Kiran Kumar Reddy: కమలం గూటికి కిరణం.. వికసించేదెవరు?

కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి కానీ, బీజేపీ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కానీ ఉపయోగం ఉంటుందని ఇప్పుడే చెప్పలేం. ఆయన నుంచి పార్టీ ఏం ఆశించిందో తెలీదు. ఏపీలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకంతో ఆయన్ను బీజేపీ చేర్చుకుని ఉండొచ్చు. కానీ ఆయన్ను చూసి పార్టీలో చేరేవాళ్లెవరూ ఇప్పుడు లేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2023 | 02:34 PMLast Updated on: Apr 07, 2023 | 2:34 PM

Ap Ex Cm Kiran Kumar Reddy Joined In Bjp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ పనైపోవడం వల్లే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారాయన. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత విభజనను వ్యతిరేకించి జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆ పార్టీని జనం తిరస్కరించడంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత ఏమైందో ఏమో మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితమైపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడ సడన్ గా బీజేపీలో చేరిపోయారు.

2014 తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అలాంటాయన ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ యాక్టివ్ అవ్వాలనుకోవడం, వెంటనే బీజేపీలో చేరిపోవడం రాజకీయ నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది. 1952 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. కానీ ఇప్పుడు ఆయన కమలం గూటికి చేరడం ఎవరికి లాభం చేకూరుస్తుందనేది పెద్ద ప్రశ్న. కిరణ్ కుమార్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేక బయటికొచ్చేసిన ఆయన ఇప్పుడు బీజేపీలో ఎలా తట్టుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. పైగా ఏపీలో జీరోగా ఉన్న పార్టీని కిరణ్ కుమార్ రెడ్డి ఎలా గాడిన పెట్టగలరనేది కూడా డౌట్.

ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే.! ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనుకుంటే పెద్ద పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉంటుంది. ఆయన సోదరుడు ఇప్పటికే టీడీపీలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. బహుశా చంద్రబాబు, జగన్ పార్టీల్లో తాను ఇమడలేననే ఉద్దేశంతో బీజేపీలో చేరి ఉండొచ్చు. అయితే జీరో పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి పిలవగానే వచ్చేసి బీజేపీ కండువా కప్పుకునే వాళ్లు ఎవరూ లేరు. అలాంటాయన నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందనేది కూడా ఆసక్తి కలిగిస్తున్న అంశం.

కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి కానీ, బీజేపీ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కానీ ఉపయోగం ఉంటుందని ఇప్పుడే చెప్పలేం. ఆయన నుంచి పార్టీ ఏం ఆశించిందో తెలీదు. ఏపీలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకంతో ఆయన్ను బీజేపీ చేర్చుకుని ఉండొచ్చు. కానీ ఆయన్ను చూసి పార్టీలో చేరేవాళ్లెవరూ ఇప్పుడు లేరు. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పార్టీ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఉపయోగం ఉంటుంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎలా సేవలందిస్తారో వేచి చూడాలి.