Gaddar : ఎర్రజెండా సాక్షిగా ఒకటే ప్రశ్న… గద్దరన్న ఎవరివాడు..!

అభిమానంతోనో.. ఆయన పాటపై ఉన్న మమకారంతోనో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు.. జూర్జువా పార్టీలు అని ముద్రవేసుకున్న పార్టీలు గద్దర్ కు ఘన నివాళులు అర్పించి ఉండొచ్చు. కానీ ఎందుకో వామపక్షాలు మాత్రం గద్దర్ చివరి ఘడియలను ముందుండి నడిపించలేకపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2023 | 05:27 PMLast Updated on: Aug 07, 2023 | 6:04 PM

As A Red Flag Witness The Only Question Is Who Is Gaddarana

గుమ్మడి విఠలరావుగా పుట్టాడు..గద్దర్‌గా వెళ్లిపోయాడు.. ఆ మధ్య కాలంలో ఆయన వేసిన అడుగులు.. ఆయన కట్టిన గజ్జెలు…ఆయన స్వరంలో నర్తించిన దళిత బహుజన గొంతుకలు..పీడిత ప్రజల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలు.. అన్నీ ఎర్రజెండా చుట్టూనే తిరిగాయి. ప్రజాగాయకుడిగా, మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడిగా, బూర్జువా పార్టీలపై పాటల తూటాలు దింపిన ప్రజా యుద్ధనౌకగా గద్దర్ జీవితం విప్లవ గీతంగానే సాగింది. జీవితం ఏదో ఒకరోజు ముగిసిపోతుంది.. గద్దర్ గొంతు కూడా మూగబోయింది.. గజ్జె ఇక ఆడనన్నది. ఇంతకీ గద్దరన్న ఎవరివాడు..? గద్దర్ అంతిమయాత్రలో ఆ విప్లవ జోహార్లు ఏవి ? పేదల బతుకుల్లో మార్పు కోసం బులెట్లతో సావాసం చేసిన ఎర్రజెండా సూరీడిని అదే ఎర్రజెండా విస్మరించిందా ? వామపక్ష భావాలాన్ని నరనరాల్లో నింపుకున్న గద్దర్ భౌతికకాయంపై ఎర్రజెండా రోదించిందా..?

ఏ భావజాలం ఎవరికోసం వచ్చింది?

శాశ్వత నిద్రలోకి జారుకున్న గద్దర్‌కు నివాళులు అర్పించినవాళ్లెవరు ? ఎల్బీ స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచింది మొదలు గద్దర్ అంతిమ సంస్కారాల వరకు ఆయన చుట్టూ ఉన్న నేతలను , నాయకులను గమనించారా… ఏ భూస్వామ్య విధానాలకు వ్యతికేకంగా గద్దర్ గళం ఘోషించిందో.. అదే భూస్వాములు… పెత్తందారులు గద్దర్ చుట్టూ చేరారు. ఆయన పాటపైనా.. ఆయన గజ్జెపైనా.. గద్దర్ సాగించిన ఉద్యమ స్పూర్తిపైనా ప్రసంగాలు చేశారు. గద్దర్ లేని ప్రజాపాటను ఊహించుకోలేకపోతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. జీవిత చరమాంకంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా మారారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభలో గద్దర్ ఆప్యాయంగా రాహుల్‌ను ముద్దాడారు. అంతమాత్రాన గద్దర్‌కు ఎర్రజెండాతో ఉన్న అనుబంధం చెరిగిపోతుందా ? తెలంగాణలో అధికారం కోసం తపించుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. భూస్వాముల పార్టీగా గద్దర్‌తో అనేక సార్లు విమర్శలెదుర్కొన్న బీఆర్ఎస్ నేతలు మరోవైపు… గద్దర్ చుట్టూ వీళ్లే ఎందుకు కనిపించారు. చివరకు వామపక్ష భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకంచే కాషాయ పార్టీ నేతలు కూడా గద్దర్‌కు నివాళులు అర్పించి.. ప్రజా గాయకుడు మరణించాడంటూ నివాళులు అర్పించడాన్ని ఎర్రజెండా ఎలా చూస్తుంది ?

“ఒక్కొక్కరిగా ఒరిగిపోతూ సుక్కలల్లో కలిసినారా… సుక్కలల్లో కలిసినారా… సుక్కలల్లో కలిసి మీరు సూర్యులై మొలిసినారా…” అంటూ అమరులకు విప్లవాభివందనాలు అర్పించిన గద్దర్‌కు రెడ్ సెల్యూట్ చేసే నేతలే కనుమరుగైపోయారా..? వామపక్ష , విప్లవ పార్టీలకు గద్దర్ ఏమీ కాకుండా పోయారా ? నిండుగా ఎర్రజెండా కప్పి… పేదల బతుకుల్లో వెలుగులు కోసం గద్దర్ చేసిన పోరాటాలను పాటల రూపంలో స్మరించుకుంటూ వామపక్ష నేతలు ఆయనకు రెడ్ సెల్యూట్ ఎందుకు చేయలేకపోయారు. ప్రజానాట్యమండలి కళాకారుడిగా ఎర్రజెండా పార్టీ నిర్వహించిన ఎన్ని సభలు, సమావేశాల్లో గద్దర్ గజ్జెకట్టి హూ..అంటూ హూంకరించి ఉంటారో వాళ్లు మర్చిపోయారా ? బండెనక బండికట్టెనప్పటి నుంచి నిన్న మొన్నటి పోరు తెలంగాణ వరకు కొన్ని తరాలను తన విప్లవ పాటలతో ఊపేసిన గద్దర్ చివరకు ఎర్రజెండాకు కానివాడయ్యాడా…?

నాదేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుష్యులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని.. తన పుస్తకానికి ముఖచిత్రంగా సొంతంగా రాసి సంతకం పెట్టి ముద్రించుకున్న గద్దర్.. ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తానన్నాడు ? భూస్వామ్య, పెత్తందారులకు వ్యతిరేకంగానే కదా.. ఆయన పోరాటం ఎలా చేస్తానన్నాడు ? పాటతోనే కదా.. జీవిత చరమాంకంలో గద్దర్ దారితప్పారని… బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎందుకున్నారని విమర్శిస్తున్నారు. అది నిజమే కావొచ్చు….అంతమాత్రాన ఎర్రజెండాకు ఆయనతో ఉన్న అనుబంధం తెగిపోతుందా ?

దశాబ్దాల తన జీవిన ప్రయాణంలో గద్దర్ ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి..అజ్ఞాతవాసం చేసిన గద్దర్.. చివరకు ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానానికి జైకొట్టడం.. ఎర్రజెండా అభిమానులకు జీర్ణించుకోలేని అంశమే… గద్దర్ సిద్ధాంతాలను ఎందుకు మార్చుకున్నారో.. అసలు మార్చుకున్నారో లేదో.. గుళ్లు గోపురాల చుట్టూ ఎందుకు తిరిగారో… అక్కడ కూడా వెళ్లి.. గజ్జెకట్టి పాట ఎందుకు పాడారో.. గద్దరన్న పాటకే తెలుసు. అయితే గద్దర్ చివరి మజిలీ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అభిమానంతోనో.. ఆయన పాటపై ఉన్న మమకారంతోనో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు.. జూర్జువా పార్టీలు అని ముద్రవేసుకున్న పార్టీలు గద్దర్ కు ఘన నివాళులు అర్పించి ఉండొచ్చు. కానీ ఎందుకో వామపక్షాలు మాత్రం గద్దర్ చివరి ఘడియలను ముందుండి నడిపించలేకపోయారు.