T CONGRESS: గ్రేటర్ హైదరాబాదా మజాకా.. జోష్‌లో హస్తం పార్టీ..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 263 మంది అప్లై చేశారు. కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతుండటం గమనార్హం. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ స్థానాలకూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి చెరో 16 మంది దరఖాస్తు చేసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 04:00 PMLast Updated on: Aug 31, 2023 | 4:01 PM

Applications Poured For Greater Hyderabad Tickets From Congress

T CONGRESS:కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు తెలంగాణ మొత్తం నుంచి 1025 దరఖాస్తులు వస్తే.. అందులో 263 అప్లికేషన్లు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల కోసం పోటెత్తిన దరఖాస్తుల లెక్క ఇది. గ్రేటర్ హైదరాబాదా మజాకా.. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో నాలుగో వంతు ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇంతగా అప్లికేషన్లు వెల్లువెత్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 263 మంది అప్లై చేశారు. కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతుండటం గమనార్హం. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ స్థానాలకూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి చెరో 16 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే.. గోషామహల్‌ కోసం 15 అప్లికేషన్లు, శేరిలింగంపల్లి, చేవెళ్ల స్థానాలకు చెరో 14, కుత్బుల్లాపూర్‌కు 12, రాజేంద్రనగర్‌కు 11, యాకుత్‌పురా, ఎల్‌బీనగర్‌ స్థానాలకు చెరో 10, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌ స్థానాలకు చెరో 9, మహేశ్వరం, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌ స్థానాలకు చెరో 8 అప్లికేషన్లు వచ్చాయి. మలక్‌పేట, కార్వాన్‌ స్థానాలకు ఏడుగురు చొప్పున, జూబ్లీహిల్స్‌, మేడ్చల్‌, ఉప్పల్‌, అంబర్‌పేట స్థానాలకు ఆరుగురు చొప్పున అప్లై చేశారు. చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర స్థానాలకు ఐదుగురు చొప్పున, మల్కాజిగిరి, పరిగి సీట్లకు ముగ్గురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ కోసం అప్లై చేసుకున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌ర్వే స‌త్యనారాయ‌ణ కూడా ఉన్నారు. తాను రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేద్దామ‌నుకున్నాన‌ని, అయితే పార్టీ అసెంబ్లీ బ‌రిలో దిగ‌మ‌న‌డంతో అప్లై చేశాన‌ని మీడియాతో స‌ర్వే చెప్పారు. త‌న అల్లుడు క్రిషాంక్‌ రెడ్డికి కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ద‌క్కకపోవ‌డం వాళ్ల పార్టీ అంత‌ర్గత వ్యవ‌హార‌మ‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే అల్లుడిపై పోటీకి కూడా తాను సై అంటున్నారు స‌ర్వే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ దరఖాస్తు ఇచ్చారు.
సెప్టెంబరు 2న కాంగ్రెస్ పార్టీ పీఈసీ సమావేశం జరగనుంది. దీని తర్వాత అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించేలా హస్తం పార్టీ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇంకోవైపు పొత్తులపై కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. ఒకవేళ కామ్రేడ్లతో సయోధ్య కుదిరితే వాటికి కేటాయించే స్థానాల్లో అడ్జస్ట్మెంట్లు చేసుకోనుంది. సెప్టెంబరు 15 నాటికి 60 నుంచి 75 స్థానాలకు, నెలాఖరుకల్లా అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.