YS Sharmila: షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ ! ఏం జరిగింది ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని వారాలుగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తహతహలాడుతున్నారు. కానీ ఈ ప్రయత్నాలు చేతికి అందినట్టే అంది చేజారిపోతున్నాయి. ఢిల్లీ వేదికగా తాజాగా జరిగిన పరిణామాలతో చూస్తే షర్మిల పార్టీ.. కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ పై ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 12, 2023 | 11:43 AMLast Updated on: Aug 12, 2023 | 11:43 AM

Are These The Reasons Behind The Delay In The Process Of Merging Ys Sharmila Ysrtp With Congress

గత రెండు రోజులుగా షర్మిల ఢిల్లీలోనే మకాం వేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం పై కాంగ్రెస్ పెద్దలతో మాటా మంతి నిర్వహించారు. ఈమె వెంట భర్త అనిల్ కూడ ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, యువనాయకుడు రాహూల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వం పై అవిశ్వాసానికి బలం చేకూర్చే పనుల్లో బిజీగా ఉన్నారు. దీని కారణంగా గురువారం షర్మిలకు ఈ ప్రముఖ వ్యక్తులతో అపాయింట్మెంట్ లభించలేదు. శుక్రవారం ఖర్గేని కలిసి పార్టీ విలీనం పై మాట్లాడారు. దీనిపై ఎలాంటి స్పష్టతను అధ్యక్షుడు ఇవ్వలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

వ్యతిరేకవర్గం వల్లే విలీనంలో జాప్యమా..?

తెలంగాణలో ఒక వర్గం షర్మిలకు మద్దతు తెలుపకపోవడమే అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటూ పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తిరస్కరిస్తున్నట్లు సమాచారం. దీనికి గల ప్రదాన కారణాలు.. వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా గతంలో వ్యతిరేఖవైఖరిని అవలంబించడం. తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానంతో చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈమెను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చేర్చుకొని ముందుకు సాగితే రానున్న ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురై కాంగ్రెస్ ఓటమి చవిచూసే అవకాశం ఉందని వీరి వాదన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ గా పనిచేసేందుకు ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి వర్గం చెబుతున్న మాట. ఇలాంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియను కొంత కాలం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే షర్మిలకు కాంగ్రెస్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కనపడటంలేదు. అందుకే షర్మిల కూడా ఢిల్లీ వదిలి హైదరాబాద్ కు వచ్చేసినట్లు తెలుస్తుంది.

కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే కోమటి రెడ్డి వెంకట రెడ్డి షర్మిల పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆమె కాంగ్రెస్ లో కి రావడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అదృష్టంగా భావిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తి అని, ఆయనకు ఆంధ్రలోకంటే తెలంగాణలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తే వైఎస్సార్ కి ఇచ్చిన గౌరవమే షర్మిలకు కూడా ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే వీటన్నింటిపై ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా వెళ్లిపోయారు షర్మిల.

కోమటి రెడ్డి మద్దతు పై అసలు కారణం ఇదేనా..?

షర్మిల కు..  కోమటి రెడ్డి మద్దతుపై అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సందర్భం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిని షర్మిల ఏకిపడేశారు. షర్మిలను కాంగ్రెస్ లో ఆహ్వానించడం ద్వారా రేవంత్ కు కొంత మింగుడు పడే పరిస్థితి ఉండదు. అతని దూకుడుకు కళ్ళెం వేయవచ్చు అని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీటన్నింటితో పాటూ గతంలో కోమటి రెడ్డికి జరిగిన అవమానాన్ని ఇలా షర్మిల ద్వారా రేవంత్ రెడ్డిపై తీర్చుకోవాలని కోమటి రెడ్డి భావిస్తున్నట్లు కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

T.V.SRIKAR