అధికార పార్టీతో అంటకాగితే అంతేనా ? ఐపీఎస్ లు…అంతా నా ఇష్టం అంటే కుదరదా ?
ఆంధ్రప్రదేశ్ లో బ్యూరోక్రాట్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరు సస్పెండ్ అవుతుంటే...మరికొందరు పోస్టింగ్ దక్కించుకోలేక డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో బ్యూరోక్రాట్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరు సస్పెండ్ అవుతుంటే…మరికొందరు పోస్టింగ్ దక్కించుకోలేక డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. అలా ఒకరు కాదు…ఇద్దరు కాదు…పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులను…చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక…కొందరు ఐపీఎస్ లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండల కోసం…ప్రమోషన్ల కోసం అంతా నా ఇష్టం…నన్నెవరు ఆపలేరు….అన్నట్లు వ్యవహరించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు మీద కేసులు పెట్టారు. స్టేషన్లలో లాఠీలకు పని చెప్పారు. అక్రమ కేసులతో జైళ్లకు పంపించారు. ఐదేళ్లు అలా గడిచిపోయాయి. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని లెక్కలు వేసుకున్నారు. మరో ఐదేళ్లు తమకు ఎదురే ఉండదని భావించారు. ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోవచ్చనుకున్నారు. సీన్ కట్ చేస్తే…ప్రభుత్వం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు ఐపీఎస్ ల పరిస్థితి తలకిందలయింది. గత ఐదేళ్లు ఎక్స్ ట్రాలు చేసిన వాళ్లంతా…ఇపుడు పోస్టింగ్ లు లేక డీజీపీ ఆఫీసు వరండాల్లో పచార్లు కొడుతున్నారు. మరికొందరు పోస్టింగ్ లు తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. ఐదేళ్ల పాటు తప్పు చేశాం…మమ్మల్ని క్షమించండి…మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని రిక్వెస్టు చేసుకుంటున్నారు.
కాలం ఎపుడు ఒకేలా ఉండదు…గిర్రున తిరుగుతుంది. బళ్లు ఓడలవుతాయి…ఓడలు బళ్లవుతాయి. తాము ఐపీఎస్ లం…తమను ఎవరు ఏం చేయలేరు అన్నట్లు వ్యవహరించిన వారంతా ప్రస్తుతం గోళ్లు గిల్లుకుంటున్నారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయిన అధికారులు…టీడీపీ వచ్చాక కుక్కిన పేనులా ఉంటున్నారు. ప్రభుత్వం మారిపోతే తమకు కష్టాలు ఎదురవుతాయని….పోస్టింగ్ ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంచనా వేయాలేకపోయారా అంటే అది కూడా కాదు…వారికి అన్ని తెలుసు. ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో తెలిసినా…అంతా నా ఇష్టం అన్నారు. గత ఐదేళ్లలో చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇలా పరిస్థితులు వచ్చి ఉండేవా ? పోస్టింగ్ ల కోసం వెయిటింగ్ చేయాల్సిన దుష్టితి వచ్చేదా ? అప్పుడు వైసీపీ చెప్పిన ప్రతి దానికి ఐపీఎస్సు అన్న వారంతా కేసులతో సతమతమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే…వైసీపీతో అంటకాగిన వారందర్ని డిజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వారి స్థానాల్లో కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఐపీఎస్ లు…మేం సేఫ్ అనుకున్నారు. తమపై ఎలాంటి చర్యలు ఉండవని లోలోపల సంతోషించారు.
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు కష్టాలు మొదలయ్యాయి. 2019లో వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ…స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించారు. అప్పటి సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగ వేదికలపైనే తప్పు పట్టారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ…రఘురామపై సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు. 2021 మే 14న తనను అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో…నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాయత్నం చేశారంటూ…రఘురామకృష్ణరాజు జులై 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు. పోలీసులు పలువురిని విచారించడంతో.. సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామను కొట్టామని…..అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రఘురామను కొడుతున్నపుడు సీఐడీ బాస్ సునీల్ కుమార్ కు వీడియోకాల్ చూపించినట్లు అంగీకరించారు. కొట్టడమంటే అలా కాదంటూ కాల్ కట్ చేశారని…తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని విచారణలో తెలిపారు. రఘురామ కేసులో గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సీఐడీ చీఫ్ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.
తానొకటి తలిస్తే…దైవమొకటి తలచింది అనే సామెత నిజమయంది. నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ హయాంలో ఇంటిలిజెన్స్ అధిపతి సీతారామాంజనేయులు చెలరేగిపోయారు. విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాతా, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్ని….సీతారామాంజనేయులు ఏం చెబితే నో అనకుండా చేశారు. కాదంబరి జత్వానీపై కేసు నమోదు కాకముందే ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు. ఆమెను. ఆమె కుటుంబసభ్యులను విజయవాడ తీసుకొచ్చారు. చెప్పినట్లు చేయాలని బెదిరించారు. భయపెట్టారు. ఫోర్జరీ కేసు పెట్టారు. దాదాపు రెండు నెలల పాటు జైలుకు పంపారు. జత్వానీ కుటుంబసభ్యులను తీవ్రంగా వేధించారు. బయటకు రావాలంటే చెప్పినట్లు చేయాలని హుకుం చేశారు. అన్నింటికి ఒకే అన్న తర్వాత…డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆమెకు విముక్తి కలిగింది. చివరి జిందాల్ ను రేప్ కేసు నుంచి తప్పించేందుకు…వైసీపీ చేసిన కుట్రలు మొత్తం బయటపడ్డాయి. కాదంబరి అక్రమ అరెస్టు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ల్యాండ్ కొనుగోలు వంటి కేసుల్లో…సీనియర్ ఐపీఎస్ పీఎస్ ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నిపై కేసు నమోదయ్యింది. సీఎంవో చెబితేనే చేశానని విశాల్ గున్ని చెప్పడంతో…ఆంజనేయులు, కాంతిరాణా తాతా మరింత ఇరుకునపడ్డారు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకెంత మంది ఐపీఎస్ లు కేసుల్లో ఇరుక్కుంటారో చూడాలి.