Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 2024 ఎన్నికల అస్త్రంగా మారబోతోందా ?

రానున్న రోజుల్లో సోషల్ మీడియా కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలను, గెలుపోటములను కృత్రిమ మేధస్సు ప్రభావితం చేయబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 10:13 AMLast Updated on: May 25, 2023 | 10:13 AM

Artificial Intelligence Can Influence Indian Politics And Eletions

Artificial intelligence: కర్ణాటక ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ మొదలైపోయింది. తెలంగాణ సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది ఏపీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 2023-24 మనదేశానికి సంబంధించి ఎలక్షన్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు.

రాష్ట్రాల్లో పాగావేసేందుకు ఓవైపు ప్రాంతీయ, జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. మరోవైపు కర్ణాటక ఫలితం ఇచ్చిన ఊపుతో మోదీని ఈసారైనా గద్దెదించేందుకు విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన అన్ని రాజకీయ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంప్రదాయ ఎన్నికల ప్రచారాలు జరిగేవి. కానీ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పార్టీలకు, అభ్యర్థులకు కొత్త అస్త్రం దొరికింది. దాదాపుగా 2019 నుంచి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను సోషల్ మీడియా క్యాంపెయిన్స్ డామినేట్ చేస్తున్నాయి.

తమ గురించి తాము పాజిటివ్‌గా ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు.. ప్రత్యర్థులపై నెగిటివ్ ప్రచారం చేయడం మరో ఎత్తు. ఈ రెండింటికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది. ఒకానొక దశలో సోషల్ మీడియా కేంద్రంగా కొన్ని పార్టీలు ఫేక్ ప్రచారాలకు కూడా తెరలేపాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో ఓటర్లు తెలుసుకోలేని స్థాయిలో సోషల్ మీడియా ప్రచారాలతో అన్ని పార్టీలు హోరెత్తించాయి. అయితే రానున్న రోజుల్లో సోషల్ మీడియా కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలను, గెలుపోటములను కృత్రిమ మేధస్సు ప్రభావితం చేయబోతోంది.
ఎలక్షన్ ఎజెండా AI చేతిలోకి వెళ్లిపోతుందా ?
ఒక్కసారి కొన్ని సంవత్సరాల పాటు కాలాన్ని రివైండ్ చేయండి. ఫోటోషాప్ అనే ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చినప్పటి సంగతి. కలయా.. నిజమా అన్నట్టు ఫోటోషాప్‌తో ఫోటోలను ఎడిటింగ్ చేసేవాళ్లు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సృష్టించేవాళ్లు. మార్ఫింగ్ ఇమేజ్‌లతో గ్రాఫిక్ డిజైనర్లు జనాలను ఫూల్స్ చేసేవాళ్లు. టెక్నాలజీతో ఇలా కూడా చేయవచ్చా అని ఔరా అంటూ జనం నోరు వెళ్లబెట్టిన సందర్భాలు లేకపోలేదు. సో జనాన్ని నమ్మించేందుకు, వారి అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు ఫోటోషాప్ టెక్నిక్స్ ప్రయోగించేవారు. సోషల్ మీడియా ఎంట్రీతో ఆ దశ ఎప్పుడో మారిపోయింది.

