Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇండ్ల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్‌లో ప్రభుత్వం చేపడుతున్న ఇండ్ల నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇండ్ల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్‌లో ప్రభుత్వం చేపడుతున్న ఇండ్ల నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
ఆర్-5 జోన్ పరిధిలో సీఆర్డీయే చట్టాన్ని సవరించి వైసీపీ ప్రభుత్వం యాక్ట్ 13/2022, జీవో 45ని తీసుకొచ్చింది. ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. రాజధానియేతర ప్రాంతవాసులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 1,402 ఎకరాలు కేటాయించింది. ఈ భూమిని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అక్కడ ఇండ్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతు సంక్షేమ సంఘం, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గత చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఇండ్ల నిర్మాణాన్ని ఆపేయాలని పిటిషన్‌లో కోరారు.
దీనిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గతంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు వాయిదా వేసింది. తాజాగా ఈ అంశంపై తీర్పు వెల్లడించింది. ఇండ్ల నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని ఇటీవలే ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.