బాలాపూర్ గణేషుడి కొత్త రికార్డులు.. లడ్డూ చరిత్ర తెలిస్తే.. మీరే కొనేస్తారు…

11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 07:25 PMLast Updated on: Sep 16, 2024 | 7:25 PM

Balapur Ganesh Laddu History

11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. ఏ ఏడాదికి ఆ ఏడాది.. రికార్డు స్థాయిలో ధర పలుకుతూ.. కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతూ ఉంటుది.

వేలంపాటలో బాలాపూర్ గణేష్‌ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. బాలాపూర్​గణేష్​ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్​ రెడ్డి ఆధ్వర్యంలో.. ఏటా దేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒక గుడి ఆకృతిలో గణేష్ మండపం నిర్మించడం ఇక్కడి మరో ప్రత్యేకత. గతేడాది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనాలో మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు అయోధ్య రామమందిరం ఆకృతిలో డిజైన్ చేశారు. బాలాపూర్​గణేష్​ విగ్రహం కూడా.. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా.. ఏడు కొత్త తరహాలో గణేష్​విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది గణేషుడి తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు కలిసి మదనం చేస్తున్నట్లుగా రూపొందించిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

1994లో మొదటిసారి బాలాపూర్‌లో గణేషుడిని ప్రతిష్టించారు. అప్పటి నుంచి 2023 వరకు.. లడ్డూ వేలం పాటలో దాదాపు 2కోట్ల వరకు వచ్చాయ్‌. ఏటా లడ్డూ ధర పెరుగుతూనే ఉంది. బాలాపూర్ లడ్డూ చరిత్రలో ఇదే ప్రాంతానికి చెందిన కొలన్ కుటుంబ సభ్యులు 1994 నుంచి మొదలుకుని 2019 వరకు చాలా సార్లు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే వేలంలో పాల్గొని ఈ లడ్డును దక్కించుకున్నారు. బాలాపూర్‌ లడ్డూ దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పోటీ పడుతుంటారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చి మరీ వేలంపాటలో పాల్గొంటారు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ లడ్డూ క్రేజ్ ఏంటో.. లాస్ట్ ఇయర్‌ దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు లడ్డూ దక్కించుకున్నాడు. 1994లో మొదటిసారి జరిగిన వేలంలో 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి లడ్డూను దక్కించుకోగా.. 1995లో 4500 రూపాయలకు ఆయనే మళ్లీ లడ్డూ వేలం పాట పాడారు.

1996లో 18 వేలకు 1997లో 28 వేలు కొలన్ కృష్ణారెడ్డి లడ్డూ దక్కించుకున్నాడు. 1998లో 51వేలకు కొలన్ మోహన్ రెడ్డి… 1999లో 65 వేలకు కల్లెం ప్రతాప్ రెడ్డి.. 2000లో 66 వేలకు కల్లెం అంజి రెడ్డి.. 2001లో 85 వేలకు రఘునందన్ చారి.. 2002లో లక్షా 5 వేలకు కందాడ మాధవరెడ్డి.. 2003లో లక్షా 55 వేలకు చిగురింత తిరుపతి రెడ్డి.. 2004లో 2 లక్షలకు కొలన్ మోహన్ రెడ్డి.. 2005లో 2 లక్షల 8 వేలకు ఇబ్రహీం శేఖర్.. 2006లో 3 లక్షలకు చిగురంత తిరుపతి రెడ్డి.. 2007లో 4 లక్షల 15 వేలకు రఘునందన్ చారి.. 2008లో 5 లక్షల 7 వేలకు కొలన్ మోహన్ రెడ్డి.. 2009లో 5 లక్షల 10 వేలకు సరిత.. 2010లో 5 లక్షల 35 వేలకు కొలన్ శ్రీధర్ బాబు.. 2011లో 5 లక్షల 45వేలకు కొలన్ బ్రదర్స్.. 2012లో 7 లక్షల 50 వేలకు పన్నాల గోవర్దన్ రెడ్డి.. 2013లో 9 లక్షల 26 వేలకు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి.. 2014లో 9 లక్షల 50 వేలకు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి.. 2015లో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్ మోహన్ రెడ్డి.. 2016లో 14 లక్షల 65 వేలకు స్కైల్యాబ్ రెడ్డి.. 2017లో 15 లక్షల 60 వేలకు నాగం తిరుపతి రెడ్డి.. 2018లో 16 లక్షల 60 వేలకు శ్రీనివాస్ గుప్తా.. 2019లో 17 లక్షల 50 వేలకు కొలన్ రాంరెడ్డి… వేలంలో లడ్డూ దక్కించుకున్నారు.

2020లో కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. ఆ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అందించారు. 2021లో అప్పటి ఏపీ ఎమ్మెల్సీ రమేష్‌తో కలిసి మర్రి శశాంక్ రెడ్డి 18 లక్షల 90 వేలకు దక్కించుకోగా.. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60 వేలకు.. 2023లో 27 లక్షలకు దాసరి దయానంద్‌ రెడ్డి లడ్డూ కైవసం చేసుకున్నారు. బాలాపూర్‌ లడ్డూ వేలం ద్వారా వచ్చి డబ్బులను.. బాలాపూర్​గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగిస్తూ.. నిర్వాహకులు ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గణేష్​ అసోసియేషన్​ఆధ్వర్యంలో.. బాలాపూర్‌లో హనుమాన్​ మందిరం, లక్ష్మీ గణపతి మందిరం నిర్మాణాలు చేపట్టారు. 130గజాల గణేష్​మండప స్థలం కొనుగోలు చేశారు. ఇక బాలాపూర్​ హైస్కూల్‌ అభివృద్ధికి.. వేణుగోపాలస్వామి దేవాలయ పునర్నిర్మాణానికిస, గణేష్​ చౌక్‌కు, శివాలయం అభివృద్ధికి, కంఠ మహేశ్వర స్వామి మందిరం అభివృద్దికి గణేష్‌ అసోసియేషన్‌.. ఈ లడ్డూ వేలం డబ్బులను ఖర్చు చేసింది. పోచమ్మ మందిరం నిర్మాణం, మహంకాళి మందిరం, మల్లన్న గుడి.. అయ్యప్ప స్వామి సన్నిధానం అభివృద్ధి.. ఇలా లడ్డూ వేలంతో వచ్చే ప్రతీ పైసాను మళ్లీ జనం కోసమే ఖర్చు పెడుతుంటారు.