AP Elections War: టీడీపీ Vs జనసేన Vs బీజేపీ.. సీట్ల షేరింగ్ ఏదైతే ఉందో.!
రాజకీయాల్లో ఒక్కోసారి ప్రత్యర్థులను మట్టి కరిపించడానికి కొన్ని త్యాగాలు కూడా చేయల్సి వస్తుంది. ఆ త్యాగాలు తమ రాజకీయ భవిష్యత్తుకి పునాదిగా మారతాయనుకుంటేనే ఏ పార్టీ అయినా అందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీలో త్యాగాలు చేయాల్సిన పరిస్థితిలో తెలుగు దేశం పార్టీ ఉంది. ఒకే ప్రత్యర్థిని మూడు పార్టీలు కలిసి ఢీకొట్టాలనుకున్నప్పుడు వాళ్ల మధ్య ఐక్యత ఎంత అవసరమో.. సీట్ల సర్దుబాటు విషయంలోనూ అంతే క్లారిటీ అవసరం. ఈ విషయంలో తేడా కొడితే ఫలితాలు తారుమారైపోతాయి.
జగన్ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడబోతున్నారని.. ఇక రాబోయేది తెలుగు దేశం ప్రభుత్వమేనని చంద్రబాబు నాయుడు సభలు సమావేశాల్లో చాలా ఆవేశంగా స్వరం పెంచి మరీ చెబుతున్నారు. ఇప్పటికే సగం మేనిఫెస్టో కూడా ప్రకటించేసి.. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ చేస్తామంటున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసీపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తే.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయవచ్చన్నది ఆయన ప్లాన్. ఇక ఢిల్లీ స్థాయిలో వైసీపీ బీజేపీ మధ్య ఎలాంటి దోస్తానా ఉందో తెలియదు గానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని స్థానిక బీజేపీ నేతలు కూడా ఘనమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈ మూడు పార్టీలు పెట్టుకున్న టార్గెట్ ఒక్కటే.. వైసీపీని ఓడించడం..తాము అధికారంలోకి రావడం.
పొత్తులు..సీట్ల షేరింగ్ సంగతేంటి ?
ఏపీలో ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు అనివార్యంగా మారిపోయాయి. జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయడం ఎప్పుడో ఖాయమైపోయినా.. ఈ మధ్య సీన్‌లోకి బీజేపీని కూడా తీసుకొచ్చారు జనసేనాని. మూడు పార్టీలు కలిసి వైసీపీని ఎదుర్కొంటామని బహిరంగంగానే ప్రకటించారు. రాజకీయంగా చేతులు కలపడం తప్పనిసరిగా మారినప్పుడు ఇక తర్వాత మాట్లాడుకోవాల్సింది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్న విషయమే. బలం, బలగం ప్రకారం చూసుకుంటే జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. కానీ టీడీపీతో కలిసి బరిలోకి దిగితే లెక్కలు మారిపోతాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఏపీలో తమ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడిందని గట్టిగా నమ్ముతున్న పవన్ కల్యాణ్.. తమకు కనీసం 45 సీట్లు కేటాయించమని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారు. ఢిల్లీ స్థాయిలో పొత్తులకు గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఏపీలో తమ పార్టీకి కనీసం 10సీట్లైనా ఇవ్వాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ లెక్కన 55 స్థానాలు జనసేన, బీజేపీకి ఇస్తే.. టీడీపీ 120 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. సీట్ల షేరింగ్ నెంబర్ ఈక్వేషన్స్ విషయంలో ఈ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అన్నది అసలు ప్రశ్న.
వైసీపీని ఓడించడానికి టీడీపీ రాజీపడుతుందా ?
ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం , కూటమిగా ఏర్పడి బరిలోకి దిగడం టీడీపీకి కొత్తేమీ కాదు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆలోచించాలి. అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమని ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ప్రకటించిన చంద్రబాబు.. తమ పార్టీ నేతలను, ఆశావాహులను ఒప్పించి మెప్పించి.. కొన్ని సీట్లను జనసేన బీజేపీకి కేటాయించాల్సి ఉంటుంది. కేవలం ఇది సీట్ల షేరింగ్ తోనే ఆగిపోదు.. ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పవన్ కల్యాణ్‌కు ఎప్పటి నుంచో ఉంది. అయితే తన పార్టీకి వస్తాయనుకుంటున్న ఓట్లు, సీట్లతో ఆయన సీఎం కావడమన్నది కలే అవుతుంది. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. అందుకే డిమాండ్ చేసే స్థాయిలో తమ పార్టీ లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎలా వస్తుంది అని పార్టీ కార్యకర్తలను ఆయన నేరుగానే ప్రశ్నిస్తున్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో తమ పార్టీ గెలిస్తే.. టీడీపీని డిమాండ్ చేసే పొజిషన్‌లో ఉంటామన్నది పవన్ ఆలోచన. అందుకేనేమో..కనీసం తమకు 45 స్థానాలన్నా కేటాయించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ 45 స్థానాల్లో తమకు గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉందని.. కచ్చితంగా గెలిచి తీరుతామని పవన్ నమ్మకంతో ఉన్నారు. అందుకే 45 సీట్ల కోసం మొండి పట్టుపడుతున్నారు.
అవసరం అందరిది.. రాజీ పడాల్సిందే..!
రాజకీయాల్లో పరస్పర అవసరాలే బంధాలుగా మారతాయి. అవే చివరకు పొత్తులుగా మారతాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అవసరం పవన్ కల్యాణ్ కు ఎంతుందో.. జనసేన అవసరం టీడీపీకి కూడా ఉంది. ఈ రెండు పార్టీలతో జతకట్టడం ద్వారా కనీసం రాష్ట్రంలో తమ అస్థిత్వాన్ని కాపాడుకునే అవకాశమైనా వస్తుందన్న నమ్మకంలో బీజేపీ ఉంది. అందుకని కామన్ శత్రువును ఓడించడానికి ఈ మూడు పార్టీలు పరస్పరం సర్దుకుపోతే తప్ప.. వాళ్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు.
అంతా బాబు గారి చేతుల్లోనే..!
రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు ఎప్పుడో పీహెచ్‌డీ చేశారు. జగన్‌ను ఓడించడం కోసం ఆయన పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలను బట్టి ఇట్టే అర్థమైపోతుంది. టీడీపీకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే..వైసీపీ అసంతృప్త నేతలంతా ఇప్పుడు టీడీపీ వైపే చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనం వంటి నేతలు రేపోమాపో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని అనుకుంటున్న వాళ్లంతా తెలుగు దేశం జెండాపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ల హామీ లేకపోతే వీళ్లు సైకిల్ ఎక్కరుగాక ఎక్కరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న వాళ్లను సంతృప్తి పరుస్తూ కొత్తగా వచ్చే వారికి అవకాశమిస్తూ.. జనసేన, బీజేపీతో సీట్లను షేరింగ్ చేసుకోవాలి. రాబోయే కొన్ని నెలల్లో చంద్రబాబు ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే. పొత్తుల కోసం 120 స్థానాలతో సరిపెట్టుకుని.. అధికారంలోకి వస్తే చంద్రబాబుకు తిరుగుండదు.. కానీ పొత్తుల వల్ల సీట్ల సర్దుబాటు వల్ల అసలకే మోసం జరిగితే మాత్రం టీడీపీ కోలుకోలేదు. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం.