Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..!
శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సీఐడీ తరఫు లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ఏకవాక్య తీర్పు వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు కస్టడీపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సీఐడీ తరఫు లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ఏకవాక్య తీర్పు వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు కస్టడీపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తైనప్పటికీ ఏసీబీ కోర్టు తీర్పు వాయిదావేసింది. క్వాష్ పిటిషన్ అనంతరమే తీర్పు వెల్లడించాలని జడ్జి భావించడంతో మరికాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చెల్లదని, ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఈ కేసే చెల్లదని, 17 ఏ సెక్షన్ కింద అరెస్టు కుదరదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. సీఐడీ తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అరెస్టు, రిమాండ్ సక్రమమే అని, కేసు దర్యాప్తు జరపాలని కోర్టు భావించి తీర్పు వెల్లడించింది. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు.
చంద్రబాబు తప్పు చేశారన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదన్నారు. పైగా అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో చేశారని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. ప్రభుత్వం తరపు లాయర్లు కూడా అదే స్థాయిలో వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, నిబంధనలు పాటించకుండా, షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని సీఐడీ ఆరోపిస్తోంది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు ముఖ్యమని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. సుదీర్ఘంగా, ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. రెండు, మూడు రోజులపాటు వాదనలు జరిగాయి. తర్వాత కేసులో తీర్పును రిజర్వ్ చేసి, శుక్రవారం వెల్లడించారు. ఇప్పుడు కేసులో తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా రావడంతో తిరిగి డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉంది.