వైసీపీ నేతలకు అరెస్టుల భయం పట్టుకుందా ? అపుడు వాగిన వారంతా ఇప్పుడేమయ్యారు ?

మొన్న బోరుగడ్డ అనిల్...నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్‌ ఎవరు ? బూతులు నేత కొడాలి నానియా ? లేదంటే ఆర్కే రోజానా ? వీళ్లిద్దర్నీ కాదని పేర్ని నానిని అరెస్టు చేస్తారా ? ఈ జాబితాలో రాంగోపాల్‌ వర్మ కూడా ఉన్నారా ? వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 03:50 PMLast Updated on: Feb 28, 2025 | 3:50 PM

Are Ycp Leaders Afraid Of Arrest

మొన్న బోరుగడ్డ అనిల్…నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్‌ ఎవరు ? బూతులు నేత కొడాలి నానియా ? లేదంటే ఆర్కే రోజానా ? వీళ్లిద్దర్నీ కాదని పేర్ని నానిని అరెస్టు చేస్తారా ? ఈ జాబితాలో రాంగోపాల్‌ వర్మ కూడా ఉన్నారా ? వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరిలో ముందు జైలు ఊచలు లెక్కపెట్టేదెవరు ? మాజీ మంత్రులకు అరెస్టు భయం పట్టుకుందా ? వంశీ అరెస్టుతో నేతలంతా గప్‌చుప్‌ అయిపోయారా ?

వికెట్‌ తర్వాత వికెట్‌ పడగొడుతున్నారు. ఆలస్యం అవుతుందేమో గానీ…వికెట్‌ మాత్రం పక్కాగా తీస్తున్నారు. ప్రత్యర్థులు ఊపిరిపీల్చుకోనివ్వకుండా వ్యూహాలు అమలు చేస్తోంది నాటి ఫీల్డింగ్‌ టీం. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే కానీ…హిట్‌ వికెట్‌గా మాత్రం వెనుదిరగకూడదన్న లక్ష్యంతో ప్రస్తుత బ్యాటింగ్‌ జట్టు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికి ముగ్గుర్ని పెవిలియన్‌కు చేర్చింది. దీంతో నెక్స్ట్‌ వికెట్‌ ఎవరన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నాడు ఫీల్డింగ్‌ చేసిన టీడీపీయే…నేడు అధికారంలోకి వచ్చి బ్యాటింగ్‌తో విరుచుకుపడుతోంది.

వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్‌ మాములుగా రెచ్చిపోలేదు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. నాలుక ఎంత తిరిగితే అంతలా వాగాడు. బూతులకే వెగటు పుట్టేలా పరుషపదజాలంతో తిట్లదండకం అందుకున్నాడు. కుటుంబసభ్యులను దూషించాడు. కూటమి అధికారంలోకి రావడంతో జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ తర్వాత భువనేశ్వరిని ఘోరంగా అవమానించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోపలేశారు. కస్టడీలోకి తీసుకుని విచారించారు. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళిని ఉమ్మడి కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈయన కూడా గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లపై బూతుపంచాంగం అందుకున్నాడు. ఇష్టమొచ్చినట్లు బూతులతో రెచ్చిపోయాడు.

బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళీ అరెస్టు కావడంతో…నెక్స్ట్‌ ఎవరన్న దానిపై ఏపీలో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. వీరి ముగ్గురి తర్వాత ఎవరు అరెస్టు అవుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు ఆలియస్‌ కొడాలి నాని, పేర్ని వెంకట్రామయ్య ఆలియస్ పేర్ని నాని, ఆర్కే రోజా, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడే కాదు…ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పేర్ని నాని నోటికి అడ్డు అదుపు లేదు. రేషన్‌ బియ్యం కేసులో ఇవాళ రేపు అరెస్టులంటూ…లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. అరెస్టయితే ఏమవుతుంది ? నా వెంట్రుక కూడా పీకలేరంటూ…చేతిపై ఉన్న వెంట్రుకను పీకి చూపించారు. దీంతో ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. అధికారం పోయినా…బలుపు తగ్గలేదంటూ కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ఈయన వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ను ఓ రేంజ్‌లో తిట్టారు.

కొడాలి నాని, ఆర్కే రోజా అయితే…తమ నోటిదూలను ప్రదర్శించారు. లోకేశ్‌ను పప్పు, మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి…అంటూ పరుషపదజాలం ప్రయోగించారు. పవన్‌ కల్యాణ్‌పై మరింత రెచ్చిపోయారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని…పెళ్లిళ్లు చేసుకోవడం..వదిలేయడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటేనంటూ తీవ్రంగా విమర్శించారు. జనసేనాని రీల్‌ లైఫ్‌కి…రియల్‌ లైఫ్‌కు పోలిక ఉండందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జోగి రమేశ్‌,ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌ అయితే…చంద్రబాబుపై అమ్మ నా బూతులు ప్రయోగించారు. నోటితో చెప్పలేని విధంగా మాట్లాడారు.

రాంగోపాల్‌ వర్మ అయితే…చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు…సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టాడు. ఇప్పటికే వర్మను ప్రకాశం జిల్లా పోలీసులు విచారించారు. విశాఖ,అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో వర్మపై కేసులు ఉన్నాయి. దీంతో ఆయన కూడా హిట్ లిస్టులో ఉన్నాడు. ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేస్తారన్న టెన్షన్‌లో వైసీపీ నేతలు ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ జీవితాలను గడుపుతున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సైతం…కొడాలి నాని, దేవినేని అవినాశ్‌ను అరెస్టు చేస్తారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో వైసీపీ నేతలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు.