AP Politics: పవన్‌కల్యాణ్‌కు 30 సీట్లు ఫైనల్ టీడీపీ, జనసేన ఒప్పందం ఇదే.. డయల్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
ఇద్దరిది ఒకే లక్ష్యం.. వైసీపీని గద్దెదించడం. ఆ లక్ష్యమే కలిపింది ఇద్దరిని ! బీజేపీకి బైబై చెప్పేసిన పవన్.. టీడీపీతో పొత్తుకు దాదాపు లైన్ క్లియర్ చేశారు. మళ్లీ ప్రయోగాలు చేయనని.. గౌరవప్రదమైన పొత్తులకు సిద్ధం అని ఆవిర్భావ వేడుకల్లో ప్రకటించిన పవన్ కల్యాణ్.. బాల్‌ను టీడీపీ కోర్టులోకి నెట్టేశారు. పొత్తుకు మేం సిద్ధం.. అడిగిన సీట్లు ఇచ్చేందుకు మీరు సిద్ధమా అన్నట్లుగా సంకేతాలు పంపించారు.
తక్కువలో తక్కువ 50స్థానాలను పవన్ డిమాండ్ చేశారని.. ఐతే టీడీపీ మాత్రం 20సీట్లు మాత్రం ఇచ్చేందుకు సుముఖంగా ఉందనే ప్రచారం జరిగింది ఇన్నాళ్లు. ఎమ్మెల్యే టికెట్లు తక్కువ ఇచ్చినా.. ఎమ్మెల్సీల నియామకాల్లో న్యాయంచేస్తానని చంద్రబాబు బుజ్జిగించే ప్రయత్నం చేశారు. ఐతే సీట్ల పంపకాల డైలమాకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. పవన్ కల్యాణ్ పార్టీకి 30సీట్లు ఫైనల్ చేశారు చంద్రబాబు. దీనికి జనసేనవర్గాలు కూడా హ్యాపీగా ఉన్నాయ్.
జనసేనకు ఓటు శాతం పెరిగిందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఏడు స్థానాలు గెలుచుకుంటుందని.. ఈ మధ్య వచ్చిన సర్వేల్లో తేలింది. అలాంటి జనసేనకు 50సీట్లు ఇవ్వడం అంటే.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే ! ఇదే విషయం రెండు పార్టీల నేతలు అర్థం చేసుకున్నారు. ఎట్టకేలకు 30నంబర్‌కు ఫిక్స్ అయ్యారు. ఇక స్థానాలు ఎంచుకోవడం పైనే పవన్, జనసేన కసరత్తు చేయబోతోంది. నిజానికి జనసేన పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి చాన్నాళ్లుగా కొన్ని నియోజకవర్గాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
విశాఖ ఉత్తరంతో పాటు.. చోడవరం, గాజువాక, భీమిలి, యలమంచిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమం, పుట్టపర్తి, గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంతపురం అర్బన్ స్థానాల్లో జనసేన బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 30 సీట్లకు జనసేన అంగీకరించడం వెనక మరో భారీ కారణం కూడా ఉంది. గ్లాస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు అంతా టీడీపీనే భరించనుంది.
ఇక అదే సమయంలో కూటమి తరఫున పవన్ కల్యాణ్ రాష్ట్రం అంతా ప్రచారం చేయాల్సి ఉంటుంది. జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎట్టకేలకు క్లారిటీ రావడంతో.. రెండు పార్టీల్లోనూ కొత్త జోష్ కనిపిస్తోంది. నాలుగు ఎమ్మెల్సీలు గెలిచిన టీడీపీ ఆనందానికి హద్దుల్లేవ్ ! వరుస పరిణామాలన్నీ.. 2024లో అధికారానికి శాంపిల్ అంటూ.. తెగ మురిసిపోతున్నారు. ఇదంతా ఎలాఉన్నా.. టీడీపీ, జనసేన దగ్గరకాకుండా వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఐతే పొత్తు దాదాపు ఖాయం అయింది. సీట్ల లెక్క కూడా తేలిపోయింది. మరి ఈ ఇద్దరిని ఢీకొట్టేందుకు ఫ్యాన్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.