YS Jagan: సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాల్లో జగన్.. చివరి అస్త్రంగా వాడుతున్నారా..?
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇదేదో ప్రతిపక్షాలు చెబుతున్న మాట కాదు. జగన్ ఆస్థాన సర్వే సంస్థ ఐప్యాక్ చెబుతున్న వాస్తవం ఇది. దీంతో జగన్‌లో కలవరం మొదలైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తేలింది.
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారా..? విశాఖ నుంచి పాలన అనే పల్లవి అందుకోవడానికి అదే కారణమా..? కోర్టు కేసులున్నా జగన్ విశాఖ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు..?
మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులైన మంత్రులతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఆ సమయంలోనే ఆయన దసరా తర్వాత విశాఖ నుంచే పాలన అని చెప్పారు. కార్యాలయాల అన్వేషణకు కమిటీ వేయనున్నట్లు తెలిపారు. మూడు రోజులు విశాఖ నుంచి, మరో మూడు రోజులు తాడేపల్లి నుంచి పాలన సాగించాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. రాజధాని అంశం కోర్టులో ఉంది. అది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం దాన్ని పట్టించుకోకుండా విశాఖ నుంచే పాలన అంటున్నారు. దీని వెనుక వ్యూహమేంటి అన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇదేదో ప్రతిపక్షాలు చెబుతున్న మాట కాదు. జగన్ ఆస్థాన సర్వే సంస్థ ఐప్యాక్ చెబుతున్న వాస్తవం ఇది. దీంతో జగన్‌లో కలవరం మొదలైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తేలింది. మంత్రులు, ముఖ్యనేతలు కూడా పరిస్థితి కొంచెం తేడాగానే ఉందని ముఖ్యమంత్రికి పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఐప్యాక్ సర్వే ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 3 మాత్రమే వచ్చే అవకాశం ఉండగా, టీడీపీకి 7 స్థానాలు రావొచ్చు. ధర్మాన సోదరుల పరిస్థితే అంతంతమాత్రంగా ఉందని ఐప్యాక్ ఇంటర్నల్ రిపోర్ట్. విజయనగరం, విశాఖలోనూ అలాంటి పరిస్థితే ఉంది. గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
పరిస్థితి చేతులు దాటిపోకుండా జాగ్రత్త పడే వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన అంటున్నారని భావిస్తున్నారు. తాను స్వయంగా విశాఖలో ఉంటే పరిస్థితి మారుతుందన్నది ఆయన అంచనా. దీనివల్ల ఉత్తరాంధ్ర కేడర్‌లో కొత్త ఉత్సాహం రావడంతో పాటు ఆ ప్రాంత ప్రజల్లో కూడా మార్పు వస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. రాయలసీమ ఎలాగూ తమకు అండగానే ఉంటుందని.. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కాస్త తేడా కొట్టినా ఉత్తరాంధ్ర సాయంతో గట్టెక్కాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఐప్యాక్ సర్వే ప్రకారం వైసీపీకి కేవలం 80-90 స్థానాలు రావొచ్చని తేలిందంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉందో లేదో కానీ ప్రమాదకరంగా మాత్రం ఉందన్నది మాత్రం విశ్లేషకుల అంచనా. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రాజేయాలని భావిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో ఎలాగూ పార్టీ గట్టెక్కదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ ఏం చేసినా పార్టీకి ఉపయోగం ఉండదు కాబట్టి ఉత్తరాంధ్రనైనా కాపాడుకోవాలన్నది జగన్ ప్లాన్. రాజధాని వ్యవహారం కోర్టుల పరిధిలో ఉందని సీఎంకు తెలుసు. ఇప్పుడు ఏం చేసినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా తెలుసు. కానీ విశాఖ నుంచి పాలన అని నేరుగా చెప్పకుండా రుషికొండను తవ్వేసి కడుతున్న టూరిజం కాంప్లెక్స్‌నే ఆయన తన కార్యాలయంగా మార్చుకుని పాలన సాగిస్తారు. ఆఫీసులను అనధికారికంగా విశాఖకు మార్చేస్తారు. దీంతో ఉత్తరాంధ్రతో పాటు కొంతమేర తూర్పుగోదావరి జిల్లాను కూడా ప్రభావితం చేయవచ్చన్నది ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే కోర్టులను కూడా ఏమార్చి విశాఖకు మకాం మార్చాలని చూస్తున్నారు.