ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ సినిమా రేంజ్ లోనే ఉన్నాయి. బన్నీని ఎలా అయినా ఒక రోజు జైల్లో పెట్టాలనే పట్టుదలలో పోలీసులు ఉన్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత హైకోర్ట్ లో వాడీ వేడీ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ కు హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయనను రిలీజ్ చేయడంలో కాస్త జాప్యం జరిగింది. రాత్రి కచ్చితంగా విడుదల చేస్తారని అందరూ ఎదురు చూసారు. అల్లు అరవింద్ కూడా పొద్దుపోయే వరకు జైలు వద్దనే ఉన్నారు. ఇక జైలు అధికారులు వెళ్ళిపోవడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదల అయ్యాడు. అయితే కావాలనే ఈ జాప్యం చోటు చేసుకున్నట్లు బన్నీ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో తమ క్లైంట్ ను అక్రమంగా నిర్బంధించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని జైలు అధికారులు స్వీకరించినప్పటికీ ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారన్నారు. నిందితులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పినా జైల్లో ఉంచారని. ఆర్డర్ కాపీ అందుకున్నప్పటికీ, వారు అల్లు అర్జున్ విడుదల చేయలేదని మండిపడ్డారు. మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే, మీరు నటుడిని విడుదల చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని... అయినప్పటికీ, వారు అలా చేయలేదన్నారు. కావాలనే ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచినట్టు ఆరోపించారు. దీనిపై తాము చట్టపరమైన చర్యల కోసం పోరాడుతమని ప్రకటించారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ అందడంలో ఎలాంటి జాప్యం లేదని, తాము హైకోర్టు ఉత్తర్వుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని తక్షణమే సమర్పించామని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు మెసెంజర్ కూడా ఒక కాపీని అధికారులకు అందించారని చెప్తుంటే జైలు అధికారుల వాదన మరోలా ఉంది. తమకు అర్థరాత్రి బెయిల్ ఆర్డర్ వచ్చిందని, జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీలను రాత్రి సమయంలో విడుదల చేయలేమని, మరుసటి రోజు ఉదయం నటుడిని విడుదల చేసినట్లు జైలు అధికారులు చెప్తున్నారు. దీనితో జైలు అధికారులపై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయాలని అల్లు అరవింద్ పట్టుబడుతున్నారు. [embed]https://www.youtube.com/watch?v=-ApqYnIncVE[/embed]