Assembly Elections: తెలంగాణలో ఎన్నికల డేట్ వచ్చేస్తోంది.. ఏర్పాట్లు చేస్తున్న ఈసీ..!
ఎన్నికల సన్నద్ధతపై సర్వే నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో ఈ బృందం వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
Assembly Elections: తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ రెండో వారంలోగా షెడ్యూల్ ప్రకటించేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఎన్నికల సన్నద్ధతపై సర్వే నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో ఈ బృందం వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. గతంలో అసెంబ్లీ గడువుకు ముందుగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశారు.
దీంతో 2018 అక్టోబరు 6న షెడ్యూల్ వచ్చింది. డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతోపాటు స్థానిక పండగల సెలవులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది.
షెడ్యూల్ ప్రకటించటానికి ముందు ఒకసారి, నామినేషన్ల గడువు ముగిసిన తరవాత మరోసారి ఈ పర్యటనలు ఉంటాయి. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేయనున్నారు.