T CONGRESS: ఒకే సీటు కోసం 36 మంది దరఖాస్తు.. ఇంతకీ ఏ నియోజకవర్గం అంటే..?
అన్ని నియోజకవర్గాలకు కలిపి సగటున పది రెట్లు దరఖాస్తులొచ్చాయి. కొన్ని నియోజకవర్గాలకు పది నుంచి ఇరవై వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే, అన్నింటిలోకి ఆసక్తికరంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం. ఈ సీటుకు సంబంధించి ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకున్నారు.
T CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25తో దరఖాస్తుల స్వీకరణ పూర్తైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాలకు కలిపి సగటున పది రెట్లు దరఖాస్తులొచ్చాయి. కొన్ని నియోజకవర్గాలకు పది నుంచి ఇరవై వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే, అన్నింటిలోకి ఆసక్తికరంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం.
ఈ సీటుకు సంబంధించి ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ దరఖాస్తులకు సంబంధించి ఇదే అత్యధికం. మరోవైపు దరఖాస్తులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు వారాలపాటు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15వ తేదీకల్లా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందిన దరఖాస్తులను పరిశీలిస్తే.. 50-70 నియోజకవర్గాలకు పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం గట్టి పోటీ ఉంది. కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఒక్క సీటు కోసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. రిజర్వుడు స్థానాల్లో భారీ పోటీ నెలకొంది. ఇల్లెందు తర్వాత బాన్సువాడలో 11 మంది దరఖాస్తు చేస్తున్నారు. నియోజకవర్గాలు అన్నింట్లోకి కొడంగల్, మంథనిల్లో ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోటీ పడుతున్నారు.
సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, రేణుకా చౌదరితో పాటు కొందరు నేతలు దరఖాస్తు చేసుకోలేదు. వీరిలో చాలా మంది తమ వారుసలతో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. ఇంకొందరు అసెంబ్లీకి కాకుండా.. పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తారా.. లేక పార్టీలో కొత్తగా చేరబోయే వారికి కూడా టిక్కెట్లు ఇస్తారా అనే సందేహాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి రాజకీయ అనుభవం తక్కువగా ఉంది. అందుకే ఆయా సీట్లలో అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉంచే అవకాశం ఉంది.