రాత్రి 11 గం లకు… విడదల రజినికి 2 కోట్లు… ఎలా దొరికిందంటే…
ఎట్టకేలకు మాజీమంత్రి విడుదల రజనీపై కేసు నమోదయింది. గతంలో వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఎట్టకేలకు మాజీమంత్రి విడుదల రజనీపై కేసు నమోదయింది. గతంలో వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.2 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో దానిపై ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఈ మేరకు గవర్నర్ ముందు ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదుకు అనుమతి కోరుతూ ఓ లేఖ రాశారు. దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వటంతో విడుదల రజనీపై కేసు నమోదు అయింది. ఆమెతోపాటుగా మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. మైనింగ్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారిపై కూడా కేసు నమోదయింది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె అరాచకాలకు అన్ని విధాలుగా సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడుగా చేర్చారు. ఇక ఆమె మరిది గోపి తో పాటుగా పిఎ రామకృష్ణ పై కూడా కేసు నమోదయింది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్ట్ గేటెడ్ యూనిట్ శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును విడుదల రజిని బెదిరించారు. ముందు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని తన పిఏ దొడ్డ రామకృష్ణ ద్వారా విడుదల రజిని డిమాండ్ చేయించారు.
ఆ తర్వాత అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారి జాషువాతో పాటుగా మరిది గోపిని రంగంలోకి దించారు రజిని. అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే 10.163 హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చలపతిరావు స్పష్టం చేశారు. తాను డబ్బులు ఇచ్చేది లేదని చలపతిరావు ఎదురు తిరిగారు. ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందేనని లేదంటే 50 కోట్ల రూపాయల జరిమానా తప్పదంటూ ఐపీఎస్ అధికారి జాషువా బెదిరింపులకు దిగారు. తన బృందంతోపాటుగా మైనింగ్ అలాగే రెవిన్యూ శాఖ అధికారులతో కలిసి 2020 సెప్టెంబర్ 20న తనిఖీలు నిర్వహించారు.
ఆ తర్వాత జరిమానా విధించేందుకు అనుకూలంగా గుంటూరులోని విజిలెన్స్ కార్యాలయంలో ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ తర్వాత చలపతిరావును పిలిపించి బేరాలు ఆడారు. 2021 ఏప్రిల్ 4 తారీఖు రాత్రి 11 గంటల సమయంలో చిలకలూరిపేటలోని విడుదల రజిని ఇంట్లో ఆమె మరిది గోపి చేతికి రెండు కోట్ల రూపాయల నగదు ఇచ్చారు. తాను ఐదు కోట్లు ఇవ్వలేనని రెండు కోట్లు ఇచ్చుకుంటానని చలపతిరావు మొర పెట్టుకోవడంతో 2.2 కోట్లకు బేరం కుదిరించారు.
దీంతో చలపతిరావు తన బిజినెస్ పార్టనర్ నంబూరు శ్రీనివాసరావు పెరవలి నాగవంశం ద్వారా విడుదల గోపికి చిలకలూరిపేటలో జాషువాకు గుంటూరులో వారు అడిగినంత మొత్తం ఇచ్చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ముందు చలపతిరావు ఫిర్యాదు పై విచారించి వాస్తవాలను వెలికి తీసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఎట్టకేలకు గవర్నర్ అనుమతి రావడంతో రజినిపై కేసు నమోదయింది. ఐపీఎస్ అధికారిగా ఉండి రాజకీయ నాయకులకు సహకరించిన జాషువాపై చర్యలకు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు.