MLC Election Results: వైసీపీకి వార్నింగ్ బెల్స్..!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్యే ఎన్నికల్లో కచ్చితంగా వస్తాయని మనం చెప్పలేం. ఓ వర్గం మాత్రం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉందని స్పష్టంగా తేలిపోయింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఈ ఫలితాలు అధికారపార్టీకి అంత మంచి శకునం కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2023 | 03:14 PMLast Updated on: Mar 19, 2023 | 9:50 AM

Are Mlc Election Results Are Reharsels For 2024 Polls

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తును చెబుతున్నాయా…? 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోందో 2023లోనే చూపించాయా…? విద్యావంతులు, మధ్యతరగతి వారు అధికార పార్టీకి దూరమయ్యారా…? ఫలితాలు విశ్లేషిస్తున్న అధికారపార్టీ వర్గాలే అంతర్మథనంలో పడ్డాయి.

సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జనానికి పెద్దగా ఆసక్తిని రేపవు… ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిదే గెలుపు… స్థానిక సంస్థలైనా, టీచర్లైనా ప్రభుత్వం బలపరిచిన వారే గెలుస్తారు. అందులో వింతేమీ లేదు. పట్టభధ్రుల నియోజకవర్గాల్లోనూ సాధారణంగా వారిదే హవా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పక్షం కనీసం ఊహించని విధంగా వచ్చాయి. వరుస ఎన్నికలతో డీలా పడ్డ ప్రతిపక్షానికి కొత్త ఊపిరిలు ఉదితే అధికార పక్షంలో కల్లోలం రేపాయి. ఈ ఫలితాలే ఇప్పుడు ఏపీలో పెద్ద డిస్కషన్ టాపిక్… 2024లో కూడా ఇదే జరగబోతోందని టీడీపీ చెబుతోంది. వైసీపీ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.

మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టించాయి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీకి అంత మెజారిటీని అధికారపక్షం ఊహించలేకపోయింది. అదికూడా తాము రాజధాని అని చెబుతున్న విశాఖలోనే చావుదెబ్బ తినడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తూర్పు రాయలసీమలోనూ అదే పరిస్థితి. ఇక పశ్చిమ రాయలసీమ కూడా హోరాహోరీగా సాగింది. తూర్పు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఒక్క ఇంట్లో, ఒకే వ్యక్తికి పది ఓట్లు ఉన్నట్లు కూడా ఆధారాలతో నిరూపించాయి. ఇంత జరిగినా అధికారపక్షం గట్టెక్కలేకపోయింది. ఎన్ని ఓట్లు గుద్దినా జనం తమకు వ్యతిరేకంగా ఓట్లు గుద్దడాన్ని మాత్రం ఆపలేకపోయారు. వెండి బిళ్లలు, నోట్లకట్టలు కాపాడలేకపోయాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికల ఫలితాలను శాసించలేకపోవచ్చు… కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం భవిష్యత్తునే చెబుతున్నాయి. గ్రాడ్యుయేట్లు అంటే ఎవరో కాదు… ఓటర్లలోని ఓ వర్గం… రాష్ట్రంలోని మధ్యతరగతి, చదువుకున్న వారికి ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు ప్రతీక. ఈ ఫలితాలతో రాష్ట్రంలో మధ్యతరగతి, బాగా చదువుకున్న వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని దాదాపు తేలిపోయింది. అంటే ప్రజల్లో ఓ వర్గం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉందన్నమాట. ఇక చదువుకోని, గ్రామీణ ప్రాంత ఓట్లను ఇది ప్రతిబింబించకపోవచ్చు… కానీ ఓ వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందంటే రెండో వర్గంలోనూ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. పైగా మధ్యతరగతి ఓటర్లు ఎంతో కొంత దిగువ తరగతిని ప్రభావితం చేయగలరు… ఓ వర్గంలో వ్యతిరేకత, మరోవర్గంలో కొంతమేర అసంతృప్తి… మొత్తంగా చూస్తే రాజకీయంగా ఇది కీలక అంశమే…

ఇక ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వైసీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర, ఆ పార్టీకీ ఎక్కువగా పట్టున్న రాయలసీమలో తగిలిన దెబ్బలివి… వైసీపీ ఈసారి కోస్తాను ఎక్కువగా నమ్ముకోలేదు. అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమలో సత్తా చాటితే… కోస్తాలో కాస్త సీట్లు తగ్గినా, పరిస్థితి అటూ ఇటూ అయినా గట్టెక్కొచ్చని భావించింది. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 49 గెలిస్తే టీడీపీ గెలిచింది మూడే… కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే పరిస్థితి చాలా మారినట్లు కనిపిస్తోంది. అలాగే ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 28 గెలిస్తే టీడీపీ 6నెగ్గింది. అందులో ఒక్క విశాఖలోనే నాలుగు గెలిచింది. ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లోనూ ఫ్యాను గాలి తగ్గితే సైకిల్ దూకుడు పెరిగినట్లు కనిపిస్తోంది. కోస్తాలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పార్టీ కాస్త వెనకంజలోనే ఉందని సొంత సర్వేలే చెబుతున్నాయి. ఉభయగోదావరిలోనూ హోరాహోరీ కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్యే ఎన్నికల్లో కచ్చితంగా వస్తాయని మనం చెప్పలేం. ఓ వర్గం మాత్రం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉందని స్పష్టంగా తేలిపోయింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఈ ఫలితాలు అధికారపార్టీకి అంత మంచి శకునం కాదు. పైగా ఈ ఫలితాల ప్రభావంతో న్యూట్రల్ ఓటర్ల మనస్సు కూడా మారొచ్చు… మరి అధికారపార్టీ దీన్ని ఎలా అధిగమిస్తుంది…?

(KK)