AP DEFICIT: ఏపీ అప్పు ఎంతో తెలుసా.. ఇలా మారడానికి కారణాలేంటి..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2023 | 10:49 AMLast Updated on: Feb 07, 2023 | 11:46 AM

Ap Government Defisheet

ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు.

 

2019 తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయని పేర్కొన్నారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు రూ. 4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు. 2019లో అప్పు రూ. 2.64 లక్షల కోట్లు ఉండగా.. 2020 లో రూ.3.07లక్షల కోట్లకు పెరిగింది. 2021 విషయానికొస్తే రూ.3.53 కోట్లకు ఎగబాకింది. 2022 వచ్చేసరికి రూ.3,93లక్షల కోట్లుగా ఉన్న అప్పు 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరింది. బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనం. ఇప్పటికే రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏటేటా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగి పోతున్నాయి. మరోవైపు కొత్త అప్పుల కోసం వైసీపీ సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

 

జనవరి నుంచి మార్చి కాలానికి గాను రూ.12,000 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల క్యాలండర్‌ పంపింది. జనవరిలో రూ.7,000 కోట్లను, ఫిబ్రవరిలో రూ.4,000 కోట్లను, మార్చిలో రూ.1,000 కోట్లను తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ.9 లక్షల కోట్లు దాటేశాయి. జీఎస్‌డీపీలో ఇవి 75 శాతంగా ఉన్నాయి. 2018లో కేంద్రం సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎస్ డీపీలో 20 శాతం మించకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి. చెల్లించాల్సిన బిల్లులతో కలిపి గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వ అప్పులు రూ.1.04 లక్షల కోట్లకు చేరాయి. అయినా కొత్త అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది.

 

కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నవిధంగా.. ఏపీ అప్పుల రాశిగా మారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. అప్పుడే ఆంధ్రా అప్పు రూ.16వేల కోట్లుగా ఉండేది. ఎన్నిసార్లు ఢిల్లీ పెద్దలను అడిగినా అరకొర నిధులే మంజూరు చేశారు. ఆదాయ మార్గం లేకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి రూ. 2.5లక్షల కోట్ల పైచిలుకు అప్పు మిగిలింది. వడ్డీలకే వేల కోట్లు చెల్లించాల్సి వచ్చేది. దీనికి తోడు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు. సంక్షేమం పేరుతో కుటుంబంలో ఒక్కరికి ఏదో రకంగా డబ్బులు బదిలీ చేయడం ప్రారంభమైంది. నెలలో కనీసం రెండు మూడు సార్లు ఇలా లబ్థిదారుల పేరుతో అప్పుచేసి డబ్బును ఖర్చు చేశారు. దీంతో దినదినాభివృద్ది చెందాల్సిన రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. మాట తప్పడు మడమ తిప్పడు అనే పేరును పదిలంగా ఉంచుకోవడం కోసం, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటం కోసం ఏదో విధంగా డబ్బులను ప్రజలకు ఇవ్వడం కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు.

 

పైగా కరోనా కారణంగా ఆదాయం తగ్గిపోయింది. రాబడిలేక ఖర్చులు అధికమౌతుండటంతో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి చెల్లించలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏదో ఒక సంక్షేమానికి దారి మళ్లించవలసి వచ్చింది. ఇలా అలివిగాని హామీలు గుప్పించి ప్రజలకు ధనాన్ని ఇవ్వాలంటే ఎన్ని కోట్ల రూపాలయలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చినా సరిపోదు. కేవలం సంక్షేమం పేరుతో అప్పుచేసి ఇలా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

 

అభివృద్ది లేక, పరిశ్రమలు రాక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవ్వరు పరిపాలించినా ఏమీ చేయలేరు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలంటే ప్రత్యేకహోదా, బుందేల్ ఖండ్ వంటి ప్యాకేజీలను రాష్ట్రానికి అందజేస్తే ఒక పది సంవత్సరాలకైనా రాష్ట్ర పరిస్థితి కాస్తయినా మారొచ్చు.