ASSEMBLY ELECTIONS: 24 స్థానాల్లో ఒకే పేరుతో అభ్యర్థులు.. బీఆర్ఎస్‌ను మాములు టార్గెట్‌ చేయలేదుగా..

గుర్తును పోలిన గుర్తులతో కొందరు.. పేర్లను పోలిన పేర్లతో అభ్యర్థులను దింపి మరికొందరు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ తెలంగాణలో అలాంటి పరిణామమే జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 24 స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలిన పేర్లతో మరికొందరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 07:45 PMLast Updated on: Nov 16, 2023 | 2:08 PM

Assembly Elections In Telangana Candidates With Same Names Creating Confusion In Voters

ASSEMBLY ELECTIONS: రాజకీయం ఇలానే చేయాలని ఏ బుక్‌లో లేదు. రాజకీయం అనేది అమీబా లెక్క! ఎప్పటికప్పుడు ఆకారం, రూపం మార్చుకుంటూ ఉంటుంది. ఎన్నికల వేళ తెలంగాణలో ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయ్. గెలుపు కోసం రాజకీయ పార్టీలు.. ప్రతీ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయ్. నిజానికి విజయం కోసం పార్టీలు వేసే ఎత్తుగడలు, వ్యూహాలు.. అంత ఈజీగా అందవు ఎవరికీ! గుర్తును పోలిన గుర్తులతో కొందరు.. పేర్లను పోలిన పేర్లతో అభ్యర్థులను దింపి మరికొందరు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ తెలంగాణలో అలాంటి పరిణామమే జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 24 స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలిన పేర్లతో మరికొందరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహం ఎలా ఉంది అని ఈ వివరాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు! 24స్థానాల్లో అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే.. బీఆర్ఎస్‌నే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ASSEMBLY ELECTIONS: మా సంగతేంటి..?.. స్కూల్ ఫీజులు.. హాస్పిటల్ బిల్లులపై ప్రశ్నిస్తున్న మిడిల్ క్లాస్..!

అధికార BRS అభ్యర్థుల పేరుతోనే.. ఇతర పార్టీల నేతలు, ఇండిపెండెంట్లు ఆయా స్థానాల్లో బరిలో నిలిచారు. నిర్మల్‌లో చూస్తే.. బీఆర్ఎస్‌ తరఫున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పోటీ చేస్తుంటే.. ఏడీఆర్ పార్టీ నుంచి మంతెన ఇంద్రకరణ్‌రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మహేశ్వరంలో బీఆర్ఎస్‌ తరఫున సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తుండగా.. మద్ది సబిత అనే మహిళ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముషీరాబాద్‌ నుంచి బీఆర్ఎస్‌ తరఫున ముఠా గోపాల్‌ పోటీ చేస్తుండగా.. ఆలిండియా హిందుస్థాన్ కాంగ్రెస్ అనే పార్టీ నుంచి ఎమ్ గోపాల్‌ బరిలో ఉన్నారు. ఇక పరిగి నుంచి బీఆర్ఎస్ తరఫున కొప్పుల మహేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. ఏడీఆర్ పార్టీ నుంచి మారెడ్డి మహేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. సనత్‌నగర్‌ నుంచి బీఆర్ఎస్ తరఫున తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా.. యుగతులసి అనే పార్టీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్‌ నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. సి శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలవగా.. ఏడీఆర్ పార్టీ నుంచి కట్టా ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.

Nara Chandrababu Naidu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ దాఖలు.. నివేదికలోని విషయాలివే..!

ఆందోళ్‌లో చంటి క్రాంతికిరణ్‌ బీఆర్ఎస్‌ తరఫున పోటీ చేస్తుంటే.. ఎన్‌. క్రాంతికుమార్‌ పేరుతో ఒకరు, పి. క్రాంతికుమార్‌ పేరుతో మరొకరు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. జహీరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున ఏ చంద్రశేఖర్‌ పోటీ చేస్తుండగా.. చంద్రశేఖర్‌, ఎం చంద్రశేఖర్‌, ఎడ్ల చంద్రశేఖర్‌ అని ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ తరఫున మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. ఏడీఆర్ పార్టీ నుంచి కిషన్‌రెడ్డి అనే వ్యక్తి బరిలో ఉన్నారు. రాజేంద్రనగర్‌ నుంచి బీజేపీ తరఫున తోకల శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. కె శ్రీనివాస్‌రెడ్డి అనే ఇండిపెండెంట్‌ కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. దేవరకద్రలో బీఆర్ఎస్‌ నుంచి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి అనే ఇండిపెండెంట్‌‌గా బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. గవిండ్ల మధుసూదన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తుంటే.. ఆర్‌యూపీపీ అనే పార్టీ నుంచి బండ్ల మధుసూదన్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. గద్వాలలో కాంగ్రెస్‌ తరఫున సరిత పోటీలో ఉండగా.. జి సరిత అనే మహిళ నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి, సరిత అనే మరో మహిళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షాద్‌నగర్‌ నుంచి బీఆర్ఎస్ తరఫున అంజయ్య బరిలో ఉండగా.. అంజయ్య పేరుతో మరో అభ్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కొల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. కీసరి హర్షవర్ధన్‌రెడ్డి అనే ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు.

హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేస్తుంటే.. తిమ్మారెడ్డి సైదిరెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా.. గుంటోజు వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. గోషామహల్‌ నుంచి బీఆర్ఎస్ తరఫున నందకిశోర్‌ వ్యాస్‌ నామినేషన్‌ వేస్తే.. శుభం వ్యాస్‌, సందీప్‌ వ్యాస్‌ అని ఇద్దరు ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి అజ్మీరా శ్యామ్‌నాయక్‌ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారావు బరిలో ఉన్నారు. అజ్మీరా రామ్‌నాయక్‌ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. ఖానాపూర్‌ నుంచి బీజేపీ తరఫున రమేశ్‌ రాథోడ్ పోటీ చేస్తుంటే.. రితేశ్‌ రాథోడ్‌ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. ముథోల్‌ నుంచి కాంగ్రెస్ తరఫున పటేల్‌ నారాయణరావు పోటీ చేస్తుంటే.. బీజేపీ నుంచి పటేల్‌ రామారావు బరిలో ఉన్నారు. ములుగులో బీఆర్ఎస్ తరఫున బడే నాగజ్యోతి పోటీ చేస్తుంటే.. బడే విద్యాసాగర్‌ ఇండిపెండెంట్‌గా ఉన్నారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తున్నారు. ధర్మపురిలో బీజేపీ నుంచి ఎస్‌ కుమార్‌ పోటీ చేస్తుంటే.. కాంగ్సెస్‌ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బరిలో ఉన్నారు. ఇలా పేర్లను పోలిన పేర్లతో ఇండిపెండెంట్‌లను బరిలో ఉంచడం ద్వారా.. జనాల అటెన్షన్ డైవర్ట్‌ చేసి.. ఓట్లు చీల్చి లాభపడాలన్నది పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది.