YS Jagan: విశాఖలో దసరా నుంచే పరిపాలన చేయనున్న జగన్..
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విశాఖ నుంచి పాలనపై కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచి ఏపీ పరిపాలన సాగుతుందన్నారు.
YS Jagan: ఏపీ సీఎం జగన్ ఎప్పటినుంచో చెబుతున్న విశాఖ నుంచి పారిపాలనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన చేయనున్నట్లు జగన్ చెప్పారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ వివరాల్ని జగన్ వెల్లడించారు. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విశాఖ నుంచి పాలనపై కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచి ఏపీ పరిపాలన సాగుతుందన్నారు. ఆలోపు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో మంత్రులు, అధికారులకు కార్యాలయాల్ని ఎంపిక చేసేందుకు కమిటీని నియమించాలని ఆదేశించారు.
కమిటీ సూచనల ఆధారంగా కార్యాలయాల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. రాబోయే దసరా పండుగను విశాఖలోనే జరుపుకొంటానన్నారు. మూడు రాజధానులు అనే ప్రభుత్వ విధానంలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని, అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ గత ఏడాది కాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో కూడా జగన్ ఇదే విషయాన్ని చెప్పారు. గతంలో ఉగాదికే పాలన ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ.. ఆలస్యమైంది. తాజాగా దసరా నుంచి పాలన సాగుతుందని స్పష్టం చేశారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధం కావాలని సూచించారు. అధికారులు ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసాలు, మంత్రులు, అధికారుల కోసం ఇండ్లు, ఆఫీసుల్ని వెతికే పనిలో ఉన్నారు. భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. విశాఖలో రుషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయ్. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయ్. అయితే ఆఫీసులను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్‌లో అమరావతి కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది.
వారంలో మూడు రోజులే
ఏపీ సీఎం విశాఖకు మారుతున్నప్పటికీ అక్కడ వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటారు. మిగతా మూడు రోజులు తాడేపల్లి నుంచే పాలన చేస్తారు. అందుకే ముందుగా ముఖ్యమంత్రి కోసమే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తారు. ఆ తర్వాత వీలునుబట్టి, ఇతర కార్యాలయాల్ని విశాఖకు తరలిస్తారు. అయితే, ఈసారైనా సీఎం జగన్ విశాఖకు వస్తారా..? లేదా..? చూడాలి.