Top story: 2024 బీఆర్ఎస్ కు అన్నీ అపశకునాలేనా ? కేసులతో సతమతమవుతున్న కవిత, కేటీఆర్
2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటాడాయి. బీఆర్ఎస్ పార్టీ...ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.
2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటాడాయి. బీఆర్ఎస్ పార్టీ…ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. 2024లో ఒక్కటంటే ఒక్కటి కూడా కారు పార్టీకి కలిసి రాలేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి కేటీఆర్ పై ఫార్ములా-ఈ కేసు దాకా…సమస్యలు చుట్టుముట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత…మార్చి 15న ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27వ తేదీన జైలు నుంచి విడుదలయ్యారు.
బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు…అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టారు. ఒకరి తర్వాత ఒకరు చేరుతూ వెళ్లిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరో నాలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏఢాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి…ఆ పార్టీకి లోక్ సభలో ఉనికే లేకుండా పోయింది. మొత్తం 16 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తే…ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. చాలా చోట్ల మూడో స్థానానికే పరిమితం అయింది. అధికార కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 లోక్ సభ సీట్లు వచ్చాయి. 20 ఏళ్ల తర్వాత గులాబీ పార్టీకి ఇలాంటి ఫలితాలు వచ్చాయి.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2 సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను…ఏసీబీ చేర్చింది. ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత…ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బీఎల్‌ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.