AP Pensions: ఏపీలో మళ్లీ పింఛన్ల రచ్చ తప్పదా.. ఈసీ ఆదేశాలివే..

ఎప్పుడూ ఒకటో తేదీనే ఇంటికి పింఛన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్‌దారులు సచివాలయాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్లి పలువురు మరణించారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2024 | 07:25 PMLast Updated on: Apr 27, 2024 | 7:25 PM

Ap Pensions Distribution Issue Ec Directs Cs About Volunteers

AP Pensions: ఏపీలో పింఛన్ల వివాదం మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఏప్రిల్ ప్రారంభంలో పింఛన్ల విషయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. ఎప్పుడూ ఒకటో తేదీనే ఇంటికి పింఛన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్‌దారులు సచివాలయాలకు పరుగెత్తారు.

YSRCP MANIFESTO: కొత్త పథకాలేవి..? వైసీపీ మేనిఫెస్టోలో సంచనాలు ఏవి..?

ఈ క్రమంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్లి పలువురు మరణించారు. అయితే.. దీనంతటికీ కారణం టీడీపీయే అని వైసీపీ ఆరోపిస్తే.. వైసీపీ కావాలనే నిర్లక్ష్యం చేసి, ఆ నెపాన్ని తమ పార్టీపై నెడుతోందని టీడీపీ ఆరోపించింది. లక్ష మందికిపైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు వారితో పింఛన్లు ఇప్పించొచ్చు కదా అని టీడీపీ ప్రశ్నించింది. అటు వైసీపీ.. శవాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది. ఈ అంశంపై ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఏదైతేనేం.. ఎలాగోలా పింఛన్ల పంపిణీ ముగిసింది. అయితే, ఇప్పుడు మే నెల రాబోతుంది. మరో నాలుగు రోజుల తర్వాత ఆ నెలకు సంబంధించిన పింఛన్లు పంపిణీ చేయాలి. ఇక్కడే మరో రచ్చ షురూ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే ఆసక్తి కనిపిస్తోంది. దీనిపై ఈసీ తాజాగా కొన్ని సూచనలు చేసింది.

పింఛన్ల పంపిణీపై గత నెలలో జారీ చేసిన మార్గదర్శకాలను మే నెలలో కూడా పాటించాలని ఈసీ.. సీఎస్‌ను ఆదేశించింది. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పంపిణీ చేపట్టాలని, ఇందుకోసం శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. ఎక్కడా వాలంటీర్లను వినియోగించవద్దని, వారి స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలని ఈసీ సూచించింది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎస్‌కు తేల్చి చెప్పింది.