CM kcr: కేసీఆర్ భయపడ్డారా.?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడ్డారా..? గత ఎన్నికల సమయంలో ఉన్నంత ధీమాగా ఇప్పుడు లేరా..? ఆయన చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆందోళనను చెప్పకనే చెబుతున్నాయా..? కచ్చితంగా అవుననే చెప్పాలి.
రెండుసార్లు అధికారంలో ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు మూడోసారి ప్రజాతీర్పు కోరుతున్నారు. తొమ్మిదేళ్లు పవర్‌లో ఉన్నారు కాబట్టి కచ్చితంగా అంతో ఇంతో ప్రజావ్యతిరేకత ఉంటుంది. ఉంది కూడా. అదే ఇప్పుడు కేసీఆర్‌ను కలవరపెడుతోంది. అదే ఆయనలో ధీమాను తగ్గిస్తోంది. తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ బాస్‌లో భయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ అంటే డిఫరెంట్. దేన్నీ లెక్కచేసేవారు కాదు. పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగినా, తిరగడానికి ప్రయత్నించినా ఎంతటి నేతనైనా గడ్డిపోచలా పక్కన పడేసేవారు. ఎంత బలమున్న నేతనైనా పోతే పో అనేవారు. ఉంటే ఉండు పోతే పో అన్నట్లుండేది ఆయన తీరు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. గతంలో తీసుకున్నట్లు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల వేళ గట్టి నిర్ణయాలు తీసుకోకపోవడం వ్యూహాత్మకమే కానీ గత రెండు ఎన్నికలకు ఇప్పుడు తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అసమ్మతిని లైట్ తీసుకునే కేసీఆర్ ఇప్పుడు మాత్రం అలా చేయలేకపోతున్నారు.
చర్యలకు మీనమేషాలెందుకు..?
పట్నం మహేందర్ రెడ్డిని ఇటీవల మంత్రివర్గంలో చేర్చుకున్నారు కేసీఆర్. పట్టుమని ఎన్నికలకు మూడు నెలలు కూడా లేవు. ఇంకో నెల, నెలన్నర తర్వాత కోడ్ వస్తే అధికారం ఉన్నా లేనట్లే… అలాంటి సమయంలో మహేందర్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా తాను జాగ్రత్తపడ్డానని కేసీఆర్ అనుకున్నారు కానీ…అది ప్రపంచానికి వేరే సంకేతాలు పంపింది. పట్నం బ్రదర్స్ వెళ్లిపోతే దాని ప్రభావం నేరుగా మూడు నియోజకవర్గాలపై పడుతుంది. అసలే టఫ్ ఫైట్ అని భావిస్తున్న సమయంలో ప్రతి సీటూ కీలకమే. కాబట్టి మహేందర్ రెడ్డి బయటకు వెళ్లకుండా కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గెలిస్తే మంత్రిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పట్నం బ్రదర్స్ పార్టీని వీడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కేసీఆర్ భయపడ్డారని జనం భావిస్తున్నారు. ఇక మైనంపల్లి హన్మంతరావు విషయంలోనూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. నేరుగా పార్టీని తిట్టకున్నా హరీష్‌రావుపై గట్టి ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను దారుణంగా తిడుతున్న ఆడియో కూడా బయటకు వచ్చింది. అయినా మైనంపల్లిపై కేసీఆర్ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే నిర్ధాక్షణ్యంగా బయటకు పంపేవారు. కానీ ఇప్పుడు మైనంపల్లిపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు గులాబి దళపతి. అసలు హరీష్‌రావుపై అలాంటి వ్యాఖ్యలు చేశాక విడుదల చేసిన బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరుండటమే పార్టీ నేతలను విస్మయ పరిచింది. మా సార్ ఇలా మారిపోయారేంటి అనుకున్నారు. అంతేకాదు ఇంత చేసిన మైనంపల్లిని బుజ్జగించడానికి పార్టీ ప్రయత్నిస్తోందన్న వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విషయంలోనూ కేసీఆర్ కాస్త టెన్షన్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. చెన్నమనేని రమేష్ పార్టీని వదిలిపోతారేమోనన్న భయంతో ఆయనకు హడావుడిగా పదవిని కట్టబెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేశారు.
గవర్నర్ విషయంలో వ్యూహమా.. తప్పిదమా..?
గవర్నర్ విషయంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా లేక తప్పటడుగు వేశారా అన్న చర్చ కూడా ఉంది. ఉప్పునిప్పులా ఉన్న రాజ్‌భవన్, ప్రగతిభవన్ ఒక్కసారిగా కలసిపోయాయి. గవర్నర్‌తో కేసీఆర్ అంత సఖ్యతగా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కనీసం పిలుపుకు కూడా నోచుకోని గవర్నర్ తమిళసైని స్వయంగా ఆహ్వానించడమే కాకుండా సెక్రటేరియట్ మొత్తం తిప్పిచూపారు కేసీఆర్. దీని ద్వారా గవర్నర్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడ్డాననుకున్నారు కేసీఆర్. బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీసానని భావించారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారానికి మరింత ఊపిరినిచ్చారు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని ఓ అస్త్రంగా ప్రయోగించనుంది. ఈ రెండు పార్టీలు ఒకటేనని తాము ముందునుంచి చెబుతున్నామని కాంగ్రెస్ మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లబోతోంది.
గతంలో కేసీఆర్ వేరు.. ఇప్పుడు కేసీఆర్ వేరు.. అంటే ఆయనేదో మారారని కాదు.. కేసీఆర్ ఎప్పుడూ కేసీఆరే.. ఊహించడానికి వీల్లేని వ్యక్తి. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలన్నీ ఊహకు తగినట్లుగానే సాగుతున్నాయి. ఇదే పొలిటికల్ మీడియా సర్కిల్స్‌లో పెద్ద టాపిక్ అయిపోయింది. ఎన్నికల వేళ కావాలనే తగ్గుతున్నారా లేక భయంతో ఇలా చేస్తున్నారా అన్న డిస్కషన్‌కు ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు.