంది. రుణమాఫీ చెల్లించలేక చాలా మంది రైతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే రైతు రుణమాఫీ అమలు చేస్తే అలాంటి రైతులందరికీ ఉపయోగం ఉంటుందని, దీని ద్వారా పార్టీకి లబ్ధి కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే రైతులకు రైతు భరోసా పథకం పేరుతో రూ.18,500 వరకు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి అదనంగా సాయం అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా వైసీపీ పెద్దలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. నిపుణులతో చర్చిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో
రాజకీయాల్లో రైతు రుణమాఫీ అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం ప్రతి పార్టీ రుణమాఫీ ప్రస్తావన తెస్తుంది. కానీ, అధికారం దక్కాక అమలులో నిర్లక్ష్యం వహిస్తుంది. 2014లో అధికారం చేపట్టే సమయంలో ఏపీ రైతులకు చెందిన రూ.54 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. తొలి ఫైలుపై సంతకం చేశారు. రూ.36 వేల కోట్ల రైతు రుణ మాఫీతోపాటు రూ.18 వేల కోట్ల డ్వాక్రా రుణ మాఫీ కూడా చేస్తామన్నారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష లోపు రుణాన్ని ఐదేళ్లలో, ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున మాఫీ చేస్తామన్నారు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ చేర్చాలి అనుకున్నా సాధ్యం కాదని జగన్ హామీ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలనుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ తండ్రి వైఎస్సార్ కూడా 2004లో అధికారం చేపట్టిన తర్వాత రూ.9 వేల కోట్ల రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించిన వారికి రూ.5 వేల చొప్పున జమ చేశారు కూడా. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్ మాత్రం తండ్రిలాగే రుణమాఫీకి సిద్ధమవుతున్నారు.
కీలక అంశాలపై చర్చ
రుణమాఫీ చేయాలని భావిస్తున్నప్పటికీ దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరుగుతోంది. ఆ తర్వాతే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు ఇంకొన్ని వరాలు ప్రకటించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.