ఫేక్ ప్రోపగాండాకు సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. కాలం గడిచే కొద్దీ అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీ మానవాళికి ఎంత మేలు చేస్తుందో తెలియదు గానీ.. ఊహించని కీడు కూడా చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకే పునాదిగా ఉండే ఎన్నికల ప్రక్రియను ఆధునిక టెక్నాలజీ విపరీతంగా ప్రభావితం చేస్తోంది. సాంకేతిక కారణంగా ఎన్నికల ప్రక్రియ మెరుగుపడితే ఆనందించవచ్చు. కానీ కృత్రిమ మేధస్సు వంటి టెక్నాలజీ కారణంగా ఎన్నికల వ్యవస్థ మొత్తం మానిపులేట్ అయిపోతోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించడమే కాదు.. ప్రజాభిప్రాయాన్ని శాసించే స్థాయిలో ప్రభావితం చూపించబోతోంది.
AI చెప్పినట్టు ఓటర్లు తలాడించాల్సిందేనా ?
కృత్రిమ మేధస్సు మనదేశంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ముందు ఒక్కసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. బ్రిటన్ కు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనాలటికా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫేస్ బుక్ యూజర్లకు తెలియకుండానే లక్షలాది యూజర్ల డేటాను తస్కరించి వాటిని మానిపులేట్ చేసి.. ఆ డేటా ఆధారంగా అమెరికా ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది. ఒకరకంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఫేస్ బుక్ డేటా ఉపయోగపడింది. సెంట్రల్ ఆఫ్రికాలోని గాబన్ అనే దేశంలో కూడా ఇలాంటిదే జరిగింది. అధ్యక్షుడు అలీ బాంగో అనారోగ్యంతో మంచానపడ్డారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఒక ఫేక్ వీడియో 2018లో రాజకీయ సంక్షోభానికి కారణమైంది. మనదేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ రంగ ప్రవేశం చేశాయి. ప్రత్యర్థి పార్టీలపై సోషల్ మీడియా ప్రాపగాండా కోసం వీటిని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించినట్టు విమర్శలున్నాయి.
త్వరలో జరిగే ఎన్నికల్లో ఏం జరగబోతోంది ?
ఓటర్ల ఆలోచనలను, పొలిటికల్ థాట్స్‌ను ప్రభావితం చేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 900 మిలియన్లు దాటుతుందని ఓ అంచనా. అందులో 18 ఏళ్లు నిండి ఓటర్లుగా ఉన్న వారి సంఖ్య 90 శాతం పైనే ఉంటుంది. వీరందర్నీ తమ ఓటు బ్యాంకుగా మార్చకునేందుకు కృత్రిమ మేధస్సును రాజకీయ అస్త్రంగా వాడుకోబోతున్నాయి పార్టీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన పొలిటికల్ క్యాంపైన్స్ సోషల్ మీడియాను సునామీలా చుట్టేయబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని శాసిస్తున్న చాట్ జీపీటీ 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతోంది. ఓటర్లను కట్టిపడేసేలా ప్రసంగాలు రూపొందించడం, ఏది వాస్తవమో.. ఏది అవాస్తమో తెలుకోలేనంతగా రాజకీయ పార్టీల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి పనులను చాట్ జీపీటీ సమర్థవంతంగా చేయబోతోంది.

అయితే ఈ ప్రాపగాండా ఇంతటితో ఆగదు. 2024 ఎన్నికలు సమీపించే సరికి.. వాస్తవాల వక్రీకరణలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన మిస్ ఇన్ఫర్మేషన్ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ను చుట్టేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇమేజ్‌లు, ఆడియోలు, వీడియోలు, టెక్ట్స్ మెసేజ్‌లు ఇలా ఒక్కటేంటి.. పబ్లిక్ ఒపీనియన్‌ను మానిపులేట్ చేయడానికి ఏం కావాలో.. అన్ని రకాల పాత్రలను AI పోషిస్తుంది. ఇప్పటికీ డీప్ ఫేక్ టెక్నాలజీతో మనిషిని పోలిన మనిషిని ఆన్‌లైన్ లో సృష్టించి వాటితో విషప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ ఫేక్ ప్రచారాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఫోటోషాప్ కాలంలో ఒక ఫేక్ ఇమేజ్‌ను సృష్టించడానికి చాలా సమయం పట్టేది. కానీ AI రోజుల్లో అంతా సెకన్లలో జరిగిపోతోంది. మనకు ఏం కావాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెవిన పడేస్తే చాలు.. క్షణాల్లో కుప్పలు తెప్పలుగా మనకు కావాల్సిన ఔట్ పుట్ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.
AI అరాచకాలను నియంత్రించలేమా ?
చాట్ జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ఏఐ అధినేత శామ్ ఆల్టమాన్ కొన్ని రోజుల క్రితం అమెరికా సెనెట్ ముందు హాజరయ్యారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాట్ జీపీటీ కీలకంగా మారబోతోందని.. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏఐతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. అంతకు మించి దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. చాట్ జీపీటీ సృష్టికర్తే ఆ మాట అన్నాక AIని నియంత్రించలేకపోతే అమెరికా మాత్రమే కాదు.. భారత్ సహా అనేక దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నియంత్రించడంపై భారత్ తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని టెక్నాలజీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వాడాలి.. ఎలా వాడకూడదు.. అన్న విషయాల్లో స్పష్టత ఇస్తూ రెగ్యులేటింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనపిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంప్రదాయ విధానాలకు మాత్రమే కేరాఫ్ గా ఉన్న భారత్ ఇప్పుడు డిజిటిల్ టెక్నాలజీని వాడటంలో అమెరికా, చైనాతో పోటీపడుతోంది. అందుకే భారత ప్రభుత్వం టెక్నాలజీ రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఏఐ నియంత్రణ విధానాన్ని రూపొందించాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా.. కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. సామాజిక, సాంస్కృతిక రంగాలు కూడా ప్రభావితమై కృత్రిమ మేధస్సు దేశాన్ని కబళించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.