Anil Kumar Yadav: అనిల్ కుమార్ చుట్టూ నెల్లూరు రాజకీయాలు.. ఆనం, అనిల్ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కిన పాలిటిక్స్

నెల్లూరు రాజకీయాలు ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్‌పై అదే పార్టీలోని ఒకవర్గం తిరుగుబాటు చేసింది. ఇక టీడీపీ నుంచి పోటీ ఎదురవుతోంది. దీంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు అనిల్ ప్రయత్నాలు ప్రారంభించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 25, 2023 | 03:14 PMLast Updated on: Jun 25, 2023 | 3:14 PM

Anil Kumar Yadav Vs Anam Ramanarayana Reddy War Of Words In Nellore Politics

Anil Kumar Yadav: నెల్లూరు రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడంతో నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లతో సిద్ధమవుతున్నారు. ఇక్కడి రాజకీయాలు ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్‌పై అదే పార్టీలోని ఒకవర్గం తిరుగుబాటు చేసింది. ఇక టీడీపీ నుంచి పోటీ ఎదురవుతోంది. దీంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు అనిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో సీనియర్ నేతలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనిల్ సవాళ్లు విసురుతున్నారు. దీంతో అందరూ ఒకవైపు.. అనిల్ కుమార్ ఒక్కడూ ఒకవైపు అన్నట్లుగా నెల్లూరు రాజకీయం వేడెక్కింది.
సొంత పార్టీ నుంచే పోటీ
కొంతకాలం అనిల్ కుమార్ యాదవ్ రాజకీయం నెల్లూరులో పోటీ లేకుండా సాగింది. అయితే, నేతల మధ్య పోటీ, అంతర్గత విబేధాలు అనిల్‌కు చెక్ పెట్టేశాయి. మంత్రి పదవి పోగానే అనిల్‌పై అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలు, ఇతర ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అనిల్ సొంత బాబాయ్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ వైసీపీ నుంచే పోటీకి దిగారు. ఎమ్మెల్యేగా అనిల్ ఉన్నప్పటికీ వైసీపీ తరఫున రూప్ కుమార్ మరో ఆఫీసు ప్రారంభించాడు. దీంతో అనిల్‌కు మద్దతుగా ఉన్న కొందరు అటువైపు మారిపోయారు. అలాగే అక్కడ తనకు తెలియకుండానే పదవుల్ని కట్టబెడుతున్నారు. ఇది అనిల్‌కు ఇబ్బందిగా మారింది. సొంత పార్టీ నుంచే పోటీ ఎదురవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు నెల్లూరుకు చెందిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా అతడికి విబేధాలున్నాయి. గతంలోనే అనిల్ వీరిపై ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పటికీ ఈ విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు నారా లోకేష్‌పై కూడా అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ శ్రేణులు అతడిపై ఆగ్రహంతో ఉంటూ విమర్శలు చేస్తున్నాయి. దీంతో అనిల్ విమర్శల ఘాటు మరింత పెంచారు.
ఆనంకు అనిల్ సవాల్
తన నియోజకవర్గమైన నెల్లూరు సిటీ నుంచి పోటీచేయాలంటూ ఆనం రామనారాయణ రెడ్డికి అనిల్ కుమార్ సవాలు విసిరారు. తన మీద ఆనం పోటీ చేసి, తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని చాలెంజ్ చేశారు. ఆనం ఎక్కడా గెలవలేడని చెప్పారు. నారా లోకేష్ చేసేది పాదయాత్ర కాదని.. విహార యాత్ర అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేసి గెలుస్తానని, ఆనం ఓడిపోయిన తర్వాత టీడీపీని విడిచిపెడతాడని అన్నారు. కోటంరెడ్డిపై కూడా అనిల్ విమర్శలు చేశారు. వీళ్లంతా వైసీపీలో కలుపుమొక్కలని అభిప్రాయపడ్డారు. అయితే, అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్‌కు టికెట్ కూడా రాదని, పదవిలో ఉన్నన్ని రోజులైనా ఆయన నియోజకవర్గ ప్రజలతో మంచి అనిపించుకోవాలని సూచించారు.
పార్టీ మారతారంటూ ప్రచారం
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్‌కు టిక్కెట్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రత్యర్థివర్గం యాక్టివ్ అవుతున్నా పార్టీ అధిష్టానం అడ్డుచెప్పడం లేదు. పైగా తనకి తెలియకుండానే పదవులు ఇస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగే అవకాశం ఉంటే అనిల్ పార్టీ మారుతాడు అంటూ ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం అనిల్‌కు సొంత పార్టీ నుంచే మద్దతు లభించడం లేదు. అయితే, పార్టీ మార్పు ప్రచారాన్ని అనిల‌్ ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానన్నారు. తనకు టిక్కెట్ రాకుండా జగన్ తప్ప ఎవ్వరూ అడ్డుకోలేరని అంటున్నాడు. జగన్ చెబితే రాజకీయాల నుంచి తప్పుకొంటా అంటూ చెబుతున్నాడు.
బాబాయ్‌తో తాడోపేడో
సొంత బాబాయ్ అయిన రూప్‌కుమార్‌ యాదవ్‌ వైసీపీలోనే వేరు కుంపటి పెట్టడం అనిల్ కుమార్ యాదవ్‌కు ఇబ్బందిగా మారింది. అనిల్ ఆధ్వర్యంలోనే ఇంతవరకు పార్టీ కార్యక్రమాలు సాగేవి. కానీ, రూప్‌కుమార్‌ యాదవ్‌ మరో పార్టీ కార్యాలయం స్థాపించడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. రూప్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బాబాయ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు తన అనుచరులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశాడు. తన అనుచరులతో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాడు. ఈ పరిస్థితులు చూస్తుంటే వైసీపీలో అనిల్ ఒంటరి అయినట్లే కనిపిస్తోంది.