Top story: ఇంకా సినిమా హీరో గానే చూస్తున్నారా
పొలిటికల్ లీడర్ గా, ఏపీ డిప్యూటీ సీఎం గా .... రాజకీయం ఉనికి కోసం పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారా? ఆయన అసహనానికి గురవుతున్న తీరు చూస్తే పవన్ ని జనం ఇంకా సినిమా హీరో గానే చూడడంతో ఇబ్బంది పడుతున్నారనేది అర్థమవుతుంది.
పొలిటికల్ లీడర్ గా, ఏపీ డిప్యూటీ సీఎంగా… రాజకీయం ఉనికి కోసం పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారా? ఆయన అసహనానికి గురవుతున్న తీరు చూస్తే పవన్ ని జనం ఇంకా సినిమా హీరో గానే చూడడంతో ఇబ్బంది పడుతున్నారనేది అర్థమవుతుంది. అయితే సినిమా ప్రపంచం నుంచి, అవాస్తవిక వాతావరణం నుంచి ఆయనే బయటపడడం లేదనేది కొందరి వాదన.ఒకరోజు యూత్ చొక్కాలు చింపుకోవాలి, సైలెన్సర్ తీసి బైకులు సౌండ్ చేయాలి అంటారు. మరో రోజు ఓ జి అని అరిస్తే కోపగించుకుంటారు. పవన్ మైండ్ సెట్ తో పొలిటికల్ అభిమానులు, ఫ్యాన్స్ ఇద్దరు గందరగోళంలో పడుతున్నారు.
గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన మాటలు ఇవి. ఇలాంటి మాటలు పవన్ నుంచి ఎవరూ ఊహించి ఉండరు కూడా. గోదావరి జిల్లాల్లో దారితప్పిన యువత లక్షణాలు ఇవి. చొక్కాలు చింపుకోవాలి…. సైలెన్సర్లు పీకి బైకులు నడపాలి…. సినిమాలు చూడాలి… అలా ఎనర్జీ బయటికి డ్రైవ్ చేయాలి….. అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గతంలో ఆయన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది. పదివేల పుస్తకాలు ఎప్పటికైనా చదవాలి అని చెప్పిన పెద్దమనిషి… ఇప్పుడు చొక్కాలు చించుకోండి, సైలెన్సర్లు పీకేసి బైక్లు నడపండి అని యూత్ కి చెప్పడం చాలా విడ్డూరంగా అనిపించింది. చాలామంది ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఆక్షేపించారు కూడా. ఇది జరిగిన కొద్ది రోజులకే తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయినప్పుడు, పరామర్శకు వెళ్లిన పవన్నీ చూసి ఫ్యాన్స్ కేకలు వేశారు. దాంతో అయినా ఆగ్రహంతో ఊగిపోయారు. మనుషులు చనిపోతే మీకు సినిమాలు ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .
పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. ఆయన తనను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఊహించుకుంటున్నారు. జనం కూడా తన అలాగే తనని రిసీవ్ చేసుకోవాలని పవన్ కోరుకుంటున్నారు. కానీ పబ్లిక్ మాత్రం పవన్ లో ఇంకా సినిమా హీరోనే చూస్తున్నారు. నిజానికి 100% స్ట్రైక్ రేట్ తో జనసేన గెలవడం గాని, 164 సీట్లు కూటమి రావడానికి గాని పవన్ సినిమా ఇమేజ్ కూడా ఒక కారణం. దాంతోపాటు జగన్ అరాచకం, ప్రజల్లో వైసిపి పట్ల వ్యతిరేకత కూడా కూటమి గెలవడానికి కారణమైంది. పైగా పవన్ ఇంకా మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అడపాదనప షూటింగ్స్ లోను పాల్గొంటున్నాడు .అందువల్ల అతనిలో సీరియస్ పొలిటిషన్ ని జనం ఇప్పటికీ చూడలేకపోతున్నారు.
జగన్, చంద్రబాబు, మోడీ లాంటివాళ్ళు పూర్తిస్థాయి రాజకీయవేత్తలు. వాళ్లకు సినిమా గ్లామర్ ఉండదు. రాజకీయ నాయకులైన తర్వాత ప్రజల్లో అభిమానం సంపాదిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పరిస్థితి వేరు. సినిమా గ్లామర్ తోనే ప్రజల్లోకి వెళ్లారు. ముందు నటుడుగానే ఆయన జనంలో గుర్తింపు పొందారు. ఆ తర్వాతే పవన్ ని పొలిటికల్ లీడర్ గా జనం గుర్తించారు. అందువలన సినిమా ఇమేజ్ పవన్ త్వరగా పోగొట్టుకోవడం చాలా కష్టం. తాను చంద్రబాబు పక్కన కూర్చున్నాను కాబట్టి, మోడీ పక్కన నడిచాను కాబట్టి తనని జనం పూర్తిస్థాయి పొలిటికల్ లీడర్ గా చూడాల్సిందే అని పవన్ భావిస్తే అది కొద్దిగ కష్టమే. సినిమా గ్లామర్ ని బేస్ గా చేసుకొని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమా నటుడు గాని చూస్తారు తప్ప పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఎలా చూస్తారు? ఎన్టీఆర్ ,ఎంజీఆర్ లాంటి వాళ్లు కూడా మొదట్లో ఇదే సమస్యను ఫేస్ చేశారు. అయితే వాళ్లు పవన్ లాగా ఆవేశ పడలేదు. కానీ పవన్ మాత్రం ఒకేసారి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిపోవడంతో తాను పూర్తిస్థాయి పరిణితి చెందిన పొలిటికల్ లీడర్ లాగా తనను భావించుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ ఇంకా పరిణితి చెందలేదుగా. వాళ్లు పవన్ ను చూసి వచ్చినప్పుడల్లా కేకలు పెడుతూ ఉంటారు. దాంతో ఆయనకు అసహనం వచ్చేస్తుంది .కొన్నాళ్లపాటు పవన్ కి ఈ ఇబ్బంది తప్పదు. లేదా సినిమా రంగం నుంచి పూర్తిగా తప్పుకుంటే తప్ప ఆ ఇమేజ్ నుంచి పవన్ బయటపడలేడు.