వంశీ అడ్డంగా బుక్ అయ్యాడా…? గన్నవరంలో అసలేం జరుగుతోంది…?

అప్పట్లో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన విమర్శలు మాత్రం తీవ్ర వివాదాస్పదం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 07:54 PMLast Updated on: Nov 28, 2024 | 7:54 PM

Ap Govt Focus On Gannavaram Ex Mla

అప్పట్లో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన విమర్శలు మాత్రం తీవ్ర వివాదాస్పదం. కొడాలి నానీ వంటి వారు ఎన్ని బూతులు తిట్టినా ఎన్నడూ కూడా కుటుంబం జోలికి వెళ్లి, ఇంట్లో ఆడవాళ్ళను మాట్లాడిన సందర్భాలు లేవు. కాని వంశీ మాత్రం అత్యంత అభ్యంతరకంగా పదే పదే… చంద్రబాబును, ఆయన సతీమణిని, లోకేష్ ను తీవ్రంగా దూషించారు. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

వంశీని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఇబ్బందులు పెడతారు అనే ప్రచారం జరుగుతూనే ఉంది. రెడ్ బుక్ లో టాప్ 5 లో ఆయన పేరు ఉందనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు వంశీకి ఆ సెగ పూర్తి స్థాయిలో తగల్లేదు. అయితే అరెస్ట్ చేస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేయవచ్చు అంటూ ప్రచారం బాగా జరిగింది. వంశీకి మాత్రం అరెస్ట్ భయం తీవ్రంగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త పడుతూనే ఉన్నారు.

ఇటీవల విజయవాడ సివిల్ కోర్ట్ కు వచ్చిన వంశీ… తన అనుచరులకు లాయర్ దుస్తులు వేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో క్లారిటీ లేదు. కాని వంశీ దేశం విడిచి వెళ్ళకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే టైం లో వంశీ కీలక అనుచరులు ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారు. రంగా, ఆర్కే వంటి వంశీ కీలక అనుచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇటీవల ఏడుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసారు. టీడీపీ నేతపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పుడు వంశీపై ఆయన గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను బయటకు తీసే కార్యక్రమం మొదలుపెట్టారు. గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు అధికారులు. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. కూలీలు, తన వద్ద పనిచేసే డ్రైవర్ల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టారని… ముఖ్యంగా గన్నవరం, ఆగిరిపల్లి రోడ్డులో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని… రేమల్లె సహా పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు.

ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారని, అలాగే పట్టిసీమ కాలవ వద్ద కూడా మట్టి తవ్వారని గుర్తించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేసినట్టు స్పష్టమైన ఆధారాలతో గుర్తించారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర ఓ కీలక ప్రకటన కూడా చేసారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు సమాచారం.

సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేసారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి పలువురు కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. త్వరలోనే వంశీని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన అనుచరుల అక్రమాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గన్నవరం విమానాశ్రయ భూముల్లో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.