ASSEMBLY BUDGET: తగ్గిన కేసీఆర్.. నెగ్గిన గవర్నర్..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24కు ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వం, అటు రాజ్‌భవన్ తరఫు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా అంగీకరించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. అలాగే, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతించనున్నట్లు రాజ్‌భవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.
ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం చాలాకాలం కిందటే నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ కు ఆమోదం తెలపాలంటూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈనెల 21న గవర్నర్ కు లేఖ రాశారు. అయితే దానికి గవర్నర్ నుంచి రిప్లై రాలేదు. దీంతో ఫైనాన్స్ శాఖ సెక్రటరీ నేరుగా గవర్నర్ ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు. అయినా గవర్నర్ స్పందించలేదు. దీంతో 27న హరీశ్ రావు మరోసారి లేఖ రాశారు. అయితే దీనికి గవర్నర్ కార్యాలయం నుంచి 28న రిప్లై వచ్చింది. రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా.. గవర్నర్ స్పీచ్ ఉంటుందా.. అని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. వాస్తవానికి క్రితంసారి లాగే గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అయితే గవర్నర్ లేఖతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. అందుకే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనిపై ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇరువైప వాదనలు వినింది న్యాయస్థానం.
ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదని.. గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు నిర్వహిస్తోందని గవర్నర్ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్ ను ప్రభుత్వం ఏమాత్రం గౌరవించట్లేదని.. అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంతు దవే స్పందించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్ కు కచ్చితంగా గౌరవం ఇవ్వాలని.. పైగా ఆ పదవిలో ఉన్నది మహిళ కాబట్టి తప్పకుండా గౌరవించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అంతేకాక.. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హామీ ఇచ్చారు. దీనిపై గవర్నర్ తరపు న్యాయవాది సంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కు గవర్నర్ వీలైనంత త్వరగా ఆమోదం తెలుపుతారని హైకోర్టు దృష్టికీ తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం తన లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కు తీసుకునేందుకు కోర్టు పర్మిషన్ అడిగింది. దీనికి ధర్మాసనం అనుమతించడంతో ఇరువర్గాల మధ్య సమస్య కొలిక్కి వచ్చినట్లయింది.
తెలంగాణలో గవర్నర్ కు, గవర్నమెంటుకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. పలు వేదికలపై ఒకరినొకరు విమర్శించుకున్న సందర్భాలున్నాయి. గవర్నర్ తీరును సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు తప్పుబట్టారు. అదే సమయంలో గవర్నర్ కూడా ప్రభుత్వం సహకరించట్లేదంటూ పల సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఒక జాతీయ మీడియా చర్చలో ఆమె నెరుగా పాల్గొనడం మరిన్ని వివాదాలకు కారణమైంది. అయితే ఇద్దరూ పరిధి మీరారనే భావన అందరిలోనూ ఉంది.
అయితే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్ ను విమర్శించడం ఉల్లంఘన కిందకే వస్తుందని రాజ్ భవన్ వర్గాలు, బీజేపీ శ్రేణలు అంటున్నాయి. అదే సమయంలో గవర్నర్ కూడా బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర 7 బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పుడు ఈ బిల్లులకు కూడా మోక్షం కలిగే అవకాశం ఉందని భావించవచ్చు. తనకు ప్రభుత్వం గౌరవం ఇవ్వట్లేదనే బాధే గవర్నర్ కు ఎక్కువ ఉంది. ఇప్పుడు కోర్టు ద్వారా ఆ భంగానికి బ్రేక్ పడేలా చేశారు గవర్నర్. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి నెగ్గినట్లయింది. అయితే కేసీఆర్ పంథాకు ఇది భిన్నం.