ట్రంప్ ఇగోను టచ్ చేసిన ట్రూడో, జిన్‌పింగ్ చైనా, కెనడాకు కష్టాలు మొదలైనట్టేనా?

డొనాల్డ్ ట్రంప్.. టెంపర్‌కు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైప్. ప్రపంచంలో ఎంతటి పవర్ ఫుల్ లీడర్ అయినా ట్రంప్‌తో పెట్టుకోవాలని, ఆయన ఇగోను టచ్ చేయాలని కలలో కూడా అనుకోరు. కానీ, కెనడా ప్రధాని ట్రూడో ఆ సాహసం చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 02:39 PMLast Updated on: Dec 12, 2024 | 2:39 PM

Are Trudeau Jinping China And Canada In Trouble After Trumps Ego Was Touched

డొనాల్డ్ ట్రంప్.. టెంపర్‌కు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైప్. ప్రపంచంలో ఎంతటి పవర్ ఫుల్ లీడర్ అయినా ట్రంప్‌తో పెట్టుకోవాలని, ఆయన ఇగోను టచ్ చేయాలని కలలో కూడా అనుకోరు. కానీ, కెనడా ప్రధాని ట్రూడో ఆ సాహసం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాకు పన్నుపోటు తప్పదన్న వార్నింగ్‌పై.. తామూ అదేపని చేస్తామని ప్రకటించి ట్రంప్ ఇగోను టచ్ చేశారు. ట్రూడో మాత్రమే కాదు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైతం టారిఫ్ వార్‌లో దేనికైనా రెడీ అని ట్రంప్‌తో ఢీ అన్నారు. జిన్‌పింగ్ సంగతెలా ఉన్నా ఏం చేసుకుని కెనడా ప్రధాని.. అంతటి ట్రంప్‌తోనే ఢీ అంటున్నారనే చర్చ మొదలైంది. అసలేంటీ టారిఫ్ వార్? ట్రంప్ పదే పదే టారిఫ్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? టారిఫ్ అస్త్రం సంధిస్తే కెనడా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా పతనమైపోతాయి? అన్నింటికీమించి ట్రంప్ టారిఫ్ యాక్షన్ మన దేశానికి ఎలా కలిసొస్తుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్..’ ఈ రెండు నినాదాలే తెంపరి ట్రంప్‌ను అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిని చేశాయి. తాను అధికారంలోకి వస్తే అమెరికాను మరోసారి తిరుగులేని శక్తిగా నిలబెడతానని ట్రంప్ ప్రామిస్ చేశారు. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తున్నారు కూడా. పదే పదే టారిఫ్ ప్రస్తావన తీసుకురాడానికీ అదే రీజన్. కెనడా, చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధించాలనేది ట్రంప్ ప్లాన్. అలా చేస్తే అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. తాము దిగుమతి చేసుకునే వస్తువులపై చాలా దేశాలు అధిక పన్నులు విధిస్తున్నాయి కాబట్టి తామూ అదే పని చేస్తామనేది ట్రంప్ మాట. ట్రంప్ చెప్పిన దేశాల లిస్టులో కెనడా, చైనా మొదటి స్థానంలో ఉన్నాయి. ట్రంప్ ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో అప్పుడే ఆ రెండు దేశాల్లో గుబులు మొదలైంది. దీంతో ముందే ట్రంప్‌ను కాకాపడితే ఈ గండం నుంచి గట్టెక్కేయొచ్చని ట్రూడో భావించారు. అనుకున్నదే తడవుగా అమెరికా వెళ్లి ట్రంప్‌తో భేటీ అయ్యారు. అసలే కష్టాల్లో ఉన్నామనీ, పన్నులు పెరిగితే తమ దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయని వేడుకున్నారు. కానీ, అంత ఈజీగా కరిగిపోడానికి అక్కడ ఉన్నది జో బైడెన్ కాదు డొనాల్డ్ ట్రంప్..!

ట్రూడో విజ్ఞప్తులను ప్రశాంతంగా విన్న ట్రంప్.. మొహమాటం లేకుండా అది కానిపని అని తేల్చేశారు. అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లకు చేరువవుతోందనీ, కాబట్టి పన్నులు పెంచక తప్పదన్నారు. ఆ తర్వాతే అసలు లెక్కలు బయటకు తీశారు. కెనడా నుంచి తమ దేశానికి అక్రమ వలస లు, డ్రగ్స్ అక్రమ రవాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనీ, ముందు అవన్నీ ఆగిపోవాలని ట్రూడోకు వార్నింగ్ ఇచ్చారు. చివరగా తాను చెప్పినవి చేయడం చేతకాకపోతే, భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోవాలని ట్రూడోకు దిమ్మతిరిగిపోయే ప్రకటన చేశారు. ట్రంప్ నోట నుంచి ఈ మాట విన్న తర్వాత ట్రూడో నోట మాటరాలేదంటే అతిశయోక్తి కాదు. ట్రంప్ వర్షన్ విన్న తర్వాత చేసేదిలేక కెనడా ప్రధాని అక్కడి నుంచి బయటపడ్డారు. బయటకొచ్చిన తర్వాత కామ్‌గా ఉండ కుండా ట్రంప్‌ గురించి తెలిసి కూడా నోరు జారారు. తమ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ టారిఫ్ విధిస్తే.. తానూ అదే పని చేస్తాననీ, అది అమెరికాకే నష్టం కలిగిస్తుందని ట్రంప్ ఇగోను టచ్ చేశారు. నిజానికి.. అమెరికా కెనడా నుంచి 65శాతం చమురు, పెద్ద ఎత్తున విద్యుత్, సహజవాయువు దిగుమతి చేసుకుంటుంది. అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులకూ కెనడాపైనే ఆధారపడుతుంది. వాటన్నింటిపైనా తాము టారిఫ్ విధిస్తే ట్రంప్, తిక్క కుదురుతుందనేది జస్టిన్ ట్రూడో లెక్క. కానీ, అది అర్ధమయ్యేలా చెప్పడంలోనే ఆయన ఫెయిలయ్యాడు. పనికట్టుకుని ట్రంప్ ఇగోను టచ్ చేశాడు.

