ఢిల్లీలో మెగాస్టార్, స్టేట్ లో పవర్ స్టార్, పవర్ పాలిటిక్స్ వేరే లెవెల్
తన అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ మ్యాప్ రెడీ చేశారా...? తనను ఈ రేంజ్ లో నిలబెట్టిన అన్న ఋణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా...? భారతీయ జనతా పార్టీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా...?
తన అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ మ్యాప్ రెడీ చేశారా…? తనను ఈ రేంజ్ లో నిలబెట్టిన అన్న ఋణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా…? భారతీయ జనతా పార్టీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా…? ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్న చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేసినందుకు సిద్ధమయ్యారా…? జనవరిలో రాజ్యసభలో చిరంజీవి అడుగుపెట్టబోతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవి కాంగ్రెస్ లో జాయిన్ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పుడు ఆయనను రాజ్యసభకు పంపించారు కాంగ్రెస్ పెద్దలు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమితో ఆయన రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. మళ్ళి సినిమాలు మొదలుపెట్టి 150వ సినిమాతో సినిమా రంగంలో బిజీగా మారిపోయారు. అయితే 2019 తర్వాత చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేశారని భారతీయ జనతా పార్టీ ద్వారా రాజ్యసభకు వెళ్లేందుకు కష్టపడ్డారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఆ ప్రయత్నాలు ఎందుకో ఆగిపోయాయి ఇక జగన్ కూడా చిరంజీవికి రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేశారని, కానీ చిరంజీవి మాత్రం అందుకు నో చెప్పారని అంటూ ఉంటారు. అందుకే ఆ సీటుని ఆర్ కృష్ణయ్యకు అప్పుడు జగన్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి రాజకీయాల వైపు ఆసక్తిగా ఉన్నారట. మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టేందుకు మెగాస్టార్ సిద్ధంగా ఉండటం, ఈ విషయాన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలతో ఈ అంశంపై ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు చర్చించినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవికి మాస్ ఇమేజ్ ఉండడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో బిజెపి పెద్దలు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా సరే గెలవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం అవకాశం ఉన్న ప్రతి అంశంలోనూ బిజెపి పట్టు కోసం వెతుక్కుంటూనే ఉంది. అందుకే చిరంజీవిని ఇప్పుడు రాజ్యసభకు పంపించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓకే చెప్పారని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉందని బిజెపి వర్గాలు అంటున్నాయి.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సాలుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ద్వారా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పెద్దలకు బాగా దగ్గరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తమకు దగ్గర చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే భావనలో కమలం పార్టీ ఉంది. ఒకరకంగా పవన్ కళ్యాణ్ కారణంగానే ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందనే భావనలో కూడా కొంతమంది బిజెపి నేతలు ఉన్నారు.
ఈ తరుణంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించేందుకు పవన్ కళ్యాణ్ ఆలస్యం చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన స్థానాలను జనవరి 14 లోపు పూరించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందట. రాష్ట్రపతికి చిరంజీవి పేరును సిఫారసు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే చిరంజీవి కచ్చితంగా మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనబడుతోంది.
2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయంలో అలాగే తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో చిరంజీవి ద్వారా కాపు ఓటు బ్యాంకు ని టార్గెట్ చేయవచ్చు అనే లెక్కలు కూడా బిజెపి వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే మరి కొంతమంది మాత్రం చిరంజీవి మళ్ళీ కేంద్రమంత్రి అవకాశం కూడా ఉండవచ్చు అనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అదే జరిగితే మెగా బ్రదర్స్ డామినేషన్ సెంటర్లో, స్టేట్ లో ఉండనుంది.