Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్.. సీఐడీ కస్టడీకి నో..!
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సాగింది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ సహా వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని, ఆయన విడుదలైతే బయటి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
విచారణ కీలక దశలో ఉన్న సమయంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే, విచారణపై ప్రభావం పడుతుందని తెలిపింది. సీఐడీ వాదనలకు అంగీకరించిన కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అయితే, చంద్రబాబు పీటీ వారెంట్లపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో వాదనలు అవసరం లేదని, కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై వాదనలకు అవకాశం ఉందని చంద్రబాబు తరఫు లాయర్లు అన్నారు. దీంతో కోర్టులో వాదనలు సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సాగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా వాదించగా, ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ కేసు వాదించారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణ ప్రధానంగా సెక్షన్ 17ఏ పైనే సాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు కేసును మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు.. అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.