ట్రూడో నుంచి ఈ రేంజ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ట్రంప్ ఊరుకుంటారా? వెంటనే తన సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ట్రూత్‌లో ఓ పోస్ట్ వేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. “గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్ కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రూడోతో కలిసి డిన్నర్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరోసారి గవర్నర్‌తో భేటీ అయ్యి సుంకాలు, వాణిజ్యంపై లోతుగా చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాం. ఆ చర్చల ఫలితం అద్భతంగా ఉంటుంది” అని. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. ట్రూడో కెనడాకు ప్రధాని.. కానీ, ట్రంప్ ఆయన్ను గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్ కెనడా గవర్నర్‌‌గా సంబోధిచారు. అంటే అల్రెడీ కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా ప్రకటించారన్నమాట. తనతో ఎక్స్‌ట్రాలు చేస్తే కెనడాను తమ దేశంలో కలిపేస్తామని ఆ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వివాదంలో ట్రూడో వెనక్కి తగ్గకపోతే ట్రంప్ అన్నంత పనీ చేసినా చేస్తారు. అయినా ఖలిస్తానీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం అంత ఈజీ కాదు ట్రంప్‌తో పెట్టుకోవడం. ఈ నిజాన్ని ఇప్పటికైనా గుర్తించకపోతే ట్రూడో పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడటం ఖాయం.

ట్రంప్‌తో టారిఫ్ యుద్ధంలో ఢీ అంటున్న మరో లీడర్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్‌పింగ్. ట్రూడోతో పోల్చుకుంటే ఈయన కాస్త బ్యాలెన్స్‌గానే వ్యవహరించారు. ఎందుకంటే, ట్రంప్‌ టెంపర్ ఏంటో జిన్‌పింగ్ కు తెలుసు. పైగా అమెరికాతో వాణిజ్య యుద్ధం కూడా చైనాకు కొత్త కాదు. అగ్ర దేశాల మధ్య ఈ యుద్ధం ఎప్పట్నుంచో జరుగుతోంది. తాజాగా టారిఫ్‌ వార్‌, ట్రేడ్‌ వార్‌, టెక్నాలజీ వార్‌ అనేవి చారిత్రక పోకడలకు, ఆర్థిక చట్టాలకు విరుద్ధంగా నడుస్తాయి.. వీటిలో విజేతలు ఉండరని జిన్‌పింగ్ పేర్కొన్నారు. జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అందరికంటే అధికంగా చైనాపై పన్నులు విధిస్తానని ట్రంప్ చెప్పడమే. చైనా నుంచి దిగుమతిచేసుకునే వస్తువులపై 60శాతం పన్నులు విధిస్తా అన్నారు. అవసరం అనుకుంటే మరో 10శాతం పెంచుతాననీ తేల్చిచెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ట్రంప్ గెలుపు జిన్‌పింగ్‌కు మరిన్ని కష్టాలు తెచ్చింది. ట్రూడోలాగా ట్రంప్‌ను బతిమలాడలేని పరిస్థితి. అందుకే, అధిక పన్నులు అన్యాయం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ, అవేవీ ట్రంప్‌ను కదిలించలేవు. సో.. జనవరి 20 అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేయగానే ఇటు చైనా, అటు కెనడాలకు సీరియల్ కష్టాలు మొదలైనట్టే. మరి ఈ వ్యవహారం భారత్‌కు ఎలా కలిసొస్తుంది? అక్కడికే వద్దాం..

నిజానికి.. ట్రంప్ పన్నులు విధిస్తానని చెబుతున్న దేశాల లిస్టులో ఇండియా కూడా ఉంది. అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక పన్నులు విధిస్తోందని పలు సందర్భాల్లో ట్రంప్ ఆరోపించారు కూడా. అయితే, చైనా, కెనడాలతో పోల్చుకుంటే మనకొచ్చిన రిస్క్ అంతగా ఉండక పోవచ్చు. పైగా భారత్‌తోనూ, ప్రధాని మోడీతోనూ ట్రంప్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో వాణిజ్యపరంగా భారత్‌కు మద్దతిచ్చారు. ట్రంప్‌కు చైనాను అమెరికా స్థానం లోకి రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇండో-పసిఫిక్‌లో చైనాను నిలువరించాలంటే భారత్ సాయం ట్రంప్‌కు అవసరం. కాబట్టి ఈ టారిఫ్ వార్‌లో భారత్‌ను ఇబ్బందిపెట్టే అవకాశాలు చాలా తక్కువే అనేది ఆర్ధిక నిపుణుల అంచనా. ఓవరాల్‌గా ట్రంప్ ఎంట్రీతో మన శత్రు దేశాలకు కొత్త చిక్కులు, మనకు వాణిజ్య అవకాశాలు పెరగబోతున్నాయన్నమాట.