బాబుకి మోడీ కావాలి..మోడీకి పవన్ కావాలి..!
బిజెపికి చంద్రబాబు అవసరం.. బిజెపికి పవన్ ఆయుధం.. ఇప్పుడు దక్షిణాదిలో వినపడుతున్న మాట.. దేశ రాజకీయాలను.. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

బిజెపికి చంద్రబాబు అవసరం.. బిజెపికి పవన్ ఆయుధం.. ఇప్పుడు దక్షిణాదిలో వినపడుతున్న మాట.. దేశ రాజకీయాలను.. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. హిందుత్వ ఎజెండాతో పుట్టిన బిజెపి.. ఉత్తరాదిలో తాను వేసుకున్న బలమైన పునాదులను మతం ఆధారంగానే వేసుకుంది. ఇప్పుడు అవే పునాదులను తమకు ఏ మాత్రం బలం లేని దక్షిణాది లో కూడా బలంగా వేయాలని బిజెపి పెద్దలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందుకు వాళ్లకు ఉన్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ పవర్ బాంబ్ మాత్రమే.
సనాతన ధర్మాన్ని దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కేంద్రంగా విస్తరించాలనేది బిజెపి పెద్దల వ్యూహం. ఇప్పుడు పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత, పవన్ చేస్తున్న వ్యాఖ్యలు.. పవన్ చేస్తున్న పర్యటనలు అన్నీ ఇదే కోణంలో కనపడుతున్నాయి. ఇటీవల కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. వ్యక్తిగత పర్యటన అంటూ తన కొడుకుని కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు పవన్. మహారాష్ట్ర ఎన్నికల తర్వాతి నుంచి పవన్ కళ్యాణ్.. దక్షినాది రాష్ట్రాల్లో పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఆ వార్తలకు బలం చేకూరుస్తూ.. మరో ఏడాదిలో జరగనున్న తమిళనాడు, కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తాజా పర్యటన జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. తమిళనాడులో సనాతన ధర్మంపై యుద్ధం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తోంది. తమిళనాడు సిఎం తనయుడు, ఉధయనిది స్టాలిన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు.. మతపరంగా హీట్ పెంచుతున్నాయి. ఈ తరుణంలో.. క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను తమిళనాట ప్రయోగిస్తే తమకు లాభం ఉండే అవకాశం ఉందని బిజెపి అంచనాలు వేసుకుంటుంది.
కేరళలో పెరిగిన మత ప్రచారం, తమిళ నాట జరగుతున్న సనాతన ధర్మ విధ్వంశం అన్నీ కూడా ఇప్పుడు బిజెపి.. పవన్ భుజాలపై తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో అన్నాడిఎంకె ఉన్నా సరే ఇప్పుడు నాయకత్వ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. అందుకే బిజెపి.. ఆ అవకాశాన్ని వాడుకుని బలపడాలని పావులు కదుపుతోంది. కేరళలో లెఫ్ట్ లేదంటే కాంగ్రెస్ అన్నట్టు గానే రాజకీయం ఉంటుంది. బిజెపి ఎంత ప్రయత్నం చేసినా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం మాత్రం ఆమడదూరంలోనే ఉంటోంది. అందుకే ఇప్పుడు బిజెపి జాగ్రత్తగా పవన్ ను రంగంలోకి దించింది.
అక్కడి యువతలో సనాతన ధర్మ భావాలను పెంచాలని, అన్నామలై వంటి నాయకులను పవన్ ను అడ్డం పెట్టుకుని షైన్ చేయాలని బిజెపి వ్యూహం సిద్దం చేస్తోంది. కేరళలో అక్కడి యువత మార్పు కోరుతోందని బిజెపి తన అంతర్గత సర్వేలలో తెలుసుకుంది. ఇక తమిళనాట కూడా మార్పు కోరుతున్నారనే అంచనాకు బిజెపి వచ్చింది. కారణం.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 12 స్థానాల్లో బిజెపి గెలవడం. అసలు ఏ మాత్రం పట్టులేని తమిళనాట బిజెపి ఈ స్థాయిలో పట్టు పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప మార్పే.
ఇలాంటి టైంలో కేరళ, తమిళనాడును ముడిపెడుతూ పవన్ కళ్యాణ్… సనాతన ధర్మ యాత్ర చేస్తున్నారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. దక్షిణాదిలో.. కర్ణాటకలో మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులే గాని.. తనకు తానుగా ఎదిగే అవకాశం ఆ పార్టీకి లేదు. తెలంగాణాలో బీఆర్ఎస్ ను బలహీన పరుస్తోంది క్రమంగా. ఏపీలో టీడీపీని దూరం చేసుకునే అవకాశం లేదు. చేసుకుంటే తమకే నష్టం అనే భావనలో బిజేపి పెద్దలు ఉన్నారు. కేరళ తమిళనాడులో మాత్రం బిజెపి అలాంటి సానుకూల వాతావరణం లేదు.
అందుకే ఇప్పుడు బిజెపి.. తాను సొంతగా సనాతన ధర్మ పరిరక్షణను అడ్డం పెట్టుకుని పైకి రావాలని పావులు కదుపుతోంది. ఇలాంటి టైంలో ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని బిజెపి భావిస్తోంది. అందుకే మోడీ.. పదే పదే పవన్ కళ్యాణ్ కు వాల్యూ ఇస్తూ ఉంటారు. బిజేపిని సపోర్ట్ చేసే జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ను లేపుతోంది. తాజాగా ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ వెళ్ళిన సందర్భంగా.. మోడీ ఇతర నాయకుల కంటే పవన్ కు ఎక్కువ వెయిట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే.. దక్షిణాదిన.. తమ చేతిలో ఉన్న ఆయుధానికి మరింత పదును పెట్టాలని బిజెపి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టుగానే కనపడుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం.