Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభానికి తెర.. సచిన్, అశోక్ గెహ్లాట్ మధ్య కుదిరిన రాజీ.. ఇక దూకుడే!
అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గొడవలు పార్టీకి చేటు చేస్తాయని భావించి, చక్కదిద్దారు. సోమవారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో ఖర్గే, రాహుల్ చర్చలు జరిపారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు.
Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. కొంతకాలంగా సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఉన్న వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిష్కరించింది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చింది. దీంతో తామిద్దరం పార్టీ కోసం పని చేస్తామని అశోక్, సచిన్ ప్రకటించారు.
రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇద్దరిమధ్యా అప్పట్నుంచే అనేక విబేధాలొచ్చాయి. సచిన్ వర్గం ఎమ్మెల్యేల్ని అశోక్ గెహ్లాట్ నిర్లక్ష్యం చేశాడు. తనకు, తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఒక దశలో సచిన్ పార్టీకి ఎదురుతిరిగాడు. తన వర్గం ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేశాడు. అధిష్టానం జోక్యంతో అప్పట్లో సచిన్ తలొగ్గాడు. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాడు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా సార్లు అశోక్ వైఖరిపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో సచిన్ మళ్లీ తిరుగుబాటు చేశాడు. గత బీజేపీ ప్రభుత్వం.. అంటే అప్పటి సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతి, ఉద్యోగాల నియామక పరీక్ష పేపర్ల లీకేజీ వంటి అంశాల్లోగా 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే తన ఆందోళన మరింత ఉధృతం చేస్తానని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని సచిన్ హెచ్చరించాడు. తన పార్టీయే అధికారంలో ఉన్నా.. తన డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటూ ఉద్యమం చేశాడు. సచిన్ విధించిన గడువు పూర్తవుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. సొంత పార్టీపైనే ఇలా సచిన్ పోరాడటం సరికాదని భావించిన అధిష్టానం ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది.
ఖర్గే, రాహుల్ కలిసి
పార్టీలో అంతర్గత విబేధాలు సరికాదని భావించిన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గొడవలు పార్టీకి చేటు చేస్తాయని భావించి, చక్కదిద్దారు. సోమవారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో ఖర్గే, రాహుల్ చర్చలు జరిపారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సోమవారం అర్ధరాత్రి వరకు ఇరువురిని కలిపి చర్చించారు. ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు. ఇరువురి మధ్యా చాలా కాలంగా విబేధాలున్నా.. వాటిని అధిష్టానం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చినా.. ఈసారి మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇద్దరినీ ఒకేసారి కూర్చోబెట్టి చర్చలు జరపలేదు. ఈసారి ఇద్దరు నేతల్ని కలిపి సమస్య పరిష్కరించింది. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో పెద్ద సమస్య తీరినట్లే.
ఎన్నిలకపై ఫోకస్..
ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలపడటం చాలా ముఖ్యం. ఇంతకాలం పార్టీకి సమస్యగా ఉన్న అంతర్గత విబేధాలు తాజా సమావేశంతో తొలగిపోయాయి. పార్టీకోసం కలిసి పని చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఇకపై ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయబోతున్నారు. కలిసికట్టుగా ఉంటూ, బీజేపీని మరోసారి ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు అశోక్, సచిన్ ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిస్తే మరోసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా మొదలవుతుంది.