CHANDRABABU NAIDU: చంద్రబాబును చంపేందుకు కుట్ర.. ఏపీ డిప్యూటీ సీఎం ఆరోపణ..!
చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును చంపేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నంలో ఏదో కలుపుతూ ఉండొచ్చని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం అందుతున్న సంగతి తెలిసిందే.

CHANDRABABU NAIDU: చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో, ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును చంపేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నంలో ఏదో కలుపుతూ ఉండొచ్చని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం అందుతున్న సంగతి తెలిసిందే. ఈ భోజనాన్ని నారా భువనేశ్వరి తయారు చేసి పంపిస్తున్నారు. అయితే, ఆ భోజనంలో ఏదో కలుపుతున్నారని నారాయణ స్వామి ఆరోపించడం సంచలనంగా మారింది.
భువనేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డలే కాబట్టి ఆయన మృతికి కారణమైన చంద్రబాబుపై పగబట్టి ఉండొచ్చని, ఆ కారణంగానే చంద్రబాబును చంపి లోకేశ్‌ను సీఎం చేసేందుకు కుట్ర పన్ని ఉంటారని మరోసారి వ్యాఖ్యానించారు. “టీడీపీ టెర్రరిస్టుల పార్టీ. చంద్రబాబు వెన్నుపోటుదారుడు. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానంటారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దు. ఆయన తప్పు చేసి జైలుకు వెళ్లారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం జగన్ లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లినప్పుడు ఆందోళనలు జరగలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్లినందుకు టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలు సమంజసంగా లేవు.
చంద్రబాబు, రామోజీరావు కలిసి వైశ్రాయ్ హోటల్ బయట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయనను సీఎం పీఠం నుంచి దించేశారు. ఈ విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేరు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతున్నారు. కోర్టులు ఇప్పుడే కళ్లు తెరుచుకున్నాయి” అంటూ నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.