AP Politics: 175 మందిలో.. ఆ ఒక్కడు ఎవడు? వెతుకుతున్న ఏపీ ఇంటెలిజెన్స్.
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ బరిలో నిలవడంతో ఏకగ్రీవం అవుతాయనుకున్న ఎమ్మెల్సీ సీట్లకు ఓటింగ్ తప్పలేదు. టీడీపీ అభ్యర్ధి గెలవాలంటే ఒక ఎమ్మెల్యే ఓటు కావాలి. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలలో ఏవరు ఏం చేస్తున్నారోనని నిఘా పెట్టింది. అసంతృప్తులను బుజ్జగిస్తోంది. ఒక్కరూ చే జారకుండా జాగ్రత్తపడుతోంది.
టీడీపీ నిజంగానే గెలవాడానికే పోటీ పెట్టిందా? లేక వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరితోనైనా టచ్ లో ఉందా? ఉంటే ఎవరా ఒక్కరు? ఇప్పుడు ఏపీ లో ఇదే చర్చ నడుస్తోంది .ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. మరో వైపు ఈ నెల 23న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అంతకు మించిన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 7 సీట్లు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో చేరతాయని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సాంకేతికంగా బలం లేకున్నా టీడీపీ బరిలోకి దిగింది.
దీంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఖాళీలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్సీ సీటు గెలవాడానికి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. లెక్క ప్రకారం అయితే ఒక ఎమ్మెల్సీ ని గెలుచుకునే బలం టీడీపీకి ఉంది. కానీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు అనధికారికంగా వైసీపీలో చేరడంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 నుంచి 19కి పడిపోయింది. అయితే ఈ మధ్యే వైసీపీ దూరంగా పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటేస్తామంటున్నారు. వాళ్లిద్దరూ టీడీపీ అభ్యర్ధికి ఓటేసే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే ఆ పార్టీ బలం 21కి చేరుతుంది. అప్పుడు మరో ఎమ్మెల్యే మద్దతు అవసరం అవుతుంది. వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయకున్నా.. వైసీపీ నుంచే మరో ఎమ్మెల్యే మద్దతు ఉంటే టీడీపీ తేలిగ్గా ఒక ఎమ్మెల్సీని గెలుచుకోగలుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే నేరుగా ఓటేయకున్నా.. తన ఓటు వైసీపీ అభ్యర్ధులకు వేయడంలో ఏ మాత్రం పొరపాటు చేసినా సరే అది టీడీపీకి కలిసి వస్తుంది. ఈ లెక్కలతోనే టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్ధిని పోటీకి పెట్టింది. కేవలం ఇలాంటి లెక్కలతో, అదృష్టం మీదే ఆధారపడి టీడీపీ పోటీ పెట్టిందా? లేక వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికైనా ఎర వేసిందా? అనే అనుమానం అధికార పార్టీలో ఉంది.
అందుకే ప్రతి ఎమ్మెల్యే కదలికల పై నిఘా పెట్టింది. ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరెవర్ని కలుస్తున్నారోనని ఆరా తీస్తోంది. జిల్లాల్లో ఇంటిలిజెన్స్ నుంచి సమాచారం సేకరిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల అంతా విజయవాడలోనే ఉంటున్నారు. అయినా.. వారి ప్రధాన అనుచరులు ఏం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారి ద్వారా టీడీపీ పావులు కదుపుతోందా? అనే కోణంలో నిఘా వర్గాలు దృష్టి పెట్టాయట. ఇంత మంది ఎమ్మెల్యేల బలం ఉండి.. ఎమ్మెల్సీని చే జార్చుకుంటే పరువు పోతుందనే భయం వైసీపీ లో ఉంది.
ఒక జనసేన ఎమ్మెల్యే, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం వైసీపీకి 154మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని 22 మంది చొప్పున విభజించి… ఒక్కో అభ్యర్ధికి కేటాయించారు. ఆ ఎమ్మెల్యేలకు ఇద్దరేసి మంత్రులను ఇంచార్జులుగా పెట్టారు. ఓటు వేయడంలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ ఓటింగ్ కూడా నిర్వహించింది వైసీపీ. టీడీపీ మాత్రం ధీమాతో కనిపిస్తోంది. పార్టీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసింది. కానీ టీడీపీని తక్కువగా అంచనా వేయని వైసీపీ తన జాగ్రత్తలో తాను ఉంది.ఏ క్షణాన ఏమైనా జరగవచ్చనే ఆలోచన తో ఆ ఒక్కడు ఎవరన్నది వెతుకుతుంది.