ఎర్ర చందనంతో ఇన్ని లాభాలున్నాయా? అందుకే కోట్లు పెట్టి మరీ కొంటున్నారు!

అక్కడ ఉండేవి కాకులు దూరని కారడవులు.. చీమలు దూరని చిట్టడవులు.. కళ్లుమూసి తెరిచిలోపే దారితప్పిపోయేంత దట్టమైన అడవులు. మానవమాత్రులు వెళ్లడానికి కూడా ఆలోచించే ఆ అడవుల్లో గొడ్డళ్లు మాత్రం నిర్విరామంగా దెబ్బమీద దెబ్బ వేస్తూనే ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 12:43 PMLast Updated on: Nov 19, 2024 | 12:43 PM

Are There So Many Benefits To Red Sandalwood Thats Why They Are Buying It For Crores

అక్కడ ఉండేవి కాకులు దూరని కారడవులు.. చీమలు దూరని చిట్టడవులు.. కళ్లుమూసి తెరిచిలోపే దారితప్పిపోయేంత దట్టమైన అడవులు. మానవమాత్రులు వెళ్లడానికి కూడా ఆలోచించే ఆ అడవుల్లో గొడ్డళ్లు మాత్రం నిర్విరామంగా దెబ్బమీద దెబ్బ వేస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆ అడవిలో దొరికే ఎర్రబంగారం. అవే శేషాచలం అడవులు. అక్కడ దొరికే బంగారం పేరు ఎర్ర చందనం. అడవి చుట్టూ పోలీసులు ఉంటారని తెలుసు. స్మగ్లింగ్‌ చేస్తే అరెస్ట్‌ చేస్తారనీ తెలుసు. కానీ ఆ ఎర్రచందనం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రాణాలు తీయడానికి కూడా స్మగ్లర్లు వెనకాడటంలేదు అంటే.. దానికి ఉన్న డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎర్రచందనానికి ఇంత డిమాండ్‌ ఉండటానికి కారణం. ప్రపంచంలో ఈ చెట్టు ఇక్కడ తప్ప ఎక్కడా దొరకకపోవడం. కేవలం ఏపీలోని శేషాచలం అడవుల్లో మాత్రమే ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడ ఎర్రచందనం కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సిందే. చైనాలో ఎర్రచందనంతో చేసిన బొమ్మల కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఉంది. ఒకప్పుడు చైనాలో కూడా ఈ చెట్లు పెరిగేవి. కానీ కాలక్రమేనా అక్కడ అంతరించిపోయాయి. కానీ వాళ్లకు ఎర్రచందనం మీద ఉన్న ప్రేమతో పది రెట్లు డబ్బు ఇచ్చైనా సరే ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్లను చూశాకే వేరే దేశాల వాళ్లు కూడా ఎర్ర చందనం కోసం ఎగబడటం మొదలుపెట్టారు. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు చాలా మంది స్మగ్లింగ్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ చెట్టు అంతరించిపోతున్న జాబితాలోకి చేరిపోయింది.

నాణ్యమైన ఎన్న చందనానికి టన్ను 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ చెల్లించి మరీ కొంటుంటారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను కోటిన్నర పైనే పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం ప్రాంతంలో సుమారు 5,160 చదరపు కిలోమీటర్ల మేర ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరగవు. అవి పెరిగే చోటే నాటినా తొలి మూడేళ్లూ వేగంగా పెరుగుతాయి. తరవాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకిగానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపురంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలిభాగం మరింత ఎర్రగానూ వెడల్పుగానూ ఉంటుంది. కాబట్టి చెట్టుకి ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు చేస్తుందన్నమాట. ఆ రంగుని కాపాడేందుకే ఈ చెక్కల్ని చల్లని ప్రదేశాల్లో ఉంచుతారు. అక్కడక్కడా కేరళలోనూ ఉన్నప్పటికీ ప్రధానంగా తూర్పు కనుమల్లోని శేషాచలం అడవులే ఈ చెట్లు ఆవాసాలు. అక్కడి నేలలోని ఆమ్లశాతమూ పోషకాలూ నీరూ ఈ చెట్ల పెరుగుదలకి సరిపోతాయి.

నేలలో ఉండే క్వార్ట్‌జ్‌ రాయి కూడా ఈ చెట్ల పెరగడానికి అవసరమే. అవన్నీ ఇక్కడ ఉండటం వల్లే శేషాచలం కొండప్రాంతం ఎర్ర చందనం చెట్లకి చక్కగా సరిపోయింది. ఈ రకమైన సమ్మేళనం మరెక్కడా ఉండదనీ, నేలతోపాటు ఇక్కడి వాతావరణమూ అవి పెరగడానికి దోహద పడుతుందనీ… ఈ కారణాలవల్లే ఆ ఒక్కచోటే ఈ చెట్లు పెరుగుతున్నాయనీ వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్‌, మయన్మార్‌… వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్‌ ఎక్కువ. అక్కడ దీన్ని కేవలం ఫర్నిచర్‌ తయారీకోసమే కాదు, ఔషధపరంగానూ వాడుతుంటారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకారం- తలనొప్పి, చర్మ వ్యాధులు, జ్వరం, కంటి సమస్యలతోపాటు తేలు విషానికి విరుగుడుగానూ దీన్ని ఉపయోగిస్తారట. జపనీయుల షామిసేన్‌, వయొలిన్‌… వంటి వాటిని ఈ చెక్కతో తయారుచేస్తే వాటి వాద్యం అత్యంత వినసొంపుగా ఉంటుందట. విలాసవంతమైన ఫర్నిచర్‌ చేయడానికి ఎర్ర చందనాన్ని మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. ఆహారపదార్థాలూ ఔషధాల తయారీలోనూ ఈ చెట్టు బెరడు నుంచి తీసిన రంగుని వాడతారు.

న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి వెలువడే వేడిని సైతం ఎర్రచందనం తగ్గించగలదు. నిజానికి మనదగ్గర వాడుకలో ఉన్న చందనం లేదా గంధం మాదిరిగా ఎర్ర చందనం మంచి సువాసన రాదు. కానీ దీన్నుంచి తీసిన నూనెను కాస్మెటిక్స్‌ తయారీలో వాడతారు. ఇది చర్మాన్ని మెరిపిస్తుందనీ మొటిమలూ మచ్చలూ వంటివాటిని తొలగిస్తుంది. జీర్ణ సంబంధమైన సమస్యలూ, దగ్గూ జలుబూ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లూ, క్యాన్సర్ల నివారణలోనూ దీన్ని వాడుతుంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మూత్రం ద్వారా శరీరం నుంచి నీరు ఎక్కువగా పోకుండా కాపాడుతుంది. అలాగే ఈ చెక్కని రుచి కోసం ఆల్కహాల్‌ తయారీలోనూ వాడతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా ఇది కొలెస్ట్రాల్‌, కాలేయ సమస్యల్నీ నివారిస్తుంది. చెక్కని మరిగించి తీసిన డికాక్షన్‌ డిసెంట్రీ, డయేరియాల్నీ నివారిస్తుంది. వేరు నుంచి బెరడు వరకూ ఎర్ర చందనం చెట్టులో అన్నీ మనుషులకు మంచి చేసేవే. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ఈ ఎర్ర బంగారం మార్కెట్‌లో కోట్లు కురిపిస్తోంది.