AP Politics : ఏపీని శాసించేది ఆ రెండు కుటుంబాలే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (AP Politics) ఇప్పుడు రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ కుటుంబం అయితే... రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే నాలుగు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన చంద్రబాబు నాయుడు... టీడీపీ(TDP)కి అధినేతగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (AP Politics) ఇప్పుడు రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ కుటుంబం అయితే… రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే నాలుగు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన చంద్రబాబు నాయుడు… టీడీపీ(TDP)కి అధినేతగా ఉన్నారు. ఎన్టీఆర్ బిడ్డ అయిన పురంధేశ్వరి… బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఇక వైఎస్ కుటుంబం నుంచి ఆయన కొడుకు జగన్… వైఎస్సార్ సీపీకి (YSR CP) అధ్యక్షుడు అయితే… ఈమధ్యే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కూతురు షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్, వైఎస్సార్ వారసులే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ కీలకలంగా మారారు.
1983లో తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీ రామారావు. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి జనంలో అపూర్వ ఆదరణ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎన్టీఆర్, వైఎస్సార్ … ఇద్దరూ కూడా తమకంటూ సొంతంగా పథకాలను రూపొందించి జనంలో ఆదరణ పొందారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్, వైఎస్సార్ వారసులే ఏపీలో నాలుగు పార్టీలకు బాధ్యతులుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని వైఎస్సార్ రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. కానీ వైఎస్ మరణించిన తర్వాత… కాంగ్రెస్ తో పడక వైఎస్సార్ సీపీ పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు ఆయన కొడుకు జగన్. 2014లో కొన్ని సీట్లు సంపాదించినా… 2019లో 151 సీట్లతో బంపర్ మెజారిటీతో వైసీపీని ఏపీలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆశపడుతున్నారు. ఆయన వైఎస్ ఫోటోతోనే జనంలోకి వెళ్తున్నారు. పథకాలకు కూడా వైఎస్సార్ పేరే పెట్టుకున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయిన వైఎస్ కు వారసురాలిగా ఆయన కుమార్తె షర్మిల ఈమధ్యే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కూడా వైఎస్ ఫోటోతోనే వచ్చే ఎన్నికల్లోకి దిగబోతున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ఆశపడుతున్నారు. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత 10యేళ్ళుగా స్థబ్దుగా ఉంది కాంగ్రెస్. గతంలో ఉన్న ఓటు బ్యాంక్ ను మళ్ళీ హస్తం పార్టీలోకి తీసుకురావాల్నది షర్మిల ఆలోచన. ఇప్పటికే వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆమె… ఈనెల 23 నుంచే జిల్లాల పర్యటనకు కూడా బయలుదేరుతున్నారు.
ఇక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఆయన కుటుంబమే శాసిస్తోంది. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి ఈమధ్యే జైలుకెళ్ళి వచ్చారు. ఆ సానుభూతితో ఈసారి అధికారంలోకి వస్తామన్న ఆశ టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ మరో వారసురాలు పురంధేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలు. ఏపీలో బలపడాలని అనుకుంటున్న జాతీయ పార్టీకి బీజేపీకి కూడా ఎన్టీఆర్ కుటుంబమే పెద్దదిక్కు అయింది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు పురంధేశ్వరి. ఇప్పుడు కమలం పార్టీని గ్రౌండ్ లెవల్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమిలో చేరితే అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు పురంధేశ్వరి. అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మొత్తమ్మీద ఏపీలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు… ఎన్టీఆర్, వైఎస్సార్ కుటుంబానికి చెందినవారే. రేపు అధికారంలోకి వచ్చినా… సీఎం అయినా ఈ రెండు కుటుంబాల వారికి మాత్రమే అవకాశం లభించనుంది.