CM Jagan: ఓటేసే వాళ్లు మనోళ్లు.. వేయనోళ్లు వ్యతిరేకులు.. ఓటర్లను చీల్చుతున్న జగన్.. దెబ్బ తప్పదా ?

మనమే అనుకోవడానికి, మనదే అనుకోవడానికి చాలా ఉంటుంది బాస్ ! మనమే అనుకున్న వాళ్లు లీడర్ అవుతారు.. మనదే అనుకున్న వాళ్లు రాజకీయ నాయకుడు అవుతారు. అటు ఇటుగా జగన్ ఇప్పుడు రెండో కోవలోకే వస్తారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2023 | 07:30 PMLast Updated on: Apr 06, 2023 | 7:30 PM

Ap Cm Ys Jagan

ఎప్పుడూ లేనంత హీట్ మీద కనిపిస్తోంది ఏపీ రాజకీయం ఇప్పుడు ! ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పుడే షెడ్యూల్ వచ్చింది అనే రేంజ్‌లో యుద్ధం కనిపిస్తోంది అన్ని పార్టీల మధ్య! ఓట్ల సమీకరణాల లెక్కలు తీసే పనిలో పడ్డాయ్ పార్టీలన్నీ ! వైసీపీ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ ధీమాతో ఉంటే.. ఫ్యాన్ పార్టీ లెక్కలే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి తిరిగేలా ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తోంది వైసీపీ. జగనన్నే మా భవిష్యత్ అని పేరు పెట్టింది. గృహ సారధులు వెళ్లి.. ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుకున్న ప్రతీ ఇంటికి స్టిక్కర్లేస్తారు.. ఇదే కార్యక్రమం అంతే ! ఐతే ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

ఓటర్లను విడదీసే కార్యక్రమం మొదలుపెట్టారా జగన్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఓటేసే వాళ్లే మనోళ్లు.. ఓటేయని వాళ్లంతా వ్యతిరేకులు అని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారా అనే చర్చ నడుస్తోంది. ప్రతీ ఇంటికి వెళ్లి స్టిక్కర్‌ వేయడం అంటే.. ఒకరకంగా తమవాళ్లు ఎవరు అని గుర్తించడమే ! ఇదే వ్యూహంతో ఎన్నికల్లో సత్తా చాటాలన్నది వైసీపీ ప్లాన్‌గా కనిపిస్తుందన్నది మరికొందరి అభిప్రాయం.

నాలుగు ఎమ్మెల్సీలు కోల్పోయిన వైసీపీ.. అధికారం మీద ఇప్పటికీ ధీమాగానే కనిపిస్తోంది. లీడర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిసినా.. చదువుకున్న వాళ్లంతా వ్యతిరేకంగా ఉన్నారని అర్థం అయినా.. ఫ్యాన్‌ పార్టీ అధినేత ధీమాకు ఒకే ఒక్క కారణం.. మహిళల్లో వ్యతిరేకత లేకపోవడం. అమ్మఒడిలాంటి పథకాల ద్వారా డబ్బులు ఇస్తుండటంతో వాళ్లలో వ్యతిరేకత లేదన్నది వైసీపీ నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, ముస్పీం, మైనార్టీల్లో సానుకూలత ఉందని.. బీసీల్లోని కొన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉన్నారని నమ్ముతున్నారు. అందుకే ఓటేసేది ఎవరు అని తేల్చేందుకే ఇప్పుడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అనిపిస్తోంది.

ఇంటికి స్టిక్కర్‌ అంటించుకున్న వాళ్లు.. ఓటేస్తారు అని తేలినవాళ్లు మాత్రమే మనోళ్లు అని.. గెలవడానికి అదిచాలు అని.. మిగతా వాళ్ల విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా జగన్ తీరు కనిపిస్తోంది. ఇదంతా సరే.. ఓటేసేవాళ్లే మనోళ్లు అనుకుంటున్నారు బాగానే ఉంది. ఆ ఓటు మనకే అని జగన్ ఎలా అనుకుంటున్నారు. మన అనుకున్న సొంత ఎమ్మెల్యేలే హ్యాండ్ ఇచ్చారు. అలాంటిది జనాల మూడ్‌ను ఎలా క్యాచ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు జగన్ మనోళ్లు అనుకునేది ఎవరిని అనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఓటర్లను జగన్ చీల్చే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఓటేసేవాళ్లే మనోళ్లు అనుకోవడం అంటే.. వేయనివాళ్లను పట్టించుకోరా.. ఇదేనా నాయకుడి లక్షణం అని ఫైర్ అయ్యేవాళ్లు ఉన్నారు. ఏమైనా జగన్ స్ట్రాటజీ.. ఫ్యాన్‌ను మళ్లీ టాప్ స్పీడ్‌లోకి తీసుకెళ్తుందో లేదో చూడాలి మరి !