NTR COIN: ఎన్టీఆర్ నాణెంపై పొలిటికల్ కుస్తీ.. క్రెడిట్ కోసం పార్టీల పాట్లు
ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకుండా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి ద్వారా జగన్ పార్టీ చెప్పిస్తోంది. తద్వారా ఆ రెండు పార్టీలను ఆమె ద్వారా ఏకకాలంలో టార్గెట్ చేయిస్తోంది.
NTR COIN: ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ‘ఎన్టీఆర్’ స్మారక 100 రూపాయల నాణెం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ నాణెం విడుదల చేయించిన క్రెడిట్‌ను కొట్టేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంటే.. ఎన్టీఆర్‌కు జాతీయ స్థాయి ఇమేజ్ దక్కేలా చేసింది తానేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ద్వారా మీడియా ముందు విమర్శలు చేయించి.. ఆ ఇష్యూ నుంచి అడ్వాంటేజ్ పొందాలని జగన్ టీం ట్రై చేస్తోంది. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకుండా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి ద్వారా జగన్ పార్టీ చెప్పిస్తోంది. తద్వారా ఆ రెండు పార్టీలను ఆమె ద్వారా ఏకకాలంలో టార్గెట్ చేయిస్తోంది. రాష్ట్రంలోని ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది వైఎస్సార్‌సీపీ సర్కారే అని లక్ష్మీపార్వతితో చెప్పిస్తోంది. అయితే ఈ అంశంపై ఇతర వైఎస్సార్‌సీపీ కీలక నేతలు సైలెంట్‌గా ఉండిపోవడం అనేది లక్ష్మీపార్వతి వాదనను బలహీనపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ.. ఎన్టీఆర్‌కు తాము ఇస్తున్న గౌరవాన్ని జనంలోకి తీసుకుపోయేందుకు నాణెం విడుదల ఇష్యూను పూర్తిస్థాయిలో వాడుకోనుంది. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి ఇప్పటికే బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించింది. తద్వారా రాష్ట్రంలోని అత్యంత ప్రభావవంతమైన ఓటు బ్యాంకుగా పేరొందిన కమ్మ సామాజికవర్గానికి చేరువయ్యే స్కెచ్ గీసింది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నో చెబితే.. పురంధేశ్వరి ద్వారా టీడీపీలోని కమ్మ వర్గం కీలక రాజకీయ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించాలని కమలదళం యోచిస్తోంది. టీడీపీలో కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలను తమవైపు తిప్పుకొని బలోపేతం కావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఇక ఎన్టీఆర్ కాయిన్ విడుదల కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకావడం.. టీడీపీకి మైనస్ పాయింటే అయ్యేలా కనిపిస్తోంది. చంద్రబాబు, బీజేపీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు ఇచ్చేలా ఆ ప్రోగ్రామ్ ఫొటోలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన చంద్రబాబు కూర్చున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి కమలదళంతో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనేలా అవి కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై స్పందించిన వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి.. టీడీపీ, బీజేపీలను పురంధేశ్వరి కలుపుతున్నట్టుగా అనిపిస్తోందని కామెంట్ చేశారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీడియా సమావేశాల్లో జగన్ సర్కారును మాత్రమే టార్గెట్‌గా ఎంచుకుంటుండటం కూడా వ్యూహాత్మకమే అని తెలుస్తోంది. టీడీపీతో ఫ్యూచర్ స్నేహాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఇప్పుడు ఆమె మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద మహా నాయకుడు ఎన్టీఆర్ స్మారక కాయిన్ చుట్టూ ఇన్ని రకాల పొలిటికల్ సీన్ నడుస్తుండటం.. అసలు సిసలైన అన్నగారి అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.