Congress: బీజేపీ ఓటమే లక్ష్యం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకం కానున్న ప్రతిపక్షాలు.. పార్టీలకు తత్వం బోధపడిందా?

ఇన్నాళ్లూ తమలో ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీ గెలుస్తూ వచ్చిందని పార్టీలు గ్రహించాయి. ఇది ఇలాగే కొనసాగితే తమకు రాబోయే ఎన్నికల్లో కూడా విజయం దక్కడం కష్టమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 11:11 AMLast Updated on: May 23, 2023 | 11:14 AM

Anti Bjp Forum Will Lead By Congress Says Jdu

Congress: ఇన్నాళ్లూ కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి కలిసొచ్చిన అంశం.. ప్రతిపక్షాల్లో ఐక్యత లోపించడం. ఒకప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతిపక్షాలు ఆ పార్టీ వరుస ఓటముల నేపథ్యంలో దూరమవ్వడం ప్రారంభించాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు తమదారి తాము చూసుకున్నాయి. ప్రతిపక్షాలు ఒక్కటిగా లేకపోవడంతో బీజేపీ బలపడుతూ వచ్చింది. మోదీ, బీజేపీ విజయం సులభమయ్యింది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తించినట్లున్నాయి. అందుకే తిరిగి ఒక్కటిగా పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
దేశంలో మోదీ మేనియా నడుస్తుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఇమేజ్‌తో బీజేపీకి భారీ విజయాలు దక్కాయంటారు. ఇదెంత నిజమో.. ప్రతిపక్షాలు ఒక్కటిగా లేకపోవడం కూడా బీజేపీ విజయానికి మరో కారణం అన్నది కూడా అంతే నిజం. చాలా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేశాయి. కొన్నిచోట్ల బలంగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా మద్దతివ్వలేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ గెలుస్తూ వచ్చింది. బీజేపీ గెలవడానికి ఆమ్ ఆద్మీ, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా కారణమే. ఇన్నాళ్లూ తమలో ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీ గెలుస్తూ వచ్చిందని పార్టీలు గ్రహించాయి. ఇది ఇలాగే కొనసాగితే తమకు రాబోయే ఎన్నికల్లో కూడా విజయం దక్కడం కష్టమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి
నిన్నటివరకు కాంగ్రెస్ లేకుండానే కూటమి కట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. కానీ, అవేవీ సత్ఫలితాల్నివ్వలేదు. అందుకే ఈసారి కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. తాజా కర్ణాటక ఎన్నికల వరకు కాంగ్రెస్‌ను పట్టించుకోని పార్టీలు ఇప్పుడు ఆ పార్టీ అవసరాన్ని గుర్తించాయి. కాంగ్రెస్ లేకుండా కూటమి కట్టలేమని, మోదీని, బీజేపీని ఎదుర్కోలేమని అర్థం చేసుకున్నాయి. అందుకే నెమ్మదిగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవలే ప్రకటించారు. సోమవారం బిహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ప్రతిపక్షాల్ని ఐక్యం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యతపై రోడ్ మ్యాప్ రూపొందించబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో భేటీ జరిగే అవకాశం ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాలు ఎలా కలిసి పని చేయాలి వంటి అంశాలపై పార్టీల మధ్య చర్చ జరుగుతుంది.

Congress
27న ప్రతిపక్ష సీఎంల భేటీ
ఈ నెల 27న ప్రతిపక్ష సీఎంలు భేటీ కానున్నారు. అదే రోజు ప్రధాని మోదీతో ఢిల్లీలో సీఎంల భేటీ ఉంది. దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై మోదీతో సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం ప్రతిపక్ష సీఎంలు విడిగా భేటీ అవుతున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌‌తోపాటు, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, పినరయి విజయన్‌ వంటి సీఎంలు హాజరవుతున్నారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారా.. లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిపక్ష సీఎంలు ఒక్కతాటిపైకి వచ్చి ఇలా భేటీ కావడం ఇదే మొదటిసారి. అందులోనూ ఈ సారి కేంద్రంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమావేశం అవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం ప్రతిపక్షాల ఐక్యత, కూటమి విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీజేపీకి గట్టిదెబ్బే
ప్రతిపక్షాలు రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్తే అది కచ్చితంగా బీజేపీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీ గెలుపు కష్టమవుతుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్లమెంట్‌కు సంబంధించి 200 స్థానాల్లో బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఇలాంటి స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తే బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఈ రకంగా తాజా వ్యూహాలు రచించేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి సవాలు వంటివే. గతంలోలాగే తేలికగా గెలిచే పరిస్థితి అయితే కనిపించడం లేదు.